ఈ మధ్యకాలంలో యువతలో జుట్టు సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. జుట్టు రాలడం, ముందుగా తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి.
దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన జుట్టు కోసం సహజ మార్గాలు ఎంచుకోవడం అవసరం. అటువంటి సహజ పరిష్కారాల్లో నల్ల నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నల్ల నువ్వుల్లో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, జింక్, కాల్షియం, కాపర్, విటమిన్ ఈ వంటి కీలక పోషకాలు ఉంటాయి
నల్ల నువ్వుల్లో కనిపించే మెలనిన్ అనే పదార్థం జుట్టు సహజ రంగాన్ని కాపాడుతుంది. మెలనిన్ స్థాయి తగ్గినపుడు తెల్ల జుట్టు సమస్య పెరుగుతుంది. నువ్వులలో ఉండే కాపర్, మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది.
రోజూ కొద్దిగా నల్ల నువ్వులు తినడం వల్ల జుట్టుకే కాదు, మొత్తం శరీరానికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచి, జుట్టు మూలాలకు పోషణ అందిస్తాయి. నువ్వుల నూనెను తలపై మసాజ్ చేయడం వల్ల జుట్టు బలపడి, ఒత్తుగా మారుతుంది.
జుట్టు పెరుగుదల కోసం నల్ల నువ్వుల్లో ఉన్న విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు పనికొస్తాయి. ఇది కొత్త జుట్టు రావడాన్ని ఉత్తేజితం చేస్తుంది. నల్ల నువ్వులను కూరల్లో, సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పచ్చికొబ్బరి లేదా సోంపుతో కలిపి కూడా వాడవచ్చు
ఇక నువ్వుల నూనెను స్నానం ముందు తలకు మసాజ్ చేయడం వల్ల పోషకాలు జుట్టు మూలాలకు చేరుతాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా సహజమైన నల్ల నువ్వులను ఆహారంలో భాగంగా లేదా నూనెగా వాడటం ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.