Wednesday, February 11, 2026
Homeఇంటర్నేషనల్Summit : దావోస్‌లో ప్రపంచ దిగ్గజాలు.. ట్రంప్, జెలెన్‌స్కీ హాజరు!

Summit : దావోస్‌లో ప్రపంచ దిగ్గజాలు.. ట్రంప్, జెలెన్‌స్కీ హాజరు!

World Economic Forum Davos 2026 : ప్రపంచం ఓ వైపు యుద్ధ మేఘాలతో, ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతున్న వేళ, అగ్రరాజ్యాల అధినేతలు, ప్రపంచ దిగ్గజాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సమావేశమవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా 64 దేశాల అధినేతలు ఈ కీలక భేటీకి హాజరుకానున్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF) ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఐదు రోజుల సమావేశం, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లకు పరిష్కారం చూపుతుందా? అసలు ఈ భేటీ అజెండా ఏంటి..? భారత్ పాత్ర ఎలా ఉండబోతోంది..?

- Advertisement -

ప్రతి ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశానికి ఈ ఏడాది అగ్రనేతల తాకిడి ఎక్కువగా ఉండనుంది. జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను WEF అధ్యక్షుడు, సీఈఓ బోర్జ్ బ్రెండే మంగళవారం ఆన్‌లైన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

హాజరుకానున్న ప్రముఖులు : ఈ సమావేశానికి అగ్రరాజ్యాల నుంచి బలమైన ప్రతినిధి బృందాలు హాజరుకానున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయనతో పాటు ఐదుగురు కీలక కేబినెట్ మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, జెలెన్‌స్కీ హాజరుకావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జీ-7 దేశాలలో ఆరింటికి చెందిన అగ్ర నాయకత్వం, చైనా, పాకిస్థాన్ నుంచి కూడా పెద్ద ప్రతినిధి బృందాలు పాల్గొననున్నాయి. మొత్తం మీద 64 మంది దేశాధినేతలు లేదా ప్రభుత్వాధినేతలు హాజరుకానున్నారు.

ప్రధాన అజెండా.. ప్రపంచ సంక్షోభాలు : ఈ ఐదు రోజుల సమావేశంలో, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కీలక సంక్షోభాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు WEF అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో నెలకొన్న పరిస్థితులు, వెనిజులాతో సహా లాటిన్ అమెరికాలోని సమస్యలపై లోతుగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

భారత్ పాత్ర.. బలమైన ప్రతినిధి బృందం : ఈ కీలక సమావేశంలో భారత్ కూడా తన వాణిని బలంగా వినిపించనుంది. భారత్ నుంచి కూడా ఓ బలమైన ప్రతినిధి బృందం దావోస్‌కు వెళ్లనుందని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదుగుతున్న భారత్, ఈ వేదికపై వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, వాతావరణ మార్పులు వంటి అంశాలపై తన అభిప్రాయాలను, ప్రణాళికలను ప్రపంచ దేశాల ముందు ఉంచనుంది. ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట తరుణంలో, దావోస్‌లో జరగనున్న ఈ సమావేశంలో వెలువడే నిర్ణయాలు, చర్చలు ప్రపంచ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News