Ukraine peace process : అలస్కా గడ్డపై అగ్రరాజ్యాధినేతల శాంతి మంత్రాంగం ముగిసి 24 గంటలు గడవక ముందే, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాషింగ్టన్ డీసీలో సోమవారం (ఆగస్టు 18న) భేటీ కానున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ స్వయంగా ప్రకటించారు. ఒకవైపు శాంతి చర్చల కోసం దౌత్యపరమైన అడుగులు వేగంగా పడుతుండగా, మరోవైపు రష్యా క్షిపణి దాడులు కొనసాగుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ ఈ భేటీ ఎందుకు కీలకం..? త్రైపాక్షిక చర్చలపై నెలకొన్న గందరగోళం ఏమిటి..?
భేటీకి రంగం సిద్ధం: జెలెన్‌స్కీ ప్రకటన : ట్రంప్, పుతిన్‌లతో భేటీ అనంతరం, తనతో దాదాపు గంటసేపు ఫోన్‌లో మాట్లాడారన్న విషయాన్ని జెలెన్‌స్కీ శనివారం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. పుతిన్‌తో చర్చకు వచ్చిన కీలక అంశాలను ట్రంప్ తనకు వివరించారన్నారు. “యుద్ధాన్ని, మరణాలను ఆపడానికి మేము సిద్ధం. ఈ కీలక సమయంలో నన్ను ఆహ్వానించినందుకు అమెరికాకు ధన్యవాదాలు. అమెరికా శక్తియుక్తులు ఈ యుద్ధ పరిస్థితులను మార్చగలవు,” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో యుద్ధ ముగింపు, ఉక్రెయిన్ భవిష్యత్ భద్రతా హామీలపై ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
త్రైపాక్షిక చర్చలపై భిన్న స్వరాలు : అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే మాస్కో నుంచి భిన్న స్వరం వినిపించింది. అలస్కా భేటీలో అసలు త్రైపాక్షిక సమావేశం అనే అంశమే చర్చకు రాలేదని పుతిన్ విదేశాంగ సలహాదారుడు యూరీ ఉషకోవ్ కొట్టిపారేయడం గందరగోళానికి దారితీసింది. ఇది దౌత్యపరమైన వ్యూహంలో భాగమా లేక ఇరు పక్షాల మధ్య సమన్వయ లోపమా అన్నది అంతుపట్టడం లేదు.
ఇక బాధ్యత జెలెన్‌స్కీదే: ట్రంప్ : మరోవైపు, పుతిన్‌తో తన భేటీకి 10కి 10 మార్కులు వేసుకున్న ట్రంప్, తాము చేయగలిగింది చేశామని, ఇక తదుపరి బాధ్యత జెలెన్‌స్కీదేనని వ్యాఖ్యానించారు. “శాంతి ఒప్పందం దిశగా కొంత పురోగతి సాధించాం, కానీ తుది ఒప్పందం ఇంకా కుదరలేదు. ఇప్పుడు స్పందించాల్సింది జెలెన్‌స్కీనే. బంతి ఇప్పుడు ఆయన కోర్టులోనే ఉంది,” అని ట్రంప్ స్పష్టం చేశారు.
పుతిన్ హెచ్చరిక.. కొనసాగుతున్న దాడులు : అలస్కాలో పుతిన్ ప్రసంగిస్తూ, శాంతి చర్చలకు ఆటంకం కలిగించవద్దని ఉక్రెయిన్, ఐరోపా దేశాలకు హెచ్చరిక జారీ చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ యుద్ధమే వచ్చి ఉండేది కాదంటూ ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ శాంతి మాటలు చెబుతూనే రష్యా తన దాడులను ఆపలేదు. శుక్రవారం రాత్రి కూడా ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులు, 85 షాహిద్ డ్రోన్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ వాయుసేన ప్రకటించింది. ఈ నేపథ్యంలో, వాషింగ్టన్‌లో జరగబోయే ట్రంప్-జెలెన్‌స్కీ భేటీ ఎలాంటి ఫలితాన్నిస్తుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.


