మధుమేహం, లేదా చక్కెర వ్యాధి, దీనికి భారతదేశం ప్రపంచ రాజధానిగా మారింది. దేశంలో 21.20 కోట్ల మందికిపైగా మధుమేహ బాధితులు ఉన్నారు. ప్రపంచంలోని మధుమేహ రోగుల్లో 26 శాతం మంది ఇక్కడే ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
అత్యధికులు వైద్యం తీసుకోవట్లేదు
అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే మధుమేహ బాధితుల్లో చాలా మంది చికిత్స తీసుకోవడం లేదు. 70.7 శాతం పురుషులు, 72.2% మంది మహిళలకు ఎలాంటి ట్రీట్‌మెంట్ అందడం లేదు. వీళ్లంతా తమకు మధుమేహం ఉన్న విషయాన్ని పట్టించుకోకపోవడమో, లేదా క్రమం తప్పకుండా వైద్యుల వద్దకు వెళ్లడం మనేయడమో చేస్తున్నారు. ఈ విషయం ‘ద లాన్సెట్’ అంతర్జాతీయ వైద్య పత్రిక తాజాగా చేసిన అధ్యయనంలో తేలింది.
పెరిగిన బాధితులు
1980తో పోలిస్తే 2022 నాటికి మన దేశంలో 10 శాతం పురుషులు, 12 శాతం మహిళల్లో మధుమేహం పెరిగిందని ‘ద లాన్సెట్’ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలోని మొత్తం పురుషుల్లో 21.4 శాతం, మహిళల్లో 23.7 శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఎప్పటినుంచో మన దేశం మధుమేహానికి ప్రపంచ రాజధానిగా పేరొందింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన వద్ద అత్యధికంగా 21.20 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు.
చికిత్సలు తప్పనిసరి
44 ఏండ్లుగా మన దేశంలో మధుమేహానికి చికిత్సలు మెరుగవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో మధుమేహ నియంత్రణ, చికిత్సలకు ప్రత్యేక దవాఖానలు ఉన్నాయి. అయితే, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు చికిత్స తీసుకునేందుకు జంకుతున్నారు. మధుమేహ స్థాయిని తెలుసుకునే పరీక్షలు నెలకోసారి, మరికొన్ని మూడు నెలలకోసారి చేయించుకోవాలి. ఏడాదికోసారైనా మూత్రపిండాల పనితీరు, దృష్టిదోషం, ఇతరత్రా అవయవాల పనితీరు పరీక్షలు తప్పనిసరి. మధుమేహ బాధితులకు ఎక్కువగా పాదాలకు గాయాలవుతుంటాయి. అయితే, వీటిని సరిగ్గా పట్టించుకోకపోతే పాదాలు తొలగించాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. ఇలాంటి వాటిని నిరోధించడానికి పోడియాట్రీ క్లినిక్‌లు కూడా వస్తున్నాయి. ఇవి కేవలం మధుమేహ బాధితుల పాదాల సంరక్షణ కోసమే ఉన్నాయి.
చికిత్సకు దూరంలోనూ టాప్
ఇప్పటికీ మధుమేహానికి ఏ మాత్రం చికిత్స పొందనివారిలో 30 శాతం మంది మన దేశంలోనే ఉన్నారు. అంటే దాదాపు 13.3 కోట్ల మంది. ఇది కూడా ప్రపంచంలో అత్యధిక సంఖ్య, వాటా కావడం గమనార్హం. 7.8 కోట్ల మంది చికిత్స పొందని మధుమేహ బాధితులతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో మొదటి స్థానంలో ఉన్న భారతదేశానికి, రెండో స్థానంలో ఉన్న చైనాకు దాదాపు 50 శాతం తేడా ఉన్నది. పాకిస్థాన్‌లో 2.4 కోట్లు, ఇండోనేషియాలో 1.8 కోట్ల మంది మధుమేహ బాధితులు చికిత్సకు దూరంగా ఉన్నారు.
దృష్టి సారించాలి
మధుమేహం ఉన్నట్లు గుర్తిస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని ‘ద లాన్సెట్’ పేర్కొన్నది. అందువల్లే చికిత్సలో ఇంత ఎక్కువ వైవిధ్యం ఉంటున్నది. చికిత్స కవరేజీ పెరగాలంటే ముందుగా మధుమేహ కేసులను గుర్తించడాన్ని మెరుగుపరచాలి. దక్షిణాసియలోని చాలా దేశాలు మధుమేహ ప్రారంభాన్ని నివారించడానికి తగినంత కృషి చేయడం లేదు. నిజానికి భారత్‌లో ఇప్పటికే సార్వత్రిక ఆరోగ్య బీమా పథకాలున్నాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, వయవందన యోజన లాంటి పథకాలతో ప్రాథమిక సంరక్షణకు మంచి అవకాశాలున్నాయి. దీంతో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారిని కూడా ముందుగానే గుర్తించి, నిరోధించడం లేదా కనీసం కొంత లేటుగా రావడానికి ఆహారం, జీవనశైలి మార్పులు, మందులు సూచించొచ్చు. మధుమేహ పరీక్షలపై తగినంత శ్రద్ధ లేకపోవడం, వనరులు తగినతంగా ఉండకపోవడం లాంటి పరిస్థితులున్న దేశాల్లో మాత్రం ఈ విధానాన్ని అంతగా వినియోగంచలేరు. కానీ భారత్‌లో ఇందుకు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే దీనిపై దృష్టిపెట్టాలి.
ఇక్కడే ఎందుకు ఎక్కువ?
ఒక దేశంలో మధుమేహం ఎక్కువగా ఉందంటే ప్రధానంగా జన్యుపరమైన, వాతావరణ సంబంధిత కారణాలు ఉండాలి. దక్షిణాసియాలోని చాలా దేశాల్లో మధుమేహం ఎక్కువ కావడానికి ఇవే కారకాలు అవుతున్నాయి. దీనికితోడు చిన్నతనంలో ఎక్కువ ఆహారం పెట్టడంతో ఊబకాయం రావడం, గర్భిణులకు వివిధ ప్రాంతాల్లో అధిక ఆహారం ఇవ్వడంతో గర్భస్థ శిశువులు కూడా బరువు పెరగడం లాంటివి కారణాలవుతున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత భారత్‌లోనే అత్యధికంగా పిల్లల్లో ఊబకాయం ఉంటోంది.
ఆర్థిక స్వాతంత్రం పెరిగితే
‘పండ్లు, కూరగాయలు లాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనేందుకు వీలుగా ప్రజలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని పెంచాలి. భారత్ లాంటి దేశాలకు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ నివేదిక ప్రకారం సగం మంది భారతీయులు (55 శాతం) ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనలేరు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందుబాటులో ఉంచి, తగినంత క్రీడా సదుపాయాలు కల్పించడం చాలా ముఖ్యం. క్రీడలు, కనీస వ్యాయామాల ద్వారా తగినంత శారీరక కార్యకలాపాలు జరుగుతాయి. అప్పుడే మధుమేహం లాంటి జీవనశైలి వ్యాధులు కొంతవరకు దూరమవుతాయి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులు కొనుగోలు చేసేవారికి సబ్సిడీలు, వోచర్లు, నగదు బదిలీ లాంటి ఆకర్షణీయమైన చర్యలు చేపడితే కొందరైనా అటువైపు మొగ్గుచూపుతారు’ అని లాన్సెట్ నివేదిక పేర్కొన్నది. శరీర బరువును పెంచే రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలపై పన్నులు అధికంగా వేయడం కూడా ముఖ్యమేనని తెలిపింది.