Zelenskyy Trump: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చురుగ్గా అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 15, 2025న అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత, ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో గంటన్నర పాటు ఫోన్‌లో మాట్లాడారు. ఈ కాల్‌లో యూరోపియన్ నాయకులు కూడా చేరారు. ఈ చర్చల్లో శాంతి ఒప్పందం, త్రైపాక్షిక సమావేశం గురించి ప్రస్తావన జరిగింది.
ALSO READ: Dharmavaram Terrorist : ధర్మవరంలో జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్.. అసలు అతడి ప్లాన్ ఏంటంటే?
జెలెన్‌స్కీ, ఎక్స్ వేదికపై ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, ట్రంప్‌తో సోమవారం వాషింగ్టన్ డీసీలో భేటీ కానున్నట్లు తెలిపారు. ఈ భేటీలో యుద్ధాన్ని ముగించడానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన ఉక్రెయిన్, అమెరికా, రష్యా నేతల త్రైపాక్షిక సమావేశానికి జెలెన్‌స్కీ మద్దతు తెలిపారు. “అమెరికా బలం ఈ పరిస్థితిని చక్కదిద్దగలదు..” అని తెలిపారు.
ట్రంప్, ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, శాంతి ఒప్పందం జెలెన్‌స్కీ చేతుల్లో ఉందని, “డీల్ కుదుర్చుకోవాలి” అని సూచించారు. అలాస్కా సమావేశంలో ట్రంప్, పుతిన్ రెండున్నర గంటలు చర్చించినప్పటికీ, ఆశించిన ఒప్పందం కుదరలేదు. అయితే, “సానుకూల వాతావరణం”లో చర్చలు జరిగాయని ఇరువురూ తెలిపారు. ఈ భేటీ తర్వాత ట్రంప్, NATO నాయకులతోనూ ఫోన్‌లో మాట్లాడారు. జెలెన్‌స్కీ యూరోపియన్ నాయకుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.


