సామాజిక ఉద్యమకారిణి సరస్వతి కవుల గురించి సాధారణ ప్రజల కంటే ప్రభుత్వాలకే ఎక్కువ తెలుసు. 2026 జూన్ 10న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అధారిటీ భవన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సందర్భంగా పోలీసులు ఆమెని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద యాచారం స్టేషన్ కి తరలించారు. స్థానిక రైతులు ఆందోళనకు దిగడంతో ఆమెని విడిచిపెట్టినా ఆ రోజంతా పోలీసులు ఆమెని వెంబడించే ఉన్నారు. ఫార్మా సిటీ బాధిత రైతుల పక్షాన ఆమె చేస్తున్న పోరాట ప్రభావానికి అదొక నిదర్శనం. సరస్వతి కవుల ఆలోచనలు, ఆచరణాత్మక అడుగులు ఏలిన వారికి కంటగింపుగా ఉండటం సహజం. ప్రజలను నిర్వాసితులను చేసే ప్రాజెక్టులకు ఆమె తీవ్ర వ్యతిరేకి. ప్రకృతి సంపదని, వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను నిరసిస్తారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే అధికమని ఆధారసహితంగా వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తారు. అందుకే పాలక వర్గాలకు, వారికి వత్తాసు పలికే బడా వర్గాలకు ఆమె ఉనికి అంటే అంత ఉలికిపాటు. గత రెండున్నర దశాబ్దాలుగా సరస్వతి కవుల అనేక సామాజిక ఉద్యమాలలో భాగమయ్యారు. బాల్యంలో డాక్టర్ కావాలనుకున్న సరస్వతి.. అనుకోని పరిస్థితుల్లో యాక్టివిస్టుగా మారారు. ఆ పరిణామంలో ఆసక్తికర మలుపులు అనేకం. సరస్వతి తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. బదిలీల కారణంగా చాలా ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. అలా వికారాబాదులో, నల్లగొండలో వారున్నప్పుడు బ్యాంక్ క్వార్టర్స్ చుట్టూ దట్టమైన చెట్లు, కొండలు బాగా ఉండేవట. అలా చెట్ల మధ్య, కొండల మధ్య ఆమె బాల్యం గడిచింది. క్రమేపీ ప్రకృతితోనూ అనుబంధం పెరిగింది.
నల్లగొండలో ఆ రోజుల్లో ఉద్యమ వాతావరణం బలంగా ఉండేది. గోడలపై రాసిన నినాదాలు ఆకర్షించేవి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఆధిపత్యం కోసం ఘర్షణలు జరుగుతుండేవి. అప్పటికి పది పన్నెండేళ్ల వయసున్న సరస్వతికి ఆ గొడవలకి కారణం తెలీకపోయినా.. సమాజం బాగు కోసం ఏదైనా చేయాలన్న తపన మాత్రం తనలో బలంగా నాటుకుంది. ఏం చేయాలో తెలియని సంధికాలం అది. స్వామి వివేకానంద పుస్తకాలు చదివారు. మంచి మంచి సినిమాలూ చూశారు. బొమ్మలు వేయడం వంటి వ్యాపకాల్లోనూ నిమగ్నమయ్యారు. ఆమె మనసుపై అనేక ప్రభావాల ముద్రలు పడ్డాయి. తను మెడిసిన్ చదివి ఏదైనా గ్రామానికి వెళ్లి వైద్యసేవలు అందించాలని, మార్పు కోసం పనిచేయాలని భావించారు. కానీ లోలోపల మెలిపెట్టే ఆలోచనల వల్ల చదువుపై శ్రద్ధ తగ్గింది. ఫలితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ రాలేదు. మెడిసిన్‌లో ఫ్రీ సీటు దక్కలేదు. వారిది మధ్యతరగతి కుటుంబం. అయినా ఆమె తండ్రి డొనేషన్ కట్టి చదివిస్తానంటే సరస్వతి ససేమిరా అన్నారు.
మళ్లీ ఒక సందిగ్ధస్థితి. తర్వాత ఏంటి అన్న ప్రశ్నతో కుదురు కొరవడింది. తర్జనభర్జనల తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి తాజ్ బంజారాలో చేరారు. ఆ తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంకుకి షిఫ్టయ్యారు. ఉద్యోగంలో స్వేచ్చ ఉండదని ఫ్రీలాన్సర్‌గా మారారు. కొన్నాళ్లు ఆలిండియా రేడియోకి వర్క్ చేశారు. చివరాఖరికి ఫిల్మ్ మేకింగ్ వైపు అడుగులు వేశారు. యూకె వెళ్లి డాక్యుమెంటరీ ఫిల్మ్ స్పెషలైజేషన్ చేశారు. అనంతరం ముంబై వచ్చి కొన్ని సినిమాలకి, టెలి ఫిలిమ్స్‌కి, యాడ్ ఫిలిమ్స్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఉషాకిరణ్ మూవీస్ వారు తీసిన ఆంగ్ల చిత్రాల కోసమూ పనిచేశారు. మార్నింగ్ రాగా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. పనిలో పనిగా దూరదర్శన్ కోసం కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్ సబ్జక్ట్స్పై లఘుచిత్రాలు తీశారు. దీని కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజల కేంద్రంగా జరిగిన అభివృద్ధి గురించి 18 లఘుచిత్రాలు తీశారు. 2004లో రంగురాళ్ల తవ్వకాల గురించి ‘మెరుపు వెనుక’ పేరుతోను, 2005లో దేవాదుల ప్రాజెక్టు గురించి అదే పేరుతోను ఇండిపెండెంట్ డాక్యుమెంటరీలు తీశారు. అలా రకరకాల సామాజిక అంశాలపై 30 వరకు డాక్యుమెంటరీలు తీశారు. ‘కటింగ్ ఆఫ్ ఎ లైఫ్ లైన్’ పేరుతో మూసీ నది గురించి, ‘వికాసమా? వినాశనమా?’ పేరుతో అభివృద్ధి విధ్వంసం గురించి, ‘పేరాడాక్స్ సిటీ’ పేరుతో హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య గురించి, ‘డీకోడ్ వ్యాక్సిన్స్’ పేరుతో పిల్లలకి వేస్తున్న వ్యాక్సిన్ల దుష్ప్రభావాల గురించి ఆమె తీసిన లఘుచిత్రాలు విశేష ప్రాచుర్యం పొందాయి.
2003లో సరస్వతి కవుల ప్రయాణం కొత్త పుంతలు తొక్కింది. ఆ ఏడాది నల్లగొండలో కేంద్రప్రభుత్వం తలపెట్టిన యురేనియం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. వేనేపల్లి పాండురంగారావు, కెప్టెన్ జె. రామారావు, డాక్టర్ సత్యలక్ష్మి, సజయ, డాక్టర్ బాబూరావు, పర్చా కిషన్‌రావు, అంబిక వంటి సోషల్ యాక్టివిస్టుల సారథ్యంలో దాదాపు మూడేళ్ల పాటు ఉధృతంగా కొనసాగిన ఆ ఉద్యమంలో సరస్వతి కవుల కూడా పాల్గొన్నారు. ఆ అనుభవం ఆమెలో ఒక ఎరుకని కలిగించింది. సమాజంలో మార్పు కోసం పనిచేయాలని చిన్నతనంలో ఏదైతే అనుకున్నారో, అది అప్పుడు నెరవేరిన అనుభూతి కలిగింది. ఇక ఆమె వెనుదిరగ లేదు. 2008లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్.ఏ.పి.ఎం)లో చేరి క్షేత్రస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టారు.
సోంపేట, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్, కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్, వివిధ సెజ్‌లకి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమాల్లో సరస్వతి కవుల చురుకుగా పాల్గొన్నారు. ఎన్.ఏ.పి.ఎం ఆధ్వర్యంలో పలు ప్రజాసమస్యలపై సదస్సులు, వర్క్ షాపులు నిర్వహించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పబ్లిక్ హియరింగ్స్కి హాజరై తమ వాయిస్ వినిపించారు. ఈ క్రమంలో పర్యావరణ స్పృహ ఆమెకి మరింత అబ్బింది. అభివృద్ధి పేరిట పాలకులు అనుసరిస్తున్న విధానాల్లో డొల్లతనాన్ని లోతుగా అర్ధంచేసుకున్నారు. ఆయా విధానాల వల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతోందని, ప్రజలు పెద్ద సంఖ్యలో నిర్వాసితులు అవుతున్నారని నిరసనోద్యమాలు చేపట్టారు. మాల్స్ కల్చర్‌కి అలవాటుపడి అవసరం లేని వస్తువులను కొనే దుస్థితిలోకి జారుకోవడం మంచిది కాదన్న వాదాన్ని ముందుకు తెచ్చారు. కొత్తకొత్త బ్రాండ్లు వాడాలనే యావలోకి వినియోగదారులు జారుకుంటే దుబారా ఖర్చులు తప్ప ప్రయోజనం ఉండదని, మైనింగ్, మాన్యుఫాక్చరింగ్, విద్యుత్ అవసరాల కోసం చేపట్టే ప్రాజెక్టుల ఫలితంగా పర్యావరణానికి తీరని హాని జరుగుతోందంటూ ప్రజలకు ఆ విషయాలను అర్ధంచేయించే ప్రయత్నాలు చేశారు. ప్రతి ఒక్కరికి సొంత వాహనం ఉండాలనే ఆర్బాటపు జీవనశైలి పెరుగుతోందని, దానివల్ల ఇంధన వినియోగంతో పాటు కాలుష్యమూ, ప్రకృతి వనరుల విధ్వంసమూ పెరుగుతోందని చెప్తూ తోటివారిలో ఆ స్పృహ ఏర్పడేలా కృషిచేస్తూ వచ్చారు. మరి ఆ ప్రమాదకర ధోరణులకు విరుగుడు ఏమిటని అడిగితే.. సరస్వతి కవుల టక్కున బదులిస్తారు. 1. ప్రజల చేతుల్లో వనరులు ఉన్నప్పుడే సుస్థిరత నెలకొంటుంది. 2. కింది వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. 3. సహేతుక పద్ధతిలో వనరుల పంపకాలు జరగాలి. 4. ప్రకృతితో అనుబంధంలోనే జీవన సార్ధకత చేకూరుతుంది. 5. మెగా సిటీస్ అనే కాన్సెప్టే లోపభూయిష్టమైనది. 6. వికేంద్రీకరణ విధానంతోనే మార్పుకి ఆస్కారం ఉంటుంది. 7. చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉండే సమష్టి జీవనతత్వాన్ని ఆచరించాలి. 8. పారిశ్రామిక ఉత్పత్తి అనే కేంద్రీకృత విధానానికి చెల్లుచీటీ పలకాలి. 9. గాంధీజీ చెప్పిన ప్రజాశ్రేణుల నుంచి ఉత్పత్తులు (ప్రొడక్షన్ బై మాసెస్) అనే పద్ధతిని ప్రత్యామ్నాయంగా అమలులోకి తేవాలి. ఇవీ సరస్వతి కవుల సూచిస్తున్న పరిష్కార మార్గాలు.
సరస్వతి కవుల బేసిగ్గా చేతల మనిషి. చెప్పింది ఆచరించడంలో నిక్కచ్చితనం ఎక్కువ. నిరాడంబరతకి ఆమె నిదర్శనం కూడా. చేనేత దుస్తులే ధరిస్తారు. లివింగ్ విత్ లెస్ అనేది ఆమె అనుసరించే తాత్విక పంథా. ఏ వస్తువునైనా ఎంతో జాగ్రత్తగా వాడతారు. ఒకవేళ పాడైతే బాగుచేయించి పనిచేసినంత కాలం ఉపయోగిస్తారు. ఇందుకు ఒక ఉదాహరణ: 2010లో కొనుక్కున్న సామ్సంగ్ కంపెనీ లాప్ టాప్‌ని 2025 డిసెంబర్ వరకు ఆమె ఉపయోగించారు. అంటే పదిహేనేళ్లు! మధ్యలో అనేక కొత్త వెర్షన్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటిని కొనగలిగే స్తోమతకి మించిన స్థాయి ఆమెది. అయినా సరే.. ఉన్న వస్తువుని అత్యంత పొదుపుగా వాడారు. ఒక లాప్ టాప్ తయారీ కోసం ఎన్ని రకాల సహజ వనరులు ఖర్చవుతాయో ఆమెకి బాగా తెలుసు. వస్తు వినియోగ పద్ధతిలో మార్పు వస్తేనే అలాంటి విధ్వంసాన్ని అణుమాత్రమైనా ఆపగలమని ఆమె భావిస్తారు. దాన్ని ఆచరించి కూడా చూపిస్తారు. చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఆ కార్మికుల కోసం ఏదైనా చేయాలన్న తలంపుతో 2015లో ‘చేనేత సంత’ పేరిట ఎగ్జిబిషన్స్ మొదలుపెట్టారు. దానివల్ల చేనేత వస్త్ర తయారీదారులను నేరుగా మార్కెట్‌తో అనుసంధానించాలన్న ఆమె ప్రయత్నం చాలా వరకు నెరవేరింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి చొప్పున పదకొండేళ్ళ నుంచి ఈ ఎగ్జిబిషన్స్ నిరవధికంగా జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా కార్యక్రమం చేపడితే దానిని ఎంత చిత్తశుద్ధితో కొనసాగిస్తారో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ!
మట్టితో, చెట్లతో పనిచేయడం సరస్వతి కవులకి ఎంతో ఇష్టం. ఆ పని వల్ల మనుషుల మానసిక వికాసం పెరుగుతుందని ఆమె అనుభవపూర్వకంగా చెప్తారు. సొంత పొలాలు ఉన్న రైతుల కుటుంబాల్లోని పిల్లలు సైతం వ్యవసాయం చేయడాన్ని నమోషీగా భావించే రోజులు రావడం ఆమెని బాధించే మరొక విషయం. అందుకే ఆమె స్వయంగా వ్యవసాయం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 2010లో రైతుగా మారారు. నగర జీవితానికి దూరంగా.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో తనకున్న పొలంలో ఒక రేకుల ఇల్లు నిర్మించుకుని అక్కడే ఉంటున్నారు. సేంద్రీయ పద్దతుల్లో కూరగాయలు పండిస్తున్నారు. పండ్ల చెట్లు కూడా పెంచుతున్నారు. 2014లో ఎన్.ఏ.పి.ఎం నుంచి బయటకి వచ్చి పూర్తిగా వ్యవసాయంలో నిమగ్నం అయ్యారు. హమ్మయ్య.. యాక్టివిస్టు జీవితానికి కాస్త బ్రేక్ దొరికిందని సరస్వతి ఆనందించేలోపే.. రాజ్యం ఆమెకి కొత్త షెడ్యూల్ షురూ చేసింది. ఆమె పొలానికి సమీప గ్రామాల పరిధిలో ఫార్మాసిటీని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. రైతుల నుంచి 19 వేల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సరస్వతి అందులో పాల్గొనడంతో పాటు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటుచేశారు. రైతులను భారీగా సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతంచేశారు. రైతుల న్యాయపోరాటానికి అండగా నిలిచారు. గత ఎన్నికల సమయంలో ఫార్మా సిటీని రద్దుచేసి రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగి స్వాధీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని ఎన్నికల మానిఫెస్టోలోనూ చేర్చింది. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పాలకులు నాలుక మడతేశారు. ఫోర్త్ సిటీ పేరుతో కొత్త ప్రహసనానికి తెర తీశారు. ఆ పరిస్థితుల్లో సరస్వతి రైతుల పక్షాన ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలోనే సీఎం పర్యటన సందర్భంగా ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, విడిచిపెట్టడం జరిగింది. ఒక విషయం మాత్రం సుస్పష్టం. సరస్వతి అనితర సాధకురాలు. అలసట ఆమెకి బహు దూరం. బాధిత ప్రజలకి బాసటగా ఉండటమే ఆమెకి ఇష్టమైన వ్యాపకం. ఆగదు మరి ఆ ప్రయాణం.
– రమేష్




