Zelensky’s White House meeting attire : ఒకప్పుడు వాడీవేడి సంభాషణలు.. నిప్పులు చెరిగిన భేటీ.. అర్థాంతరంగా ముగిసిన చర్చలు! కానీ ఇప్పుడు సీన్ మారింది. అదే శ్వేతసౌధం.. అవే ఇద్దరు అగ్రనేతలు.. కానీ ఈసారి చిరునవ్వుల మధ్య చర్చలు సాగాయి. ఈ మార్పునకు కారణం ఒక సూటు! అవును, మీరు చదివింది నిజమే. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధరించిన ఓ నల్ల సూటు, పాత చేదు జ్ఞాపకాలను చెరిపేసి, నవ్వుల పువ్వులు పూయించింది. అసలు ఆ సూటు వెనుక ఉన్న కథేంటి? ఒకప్పటి విమర్శలు, నేటి ప్రశంసలకు కారణమైన ఆ సంభాషణ ఎలా సాగింది..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో మరోసారి సమావేశమయ్యారు. గత భేటీలకు భిన్నంగా ఈ సమావేశం పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ వస్త్రధారణపై జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో ఏం జరిగిందంటే : ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన విషయం తెలిసిందే. ఆ భేటీలో జెలెన్‌స్కీ, తనకు భవిష్యత్తులో రష్యా నుంచి రక్షణ కల్పించాలని కోరగా, ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు నేతల మధ్య మాటల యుద్ధం జరిగి, ఎలాంటి ఒప్పందంపై సంతకాలు చేయకుండానే జెలెన్‌స్కీ వైట్‌హౌస్ నుంచి వెనుదిరిగారు. అయితే, ఆ భేటీలో రాజకీయ అంశాలతో పాటు జెలెన్‌స్కీ వేసుకున్న టీ-షర్టు కూడా తీవ్ర వివాదాస్పదమైంది. అమెరికా అధ్యక్షుడితో అధికారిక భేటీకి టీ-షర్టుతో రావడంపై అమెరికన్ మీడియా తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఆ సమావేశంలో, అమెరికన్ మీడియా ప్రతినిధి బ్రియాన్ గ్లెన్ నేరుగా జెలెన్‌స్కీని, “మీరెందుకు సూట్ వేసుకోలేదు? దేశ అత్యున్నత కార్యాలయాన్ని మీరు గౌరవించడం లేదని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు. అసలు మీకు సొంతంగా ఒక సూట్ ఉందా?” అని సూటిగా ప్రశ్నించారు. దానికి జెలెన్‌స్కీ నిబ్బరంగా, “యుద్ధం ముగిసిన తర్వాత సూట్ వేసుకుంటాను” అని సమాధానమిచ్చారు.
ప్రస్తుత భేటీలో నవ్వుల పువ్వులు : కట్ చేస్తే.. తాజా భేటీకి జెలెన్‌స్కీ నల్ల సూటులో హుందాగా హాజరయ్యారు. ఈ క్రమంలో, గతంలో ఆయన్ను సూటిగా ప్రశ్నించిన అదే జర్నలిస్ట్ బ్రియాన్ గ్లెన్, ఈసారి జెలెన్‌స్కీని చూసి, “సూట్‌లో మీరు అద్భుతంగా, బాగున్నారు” అంటూ ప్రశంసించారు.
వెంటనే అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని, నవ్వుతూ, “జెలెన్‌స్కీ! గతంలో నీపై మాటలతో దాడి చేసింది కూడా ఈ విలేకరే” అని గుర్తుచేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. దానికి జెలెన్‌స్కీ చిరునవ్వుతో, “అవును, నాకు గుర్తుంది” అని బదులిచ్చారు. అంతేకాదు, ఆ జర్నలిస్టును ఉద్దేశిస్తూ, “మీరు అదే సూట్‌లో ఉన్నారు. నేను మాత్రం మార్చుకున్నాను” అని చమత్కరించడంతో మరోసారి నవ్వుల పువ్వులు పూశాయి. మొత్తానికి, ఈ సరదా సంభాషణతో ఇరు నేతల మధ్య ఉన్న గతాన్ని మరిపించి, భేటీ సానుకూల వాతావరణంలో ముగియడానికి దోహదపడింది.


