Won’t Surrender Land To Buy Peace: శాంతి కోసం తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. వాషింగ్టన్, మాస్కోల మధ్య శాంతి శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15న అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగే ఈ సమావేశంపై జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించే ఉద్దేశంతో ట్రంప్, పుతిన్‌లు సమావేశం కానున్నారు. ఈ సమావేశం గురించి ట్రంప్ ప్రకటిస్తూ, “రెండు దేశాల మేలు కోసం కొన్ని భూభాగాల మార్పిడి జరగవచ్చు” అని వ్యాఖ్యానించారు. దీనిపై జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు.
“ఉక్రెయినియన్లు తమ భూమిని ఆక్రమణదారులకు ఇవ్వరు. మాకు వ్యతిరేకంగా, మమ్మల్ని మినహాయించి తీసుకునే ఏ నిర్ణయాలు కూడా శాంతికి వ్యతిరేకమే. అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు” అని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
మేం లేకుండా శాంతి ఒప్పందాలా?
రష్యా 2022లో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మూడుసార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే, ఉక్రెయిన్ తన సార్వభౌమ భూభాగాన్ని రష్యా నియంత్రణలో ఉన్నట్లు ఎప్పటికీ అంగీకరించబోదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. యుద్ధం తమ దేశంలో జరుగుతున్నందున, తమను చర్చల్లో భాగం చేయకుండా శాంతి ఒప్పందాలు సాధ్యం కావని ఆయన అన్నారు.


