AEPS cash withdrawal safety tips : బ్యాంకు శాఖల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు.. ఏటీఎం కార్డుల పిన్ నంబర్ల బెడద అంతకన్నా లేదు! ఒక్క వేలిముద్ర వేస్తే చాలు, బ్యాంక్ ఖాతాలోని కాసులు నేరుగా చేతికొచ్చే ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (AEPS) సామాన్యులకు కొండంత అండగా నిలుస్తోంది. తపాలా శాఖ ‘ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్’ (IPPB) ద్వారా వృద్ధులు, పింఛనుదారులు, రైతుల ఇంటి ముంగిటకే నగదు చేరుతోంది. అయితే, సౌలభ్యం వెంటే ముప్పూ పొంచి ఉందన్న చందంగా.. సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అమాయకుల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మరి ఈ బయోమెట్రిక్ విత్‌డ్రా వ్యవస్థలో నిలువుదోపిడీకి గురికాకుండా ఉండాలంటే ఎలాంటి కనీస మెలకువలు పాటించాలి?
నిపుణులు సూచిస్తున్న కీలక జాగ్రత్తలు:
ఏజెంట్ గుర్తింపు తప్పనిసరి: లావాదేవీ నిర్వహించే బ్యాంకింగ్ కరస్పాండెంట్ (BC) లేదా సేవా కేంద్రం నిర్వాహకుడి ఐడీ కార్డును ముందుగా అడిగి ధ్రువీకరించుకోవాలి.
స్కానర్ పరికరం పరిశీలన: బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేసేముందు దానిపై ఏదైనా పారదర్శక ప్లాస్టిక్ ఫిల్మ్, సిలికాన్ పొర లేదా స్టిక్కర్ అతికించి ఉందేమో గమనించాలి. క్లోనింగ్ ముప్పును తప్పించేందుకు అనుమానం వస్తే వేలిముద్ర వేయకూడదు.
రసీదు తీసుకోండి: నగదు తీసుకున్న వెంటనే అధీకృత ట్రాన్సాక్షన్ స్లిప్ (Receipt) తప్పనిసరిగా తీసుకోవాలి. విత్‌డ్రా మొత్తం, మిగిలిన నిల్వ (Balance) సరిచూసుకోవాలి.
‘ట్రాన్సాక్షన్ ఫెయిల్’ అంటే తొందరపడొద్దు: సర్వర్ పనిచేయక లావాదేవీ విఫలమైందని ఏజెంట్ చెప్పిన వెంటనే రెండోసారి వేలిముద్ర వేయవద్దు. మొబైల్‌కు డెబిట్ మెసేజ్ వచ్చిందో లేదో చూసి, నిర్ధారించుకున్నాకే తదుపరి చర్య తీసుకోవాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మార్గదర్శకాల ప్రకారం.. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930 లేదా బ్యాంక్ శాఖను సంప్రదించాలి. కాస్త అప్రమత్తతే మీ కష్టార్జితానికి రక్షాకవచం.

