ADHD Symptoms High In Boys: ఈ రోజుల్లో పిల్లలు భోజనం చేయకుండా అయినా ఉంటున్నారేమో కానీ ఫోన్ చూడకుండా మాత్రం క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అంతలా స్మార్ట్ ఫోన్‌కు, ఆన్‌లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. వాటికి తోడు జంక్ ఫుడ్‌ని అమితంగా తింటున్నారు. అదే ఇప్పుడు వారి భవిష్యత్తుని అగమ్యగోచరం చేస్తోంది. ఇకపోతే, స్క్రీన్ ఎక్స్‌పోజర్, ఆధునిక జీవనశైలి బాలికల్లో కంటే బాలురపైనే అధికంగా ప్రభావం చూపిస్తోందని తద్వారా ADHD లక్షణాలతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ADHD అంటే అసలు ఏంటంటే..
ఆధునిక జీవనశైలి ద్వారా వచ్చే మార్పులు, ఎక్కువగా స్క్రీన్ ముందు కూర్చోవడం ద్వారా పిల్లల్లో ADHD లక్షణాలు కనిపిస్తున్నాయని తాజాగా హైదరాబాద్‌కి చెందిన మానసిక నిపుణులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ADHD(Attention Deficit Hyperactivity Disorder) అంటే పిల్లలు.. చాలా విషయాల్లో అజాగ్రత్త వహించడం(శ్రద్ధ చూపించకపోవడం) లేదా వాటిపై హఠాత్తుగా స్పందించడం లాంటివి అధిక స్థాయిలో ఉన్నట్లు అర్థం. 50 మందికి పైగా పాఠశాల వయస్సు గల పిల్లలను పరిశీలించిన తర్వాత ఈ అధ్యయనంలో వెల్లడైంది. బాలికలతో పోలిస్తే బాలురలో ఈ లక్షణాలు అధికంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అమ్మాయిల్లోనూ ఈ లక్షణాలు ఉన్నప్పటికీ.. అవి చాలా తక్కువగా ఉండటం వల్ల వారిని గుర్తించలేకపోవచ్చని నిపుణులు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని 6- 10 ఏళ్ల వయస్సు పిల్లల్లో ADHD లాంటి లక్షణాలు క్రమంగా పెరుగుతున్నాయని సైకాలజిస్టులు గుర్తించారు. అధిక స్క్రీన్ సమయం ఒక ప్రధాన కారకంగా మారుతోందని పేర్కొన్నారు. రోజుకు రెండు గంటలకు పైగా స్క్రీన్‌లను చూస్తున్న పిల్లల్లో ఏకాగ్రత, బిహేవియర్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 7.7 రెట్లు ఎక్కువని పిల్లల మానసిక వైద్యుడు డాక్టర్ సిరి వర్షిణి పేర్కొన్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడం కూడా వారి దృష్టి, భావోద్వేగ నియంత్రణను ప్రభావితం చేస్తుందని చెప్పారు.
అయితే తరగతి గదిలో కూడా విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులు పాఠాలు చదవడానికి లేదా ఉపాధ్యాయులు చెప్పిన సలహాలను పాటించడానికి ఇబ్బంది పడుతున్నారని సికింద్రాబాద్‌లోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఆర్. పద్మ తెలిపారు. పిల్లలకు సరిగా విశ్రాంతి దొరకడం లేదని తల్లిదండ్రులు భావిస్తున్నారని ఆమె అన్నారు. కానీ అది ఆందోళన కలిగించే విషయమని వెల్లడించారు.
పిల్లలు అల్లరి చేయకుండా వారిని బిజీగా ఉంచడానికే వారికి సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు అందజేస్తున్నామని ఓ బాలుడి తండ్రి సురేష్ కుమార్ తెలిపారు. కానీ దాని వల్ల ఇలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయని ఊహించలేదని అన్నారు. ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల తమ కుమారుడి ఏకాగ్రతలో మార్పులను గమనించినట్లు ఆయన వివరించారు.
ఈ ప్రమాదకర ఘంటికల నేపథ్యంలో పిల్లల మానసిక పరిస్థితి, ప్రవర్తనపై తల్లిదండ్రులకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ లక్షణాలను ముందుగా గుర్తిండం, వారి దినచర్యల్లో మార్పులు, వాతావరణ ప్రభావం.. చిన్నారుల్లో చాలా తేడాను తెస్తాయని చెబుతున్నారు. ADHD ని ముందుగానే గుర్తించినట్లయితే.. పిల్లలతో కఠినంగా కాకుండా సానుభూతితో వ్యవహరిస్తూ వారిలో మార్పులు తీసుకువచ్చినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని సైకాలజిస్ట్ టి అభయ్ సూచించారు.


