శ్రమ విలువను కేవలం ఉత్పత్తితోనో, లాభంతోనో కొలిచే సమాజంలో ఆ శ్రమ చేసే వ్యక్తి ప్రాథమిక అవసరాలు చాలా సందర్భాల్లో పట్టించుకోరు. నాగరికత పెరిగే కొద్దీ సౌకర్యాలు పెరుగుతున్నాయని మురిసిపోతున్నాం కానీ, ఇప్పటికీ వర్క్ కల్చర్ లోని కొన్ని అలిఖిత నియమాలు శ్రామికుడి దేహాన్ని, ఆత్మగౌరవాన్ని బలితీసుకుంటున్నాయి. ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుండి, చంద్రుడు ఆకాశంలోకి వచ్చే వరకు. విలాసవంతమైన వస్తువుల నడుమ, మెరిసిపోయే వెలుగుల కాంతుల్లో, కళ్ళు మిరుమిట్లు గొలిపే షోరూమ్‌లలో సేవలు అందించే సేల్స్ సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వారి ‘కూర్చునే హక్కు’ కు విఘాతం కలగడం. ఇది కేవలం భౌతికమైన విశ్రాంతికి సంబంధించిన అంశం కాదు, ఒక మనిషి పని ప్రదేశంలో పొందాల్సిన కనీస గౌరవానికి సూచిక. వారి ఆరోగ్యం, మానవ హక్కులకు సంబంధించిన కీలక ప్రశ్న. “రండి, కూర్చోండి” అనేది కేవలం ఒక ఆహ్వానం మాత్రమే కాదు ఎదుటి వ్యక్తికి ఇచ్చే ఆత్మీయ గౌరవానికి ప్రతీక. కానీ, మన కళ్ల ముందే ఉదయం నుండి రాత్రి వరకు నవ్వుతూ సేవలందించే లక్షలాది మంది రిటైల్ రంగా కార్మికులకు మాత్రం ఈ కనీస గౌరవం దక్కడం లేదు. వారు పనివేళల్లో పని ఉన్నా లేకుండా నిలబడే ఉండాల్సి వస్తోంది. కూర్చునే హక్కు వారికి ఉండడం లేదు.
ఆనాటి బానిసత్వ భావజాలమా?
దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న కాలంలో అధికారుల ఎదుట భారతీయులు కూర్చోవడంపై నిషేధం ఉండేది. ప్రత్యేక అనుమతి ఉన్న కొద్దిమందికి మాత్రమే ఆ హక్కు ఇచ్చి, మిగిలిన వారిని అవమానించడం అప్పట్లో సర్వసాధారణంగా ఉండేది. అప్పుడు స్వాతంత్ర్య పోరాటానికి ఇటువంటి అవమానాలు కూడా ఒక ప్రేరణగా నిలిచాయి. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ షోరూమ్‌లు, సూపర్ మార్కెట్లు, వస్త్ర దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులను “పని ఉన్నా లేకపోయినా నిలబెట్టి ఉంచే” భావజాలంలో మార్పు రాకపోవడం బాధాకరం.
శ్రమను దోచుకుంటూ..
మన దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో రిటైల్ రంగం ఒకటి. లక్షలాది మంది యువతీ యువకులకు ఇది ఉపాధి కల్పిస్తోంది. మెరిసిపోయే వెలుగులు, ఎయిర్ కండిషన్డ్ షోరూమ్‌ల వెనుక పనిచేసే సేల్స్ సిబ్బంది నిరంతరం నిఘా నీడలో ఉంటారు. అందమైన షోరూముల వెనుక ఉండే చేదు నిజాలు ఇవి. కూర్చుంటే నేరమన్నట్టు నిలబడలేక గోడకు ఆనుకున్నా యాజమాన్యాలు తప్పుగా చూడటం, మందలించడం వంటి చర్యలు వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. నియోగదారుల సేవలో రోజంతా చిరునవ్వుతో కస్టమర్లను ఆహ్వానించి సంస్థ అభివృద్ధికి కృషి చేసే సిబ్బందికి కనీసం కూర్చునే వెసులుబాటు ఇవ్వకపోవడం అత్యంత విచారకరం.
ఆరోగ్యంపై ప్రభావం
గంటల తరబడి ఏకధాటిగా నిలబడటం వల్ల కార్మికులు తీవ్ర శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. వైద్య రంగ నిపుణులు మరియు పరిశోధనల ప్రకారం నిరంతరం నిలబడటం వల్ల రకరకాల అనారోగ్యాలు కలుగవచ్చు. ఎముకలు, కీళ్లలో సమస్యలు రావచ్చు. తీవ్రమైన వెన్నునొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడి వెరికోస్ వెయిన్స్, పాదాల వాపులు, రక్తనాళాల సంబంధిత సమస్యలు రావచ్చు. సుదీర్ఘ కాలంలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఉంటుంది. మహిళల సాంతాన సాఫల్య సమస్యలు రావచ్చు. మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లు, తీవ్రమైన అలసట.
కేరళ ‘పెన్‌కూట్టు’ ఉద్యమం
కార్మికుల ఈ మూగ వేదనను ఒక హక్కుల పోరాటంగా మార్చారు కేరళలోని మహిళా ఉద్యోగులు. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత సేల్స్ ఉద్యోగినులుగా పనిచేస్తున్న మహిళలు తమకు పని ప్రదేశంలో కూర్చునే అవకాశం, మరుగుదొడ్ల సౌకర్యం, సురక్షిత పని వాతావరణం కావాలని ‘పెన్‌కూట్టు’ అనే సమాఖ్య నేతృత్వంలో సుదీర్ఘ పోరాటం చేశారు.
కేరళ చారిత్రాత్మక నిర్ణయం
వీరి పోరాటానికి లొంగిన కేరళ ప్రభుత్వం 2018లో ‘కార్మిక చట్టాల’ను సవరించి, దుకాణాల్లో ఉద్యోగులకు కూర్చునే సౌకర్యం మరియు విశ్రాంతి సమయాన్ని తప్పనిసరి చేస్తూ చట్టం తెచ్చింది. కేరళ స్పూర్తితో తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ “రైట్ టు సిట్” ను చట్టబద్ధం చేసింది.
కూర్చోవడం ఒక హక్కు!
ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే కూర్చునే హక్కును కార్మిక హక్కుగా గుర్తించాయి.
అపోహలు వర్సెస్ నిజాలు
కార్మికుడు కూర్చోవడం అంటే సోమరితనం కాదు; అది అతని ఉత్పాదకతను, ఆరోగ్యాన్ని కాపాడే ప్రాథమిక చర్య. కేవలం కూర్చునే సీటు మాత్రమే కాకుండా ప్రశాంతమైన భోజన సమయం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు కల్పించడం యజమానుల బాధ్యత.
అమలైతేనే నిజమైన గౌరవం!
కార్మికుల స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆత్మగౌరవంతో కూడిన పని వాతావరణం కల్పించడం సమాజం యొక్క ప్రాథమిక బాధ్యత. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చూపిన బాటలో దేశంలోని అన్ని రాష్ట్రాలు “రైట్ టు సిట్” చట్టాన్ని సత్వరమే తీసుకువచ్చి, కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. పని ప్రదేశంలో ఒక సీటు ఇవ్వడం అనేది యాజమాన్యాలు ఇచ్చే ‘భిక్ష’ కాదు, అది ఒక శ్రమజీవి పొందే చట్టబద్ధమైన “మానవ హక్కు”!
ఇలా మొదలైంది..
కేరళలోని కోజికోడ్ లో మిఠాయి వీధి, ఎంఐ స్ట్రీట్ పరిసరాల్లోని దుకాణాలు, టెక్స్‌టైల్ షోరూమ్‌లలో పనిచేసే వేలాది మంది సేల్స్ విమెన్ అనుభవించిన అమానుష పరిస్థితుల నుంచి రైట్ టూ సిల్ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు (దాదాపు 10 నుండి 12 గంటలు) ఏకధాటిగా నిలబడే ఉండాలనేది నియమం. కొద్దిసేపు గోడకు ఆనుకున్నా, కూర్చున్నా వేతనంలో కోత విధించడం లేదా ఉద్యోగం నుంచి తీసివేయడం చేసేవారు. మూత్రవిసర్జనకు వెళ్లడానికి కూడా అనుమతి ఉండేది కాదు. దీనివల్ల ఉద్యోగులు నీళ్లు తాగడం మానేసి తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడేవారు. ఈ బాధల నుంచి అసంఘటిత మేఖలా తోళిలాలి యూనియన్’ (ఏఎంటీయూ) ఆవిర్భావించింది. ఈ అణచివేతపై పోరాడేందుకు విజి పకిదితుకండయిల్ అనే సామాజిక కార్యకర్త, టైలరింగ్ పనిచేసే మహిళ నేతృత్వంలో మహిళలు ఏకమయ్యారు. 2009లో మొదట మహిళల సాధికారత కోసం ‘పెన్‌కూట్టు’ అనే సంఘం ఏర్పాటైంది. సాంప్రదాయ ట్రేడ్ యూనియన్లు సేల్స్ విమెన్ సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడంతో, 2014లో కేరళలోనే తొలిసారిగా పూర్తిగా మహిళలే నడిపే కార్మిక సంఘాన్ని స్థాపించారు. విజి దీనికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం హింసాత్మక మార్గాల్లో కాకుండా, వినూత్నమైన, పద్ధతుల్లో జరిగింది. రోడ్లపై చాపలు పరుచుకుని కూర్చోవడం, కుర్చీలు వేసుకుని నిరసన తెలపడం ద్వారా “కూర్చోవడం మా హక్కు” అని చాటిచెప్పారు. దాదాపు దశాబ్ద కాలం సాగిన ఈ సుదీర్ఘ పోరాటానికి కేరళ ప్రభుత్వం దిగివచ్చింది. జూలై 2018 లో, కేరళ కేబినెట్ ‘కేరళ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్, 1960’ కేరలళ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
హరిప్రసాద్ దూపాటి
సామాజిక విశ్లేషకులు




