Ghee benefits-Immunity boost:ఖాళీ కడుపుతో నెయ్యిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం శరీరానికి మేలు చేస్తుందని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అయితే ఈ మిశ్రమంలో చిటికెడు పసుపు, నల్ల మిరియాల పొడి కలిస్తే మరింత శక్తివంతమైన పానీయం సిద్ధమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీర శోథం తగ్గించడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఈ డ్రింక్ ఎన్నో విధాలుగా సహాయపడుతుందని ఆమె అభిప్రాయం. నెయ్యి, పసుపు, మిరియాలు ఒక్కోటి వేర్వేరు లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ, మూడు కలిసి పనిచేసినప్పుడు శరీర విధులు మరింత చురుకుగా మారతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
కొవ్వుల నిలయం
నెయ్యి సహజసిద్ధమైన కొవ్వుల నిలయం. ఇందులో ఉండే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లు జీర్ణవ్యవస్థను మృదువుగా కదిలించేలా చేస్తాయి. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిసినప్పుడు అది పేగులకు పోషకాలను అందిస్తుంది.. ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమం తీసుకుంటే ఆహారం ముందుకు వెళ్లే ప్రక్రియ సులభం అవుతుంది. ప్రేగుల కదలికలు మెరుగుపడటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఈ సహజ చర్య వల్ల శరీరం రోజూ ఎదుర్కొనే భారాన్ని తగ్గించుకోవచ్చు.
Also Read: https://teluguprabha.net/lifestyle/daily-two-eggs-benefits-for-body-brain-and-immunity/
డిటాక్సిఫికేషన్ విషయంలో..
డిటాక్సిఫికేషన్ విషయంలో కూడా నెయ్యి తన పాత్రను బాగా పోషిస్తుంది. కొవ్వులో కరిగే విషపదార్థాలను శరీరం నుండి బయటకు పంపే ప్రక్రియలో ఇది సహాయం చేస్తుందని ఆమె వివరిస్తున్నారు. శరీరాన్ని శుభ్రపరచే విధానాలు సహజంగానే పనిచేయడానికి ఈ మిశ్రమం మద్దతు ఇస్తుంది. ఉదయం తీసుకున్నప్పుడు శరీరం మొత్తం తేలికగా అనిపించడానికి ఇదే కారణమని చెబుతున్నారు.
పసుపులో దాగి ఉండే..
పసుపులో దాగి ఉండే కర్కుమిన్ అనే పదార్థం గురించి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మాత్రమే కాదు, శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యం కూడా ఎక్కువ. అయితే కర్కుమిన్ నేరుగా శరీరం గ్రహించదు అనే పరిమితి ఉంది. ఇక్కడ నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
పైపెరిన్ కారణంగా కర్కుమిన్ శరీరం సులభంగా ఉపయోగించుకునే స్థితిలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ అర్చన బాత్రా మాటల్లో చెప్పాలంటే, కర్కుమిన్ మరియు పైపెరిన్ కలయిక శరీరానికి అదనపు రక్షణలా పనిచేస్తుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/cumin-water-role-in-indias-rising-obesity-concern-explained/
ఈ మూడు పదార్థాలు కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని మంట తగ్గడమే కాకుండా కీళ్ల నొప్పులకు కూడా ఉపశమనం లభించవచ్చు. తరచుగా జలుబు రావడం, గొంతులో మంట, శరీర బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ మిశ్రమం ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి బలపడటంతో వైరస్, బ్యాక్టీరియా వంటి శత్రువుల నుండి శరీరం రక్షణ పొందుతుంది.

