చీమ చిన్నదైనా కూడా చాలా బలమైనది. ఇది అందరినీ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటుంది. నిజంగా అవి తమ శరీర బరువుతో పోలిస్తే పదింతలు కాకపోయినా, ఏకంగా 50 రెట్లు బరువైన వస్తువులను మోసగలవు. ఈ విషయం ఆశ్చర్యకరంగానే కాదు, ఆసక్తికరంగానూ ఉంటుంది. మరి ఈ చీమలకు అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక చీమలు మనిషిని మోయగలవా? అలా అయితే ఒక మనిషిని మోయడానికి ఎన్ని చీమలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చీమలకు బలం ఎక్కడి నుంచి వస్తుంది: చీమ శరీరం చాలా చిన్నది. దాని కండరాలు బలంగా ఉండటంతో పాటు, శరీరాన్ని కవచంలా కప్పే “ఎక్సోస్కెలిటన్” అనే పొర కూడా బలంగా ఉంటుంది. ఈ కారణంగా అవి తక్కువ శక్తితో ఎక్కువ బరువును మోయగలుగుతాయి. 2014లో జరిగిన ఓ పరిశోధన ప్రకారం, అమెరికన్ ఫీల్డ్ యాంట్ మెడ భాగం తన బరువుకి 5,000 రెట్లు అధిక ఒత్తిడిని తట్టుకోగలదట.
ఇక మనుషులు మొదట తమ శరీర బరువును నిలబెట్టుకోవడానికే ఎక్కువ శక్తిని వినియోగిస్తారు. అందువల్ల, మిగతా పనులకు తక్కువ శక్తి మిగులుతుంది. కానీ చీమల శరీరం తేలికగా ఉండటంతో, దాని మొత్తం శక్తిని బరువులు మోయడానికే ఉపయోగించగలవు. అందుకే అవి తమ బరువుకు 10 నుంచి 50 రెట్లు అధికమైన వస్తువులను సులభంగా మోస్తాయి.
ఒక మనిషిని మోయాలంటే ఎంతమంది చీమలు కావాలి: ఒక మనిషి సగటు బరువు 70 కిలోలు అనుకుంటే, ఒక చీమ బరువు సుమారుగా 5 మిల్లీగ్రాములు. ఓ చీమ దాని బరువుకు 20 రెట్లు బరువు మోయగలదని అనుకుంటే, అది 0.1 గ్రాము మోయగలదు. అంటే 70 కిలోల మనిషిని మోయాలంటే 7 లక్షల చీమలు కావాలి. కానీ సమన్వయం, స్థిరత లాంటివి కూడా అవసరం కాబట్టి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు చీమలు అవసరం అవుతాయి అంటున్నారు పరిశోధకులు. అంతేకాదు చీమలు సమూహంగా పనిచేస్తాయి. అవి తమతమ పనుల్లో నిపుణులుగా ఉంటాయి. కొన్ని ఆహారం తీసుకురావడంలో నిమగ్నమవుతుంటే, మరికొన్ని రక్షణ బాధ్యతలు తీసుకుంటాయి. ఇవి పరస్పర సంబంధాలు, ఫెరోమోన్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని పంచుకుంటాయి. కానీ ఒక మనిషిని ఎత్తాలంటే, అందరూ సమన్వయంగా ఒకే దిశలో బలాన్ని పెట్టాలి. ఇది చాలా కష్టం.
అందుకే మనిషిని చీమలు మోయగలవా? అనే ప్రశ్నకు సైన్స్ చెబుతున్న సమాధానం — “సిద్ధాంతంగా సరే, కానీ వాస్తవంగా కాదు.” చీమల బలం మనం అంచనా వేసే విధంగా విస్తారంగా ఉన్నా, ఒక మనిషిని పైకి తీసుకెళ్లడం మాత్రం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. ఏదిఏమైనా ఈ చిన్న జీవుల్లో దాగున్న గొప్ప శక్తిని మనం గుర్తించాల్సిందే.