Alaska Purchase 1867: అగ్రరాజ్యాల మధ్య జరిగిన అతిపెద్ద చారిత్రక ఒప్పందాల్లో ఒకటి… ఎకరా కేవలం నాలుగు పైసలకే అమ్మకం! మంచుతో కప్పబడిన ఓ నిర్జన ప్రదేశం అనుకుంటే, అదిప్పుడు అమెరికాకు అంతులేని సహజ సంపదలను అందిస్తున్న బంగారు గని. అదే అలస్కా! ఒకప్పుడు రష్యా సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న ఈ భూభాగాన్ని, రష్యానే స్వయంగా అమెరికాకు ఎందుకు కట్టబెట్టింది.
పీటర్ ది గ్రేట్‌తో మొదలైన కథ : 18వ శతాబ్దం ప్రారంభంలో రష్యా చక్రవర్తి పీటర్ ది గ్రేట్ దృష్టి తూర్పున ఉన్న అంతుచిక్కని భూభాగంపై పడింది. ఆయన ఆదేశాలతో 1725లో డెన్మార్క్‌కు చెందిన నావికుడు విటస్ బేరింగ్ ఒక సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆసియా, ఉత్తర అమెరికా ఖండాలను వేరుచేస్తున్న సన్నని సముద్ర మార్గాన్ని ఆయన కనుగొన్నారు. కాలక్రమంలో దీనికే ‘బేరింగ్ జలసంధి’ అని పేరు స్థిరపడింది. ఆయన అలస్కా తీర ప్రాంతాల మ్యాపులను సిద్ధం చేసి చక్రవర్తికి సమర్పించారు. ఆ సమయంలో అలస్కా కేవలం మంచు దిబ్బలతో, ట్లింగిట్ అనే ఆదివాసీ తెగతో నిండిన ప్రదేశం.
ఆదివాసులపై రష్యా ఆధిపత్యం : బేరింగ్ నివేదికతో ఉత్సాహం పొందిన రష్యా చక్రవర్తి పాల్-1, 1799లో ‘రష్యన్ – అమెరికన్ కంపెనీ’ని స్థాపించి అలస్కాపై పట్టు సాధించేందుకు పావులు కదిపారు. ఈ కంపెనీ అలస్కాలోని సిత్కా ద్వీపాన్ని ఆక్రమించి స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. తమ భూభాగంలోకి చొరబడిన రష్యన్లను 1804లో స్థానిక ట్లింగిట్ ఆదివాసీ తెగ తీవ్రంగా ప్రతిఘటించింది. కానీ, రష్యా సైన్యం వారి తిరుగుబాటును ఉక్కుపాదంతో అణచివేసి, సిత్కాను తమ వలస రాజధానిగా మార్చుకుంది.
క్రిమియన్ యుద్ధం.. కోలుకోలేని దెబ్బ : అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో 1853లో క్రిమియన్ యుద్ధం రూపంలో రష్యాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒట్టోమన్ సామ్రాజ్యం (టర్కీ)తో మొదలైన ఈ యుద్ధంలో, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఒట్టోమన్లకు మద్దతుగా నిలిచాయి. నల్ల సముద్రంలో జరిగిన ఈ భీకర పోరులో రష్యా ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడేళ్ల పాటు జరిగిన ఈ యుద్ధం కోసం రష్యా దాదాపు 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోయింది. ఈ అవమానకర ఓటమి రష్యా పాలకుల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది.
శత్రువుకు దక్కకూడదనే… చారిత్రక అమ్మకం : క్రిమియన్ యుద్ధం తర్వాత రష్యా తీవ్రమైన ఆందోళనలో పడింది. అలస్కాకు అత్యంత సమీపంలో (కేవలం 2,475 కి.మీ దూరంలో) ఉన్న కెనడా అప్పుడు బ్రిటన్ పాలనలో ఉంది. తమ బద్ధ శత్రువైన బ్రిటన్, బలహీనంగా ఉన్న తమపై దాడి చేసి అలస్కాను సులభంగా ఆక్రమించుకుంటుందని రష్యా చక్రవర్తి అలెగ్జాండర్-2 భయపడ్డారు. రాజధాని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అలస్కాను కాపాడుకోవడం కష్టమని, మరో యుద్ధాన్ని భరించే శక్తి తమకు లేదని ఆయన గ్రహించారు.
ALSO READ: https://teluguprabha.net/international-news/zelenskyy-trump-phone-call-washington-meeting/
శత్రువైన బ్రిటన్ చేతికి చిక్కే బదులు, దానిని మరేదైనా దేశానికి అమ్మేయడమే మేలని రష్యా భావించింది. ఈ ప్రతిపాదనకు అమెరికా సానుకూలంగా స్పందించింది. సుదీర్ఘ చర్చల అనంతరం, 1867 మార్చి 30న చారిత్రక ఒప్పందం కుదిరింది. 1.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విశాలమైన అలస్కా భూభాగాన్ని రష్యా కేవలం 7.2 మిలియన్ డాలర్లకు (నాటి మారకం ప్రకారం సుమారు రూ.63 కోట్లకు) అమెరికాకు అమ్మేసింది. అంటే.. సగటున ఒక ఎకరాన్ని 4 పైసలకే కట్టబెట్టింది.
అప్పట్లో ఈ ఒప్పందాన్ని అమెరికాలో చాలామంది విమర్శించారు. అమెరికా విదేశాంగ మంత్రి విలియమ్ సీవార్డ్ మూర్ఖపు చర్యగా అభివర్ణించి, ఈ కొనుగోలును “సీవార్డ్స్ ఐస్ బాక్స్” (Seward’s Icebox) అని ఎగతాళి చేశారు. కానీ, కొద్ది కాలంలోనే అక్కడ బంగారం, చమురు నిక్షేపాలు బయటపడటంతో, అది అమెరికా పాలిట బంగారు బాతుగా మారింది. రష్యా చేసుకున్న చారిత్రక తప్పిదం, అమెరికాకు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా ఎంతో లాభాన్ని చేకూర్చింది.


