Aluminum Utensils:మన ఇళ్ల వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ముఖ్యమైన భాగం అయిపోయాయి. తేలికగా మోసుకెళ్లగలగటం, చవకగా దొరకటం, వేడి త్వరగా అవ్వడం వంటి లక్షణాల వల్ల రోజువారీ వంటల్లో ఎక్కువమంది వీటినే వాడుతున్నారు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతీ వంటలో అల్యూమినియం పాత్రల వాడకం కనిపిస్తుంది. అయితే ఈ పాత్రలు ఉపయోగకరంగా ఉంటాయా లేక మన ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయా అన్న ప్రశ్న అనేకమందిని ఆలోచింపజేస్తోంది.
అల్యూమినియం అతి స్వల్పంగా..
నిపుణుల వివరాల ప్రకారం అల్యూమినియం ఒక లోహం కావడం వల్ల కేవలం పాత్ర రూపంలో వాడటం మాత్రమే హానికరం కాదని చెబుతున్నారు. అసలు సమస్య వస్తున్నది వాటిని ఉపయోగించే విధానంలోనుంచే. వంట చేసే సమయంలో ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత వద్ద పాత్రలోని అల్యూమినియం అతి స్వల్పంగా ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ పరిమాణం చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి తక్షణ ప్రభావం ఉండదు. కానీ టమాటా, చింతపండు, నిమ్మరసం, వెనిగర్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలను ఈ పాత్రల్లో వండినప్పుడు మాత్రం అల్యూమినియం ఆహారంలోకి వేగంగా ప్రవేశిస్తుంది.
పుల్లని పదార్థాలను మళ్లీ మళ్లీ..
మన శరీరం రోజుకు రెండు నుంచి పది మిల్లీగ్రాముల వరకు అల్యూమినియంను సహజంగా జీర్ణించగలదు. ఈ పరిమితిని మన కిడ్నీలు సులభంగా వడపోసి బయటికి పంపిస్తాయి. అందువల్ల అప్పుడప్పుడూ వాడటం వల్ల ప్రమాదం ఉండదు. కానీ ప్రతిరోజూ అదే విధంగా వాడుతూ, ముఖ్యంగా పుల్లని పదార్థాలను మళ్లీ మళ్లీ అల్యూమినియం పాత్రల్లో వండటం లేదా వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు అదే పాత్రలో ఉంచడం వల్ల శరీరంలో అల్యూమినియం మోతాదు క్రమంగా పెరుగుతుంది. ఈ అదనపు లోహాన్ని కిడ్నీలు పూర్తిగా ఫిల్టర్ చేయలేని స్థితి వస్తే శరీరంలో నిల్వ అవుతూ దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.
జ్ఞాపకశక్తి తగ్గడం..
ఈ లోహం అధికంగా చేరినప్పుడు మెదడు, ఎముకలు, కాలేయం, కిడ్నీలు వంటి ముఖ్య అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అల్యూమినియం అధిక స్థాయిలో పేరుకుపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు వంటి నాడీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముంది. అల్జీమర్స్ వంటి వ్యాధులతో దీని సంబంధం ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
అలాగే ఇది శరీరంలో కాల్షియంను పూర్వ స్థితిలో గ్రహించకుండా అడ్డుకోవచ్చు. దాని ఫలితంగా ఎముకలు బలహీనపడటం, సులభంగా విరిగే స్థితికి చేరుకోవటం జరుగుతుంది. కిడ్నీలపై అధిక భారం పడటంతో వాటి పనితీరు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. రోగనిరోధక వ్యవస్థలో మార్పులు చోటు చేసుకొని ఆటో ఇమ్యూన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హృదయ సంబంధిత సమస్యలు కూడా రావచ్చని చెబుతున్నారు.
Also read: https://teluguprabha.net/devotional-news/is-rain-on-wedding-day-good-or-bad-according-to-vastu/
ఈ ప్రమాదాలనుంచి దూరంగా ఉండటానికి అల్యూమినియం పాత్రల వాడకాన్ని జాగ్రత్తగా నియంత్రించుకోవాలి. పుల్లని పదార్థాలు వండాల్సినప్పుడు వీటిని తప్పించి స్టీల్ లేదా మట్టిపాత్రలను ఎంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వండిన ఆహారాన్ని ఎక్కువసేపు అల్యూమినియం పాత్రల్లో ఉంచకూడదు. వంట పూర్తయ్యాక వెంటనే స్టీల్ లేదా గాజు పాత్రల్లోకి మార్చడం సురక్షితంగా ఉంటుంది.


