Zohran Mamdani Picks All-Female Transition Team: న్యూయార్క్ నగర మేయర్‌గా చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్న డెమొక్రాటిక్ సోషలిస్ట్ జోహ్రాన్ మామ్దానీ (34) జనవరి 1, 2026న పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా, ఆయన బుధవారం తన పరివర్తన (ట్రాన్సిషన్) బృందాన్ని ప్రకటించారు. ఈ బృందంలో మామ్దానీ కేవలం మహిళలకే చోటు కల్పించడం విశేషం. పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు చూపడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
చరిత్ర సృష్టించిన యువ మేయర్
శతాబ్దంలోనే అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా మామ్దానీ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా, న్యూయార్క్ నగరానికి మొదటి ముస్లిం మేయర్, మొదటి దక్షిణాసియా మూలాలు ఉన్న వ్యక్తి, ఆఫ్రికాలో జన్మించిన మొదటి మేయర్‌గా కూడా మామ్దానీ నిలిచారు.
“రాబోయే నెలల్లో, నేను, నా బృందం ఈ ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చగల సిటీ హాల్‌ను నిర్మిస్తాం” అని క్వీన్స్‌లో జరిగిన పత్రికా సమావేశంలో మామ్దానీ అన్నారు. “సమర్థతతో, దయతో నడుపబడే, సమగ్రత కలిగిన, ఈ నగరాన్ని తమ ఇల్లుగా పిలిచే లక్షలాది మంది న్యూయార్క్ వాసుల వలె కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండే పాలనను మేము ఏర్పాటు చేస్తాం” అని ప్రకటించారు.
ALSO READ: Trump News: ఇండియా పాక్ యుద్ధంలో 8 ఫైటర్ జెట్స్ కూలిపోయాయ్.. ట్రంప్ కొత్త లెక్కలు..
సమర్థులైన మహిళలకు చోటు
34 ఏళ్ల మామ్దానీ, రాజకీయ కన్సల్టెంట్ అయిన ఎలానా లియోపోల్డ్ను తన పరివర్తన బృందం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ బృందానికి మాజీ ఫస్ట్ డిప్యూటీ మేయర్ మారియా టోర్రెస్-స్ప్రింగర్, మాజీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చైర్ లీనా ఖాన్, యునైటెడ్ వే ఆఫ్ న్యూయార్క్ సిటీ సీఈఓ గ్రేస్ బోనిల్లా, మాజీ డిప్యూటీ మేయర్ మెలనీ హార్ట్‌జాగ్ వంటి సమర్థులు కో-చైర్‌లుగా వ్యవహరిస్తారు.
“కొందరి పేర్లు మీకు సుపరిచితమే, మరికొందరివి కాదు. కానీ పాత సమస్యలకు కొత్త పరిష్కారాలను కనుగొనాలనే నిబద్ధతతో వారంతా ఏకమవుతారు” అని మామ్దానీ అన్నారు. కార్పొరేషన్లు, సంపన్నులపై పన్నులు విధించడం ద్వారా అద్దె స్తంభన (Rent Freeze), ఉచిత బస్ సేవ, సార్వత్రిక శిశు సంరక్షణ, సిటీ-నిర్వహణలో కిరాణా దుకాణాలను ఏర్పాటు చేయాలనే తన ఎన్నికల ప్రచార హామీలను నెరవేర్చగలననే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.


