Astrology and Travel Trend: ట్రావెల్ ట్రెండ్స్ లో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్లు పుట్టుకొస్తుంటాయి. అలాంటిదే ఈ ఆస్ట్రాలజీ అండ్ ట్రావెల్ ట్రెండ్. పుట్టిన జాతకంలోని నక్షత్రాన్ని బట్టి టూర్లు కొట్టి, సత్ఫలితాలను పొందే ఆలోచనలో ఉన్న ట్రావెలర్స్ జాతక రీత్యా టూర్లు కొడుతున్నారు. ఏదో రీల్ ను చూసి, ఇన్ఫ్ల్యూయెన్సర్స్ చెప్పినది, ట్రెండింగ్ లో ఉన్న ప్లేస్ కు వెళ్లి వాలిపోవటం మానేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్వామి దగ్గరకు వెళ్లి జాతకం చెప్పించుకునిమరీ వారు చెప్పిన సలహా మేరకు ఆయా ప్రాంతాల్లో కలియతిరిగి వచ్చేస్తున్నారు.
ఆస్ట్రోకార్టోగ్రఫీ..
జీవితంలో మెరుగుదల కనిపిస్తుందని, జీవితంలో సమస్యలన్నీ గట్టెక్కవచ్చని విశ్వసించటంలో భాగంగా ఇలా నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. దీన్నే ఆస్ట్రోకార్టోగ్రఫీ అంటారు. దీన్నే లొకేషనల్ ఆస్ట్రాలజీ అని లేదా స్థాన జ్యోతిష్యం అని అంటారు. పుట్టిన సమయానికి విశ్వంలో ఉన్న గ్రహాల స్థానాలను అంటే జాతకం లేదా కుండలిని ప్రపంచ పటంపై రేఖల రూపంలో గీసి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లెక్కలు వేసి చూపే పద్ధతినే ఆస్ట్రోకార్టోగ్రఫీ అంటారు. మీరు ఏ గ్రహ రేఖ ఉన్న ప్రాంతానికి వెళితే ఆ గ్రహానికి సంబంధించిన ఫలితాలు జీవితంలో కనిపిస్తాయి. ఉదాహరణకు సూర్య రేఖ ఉన్న ప్రాంతానికి వెళితే మీకు ఆత్మవిశ్వాసం, పేరు-ప్రతిష్టలు లభిస్తూ, కెరీర్ లో ఎదగడానికి మంచి స్థలంగా మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. అందుకే టూర్లు వెళ్లే వారు ఇలా జ్యోతిష్యుల సలహాలు, సూచనలు తీసుకుని ప్రయాణాలు చేసే ట్రెండ్ పెరిగింది. నిజానికి మనదేశంలో ఇలా ఫలానా ప్రాంతానికి ఫలానా వాళ్లు వెళ్తే మంచిదని చెప్పటం, ఫాలో కావటం ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయమే అయినప్పటికీ పాశ్చాత్య దేశాల్లో ఇది సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది.


