వీడియోలకు ఆకర్షితులవుతున్న చిన్నారులు
అభ్యసనంపై మాత్రం అంతంతే..
32 వేలకుపైగా యూట్యూబ్ వీడియోల విశ్లేషణలో ఆసక్తికర అంశాలు
ఆరు నుంచి పదేళ్ల పిల్లలపై ఐఎస్బీ, శాంటా క్లారా వర్సిటీ పరిశోధన
న్యూఢిల్లీ, నవంబర్ 1 : పిల్లలను వీడియోలకు ఎక్కువసేపు కట్టిపడేయడంలో కదిలే దృశ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఆ ఆకర్షణ విద్యా విషయాలపై కాకుండా, తెరపై కదులుతున్న నేపథ్య దృశ్యాలపైనే ఎక్కువగా ఉంటోంది. వీడియోలను పిల్లలు ఎక్కువసేపు చూస్తున్నారంటే వారు అందులోని పాఠ్యాంశాలను శ్రద్ధగా నేర్చుకుంటున్నారని భావించలేమని భారతీయ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అధ్యయనం స్పష్టం చేసింది. డిజిటల్ తెరలపై పిల్లల దృష్టిని నిలిపే అంశాలు, వారి అభ్యసనంపై చూపే ప్రభావం వేర్వేరని పరిశోధన వెల్లడించింది.
32 వేల వీడియోల విశ్లేషణ
పిల్లల డిజిటల్ మీడియా వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారిని వీడియోలవైపు ఆకర్షించే అంశాలపై ఐఎస్బీ, అమెరికాలోని శాంటా క్లారా యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం చేశారు. పిల్లల కోసం రూపొందించినట్లు గుర్తింపు పొందిన 32 వేలకుపైగా యూట్యూబ్ వీడియోలను విశ్లేషించారు. దీనికి తోడు ఆరు నుంచి పదేళ్ల వయసున్న పిల్లలతో నియంత్రిత ప్రయోగం నిర్వహించారు. వీడియోలు చూస్తున్నప్పుడు వారి కంటి కదలికలను ప్రత్యేక పరికరాల ద్వారా పరిశీలించారు. ఈ పరిశోధన ‘అటెన్షన్ ట్రాప్? హౌ విజువల్ మోషన్ షేప్స్ చిల్డ్రన్స్ స్క్రీన్ టైమ్ అండ్ ఎంగేజ్మెంట్ ఆన్ వీడియో ప్లాట్ఫామ్స్’ పేరుతో ‘ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రీసెర్చ్’ జర్నల్లో ప్రచురితమైంది.
కదలికలు పెరిగితే వీక్షణలూ ఎక్కువే..
వీడియోల్లో దృశ్య కదలికలు 10 శాతం పెరిగినప్పుడు వాటి వీక్షణల సంఖ్య సగటున 1.1 శాతం అధికంగా నమోదైనట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే ఒక వీడియోకు సాధారణంగా 10 వేల వీక్షణలు వస్తుంటే, దృశ్య కదలికలు 10 శాతం పెరిగిన సందర్భంలో సుమారు 10,110 వీక్షణలు వచ్చాయి. వీడియోలోని ఆడియో, దృశ్యాలు, భావోద్వేగాలు, వచనానికి సంబంధించిన ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఈ సంబంధం కనిపించింది. నియంత్రిత ప్రయోగంలోనూ నేపథ్య కదలికలు వీక్షణలను పెంచినట్లు తేలింది. కదలికలు లేని విద్యా వీడియోలతో పోలిస్తే, మధ్యస్థ స్థాయి కదలికలు జోడించిన వీడియోల వీక్షణ రేటు 1.6 శాతం అధికంగా నమోదైంది. అధిక స్థాయి కదలికలున్న వీడియోల్లో ఈ పెరుగుదల 2 శాతంగా ఉంది. అంటే 100 వీక్షణల ప్రాతిపదికన పోలిస్తే మధ్యస్థ కదలికలతో సుమారు 101.6, అధిక కదలికలతో 102 వీక్షణల స్థాయికి చేరినట్లు ఈ గణాంకాల అర్థం. దృశ్య కదలికలు పిల్లలను వీడియోల వద్ద నిలిపే ఆకర్షణీయమైన సాధనంగా పనిచేస్తున్నాయని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
నేపథ్యంపైనే చూపు.. పాఠ్యాంశంపై కాదు
కంటి కదలికల పరిశీలనలో మాత్రం మరింత కీలకమైన విషయం వెల్లడైంది. నేపథ్య దృశ్యాల్లో కదలికలు ఉండటంతో పిల్లలు తెర నుంచి చూపు మరల్చే వ్యవధి తగ్గింది. ఫలితంగా తెరను చూస్తూ గడిపే సమయం 3.4 నుంచి 3.6 శాతం పాయింట్ల మేర పెరిగింది. ఉదాహరణకు, సాధారణంగా 100 నిమిషాల పరిశీలనలో 80 నిమిషాలపాటు తెరను చూసే పిల్లలు, కదలికలున్న వీడియోల్లో సుమారు 83.4 నుంచి 83.6 నిమిషాలపాటు తెరను చూసే స్థాయిలో మార్పు కనిపించింది. అయితే, అదనంగా పెరిగిన ఈ దృష్టి బోధనా అంశాలపై కాకుండా కదులుతున్న నేపథ్య దృశ్యాలపైనే కేంద్రీకృతమైంది. అంటే పిల్లలు తెరను ఎక్కువసేపు చూస్తున్నప్పటికీ, అందులోని పాఠాన్ని అంతే శ్రద్ధగా గమనిస్తున్నారని చెప్పలేమన్నమాట.
ఉద్దేశపూర్వకంగానే కదలికల వినియోగం
వీడియోల్లో కదలికలు శక్తివంతమైన రూపకల్పన సాధనమని, అయితే వాటిని అవసరమైన సందర్భాల్లోనే ఉపయోగించాలని ఐఎస్బీ అసోసియేట్ ప్రొఫెసర్ మధు విశ్వనాథన్ సూచించారు. వీడియో అంతటా నిరంతరం కదలికలు చూపించడం కంటే, పిల్లల దృష్టి మళ్లే అవకాశం ఉన్న సందర్భాల్లో పరిమితంగా ఉపయోగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. తెరపై పిల్లల చూపు నిలిచినంత మాత్రాన విద్యా విషయాలపై ఏకాగ్రత పెరిగినట్లు కాదని, ఈ అంశంపై మరింత పరిశోధన అవసరమని వివరించారు.
వీక్షణ సమయమే విద్యా ప్రమాణం కాదు
పిల్లలు ఒక వీడియోను ఎంతసేపు చూస్తున్నారనే అంశం మాత్రమే దాని విద్యా విలువను నిర్ణయించడానికి సరిపోదని ఈ అధ్యయనం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచిస్తోంది. వారు నిజంగా పాఠ్యాంశాన్ని గమనిస్తున్నారా? లేక ఆకర్షణీయమైన నేపథ్య దృశ్యాలకే పరిమితమవుతున్నారా? అన్నది పరిశీలించాలి. పిల్లల కోసం వీడియోలు రూపొందించే సంస్థలు దృశ్య కదలికలను కంప్యూటర్ విజన్ పద్ధతులతో విశ్లేషించి, అవి బోధనా అంశాలపై దృష్టిని పెంచుతున్నాయా లేదా అన్నది అంచనా వేయొచ్చని పరిశోధకులు సూచించారు. ఈ విధమైన కొలమానాలు కంటెంట్ నాణ్యతను పరిశీలించడంతోపాటు, ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రుల నియంత్రణ వ్యవస్థలకు అదనపు సాధనాలుగా ఉపయోగపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిశోధనలో ఐఎస్బీకి చెందిన సుమీత్ కుమార్, మధు విశ్వనాథన్, శాంటా క్లారా యూనివర్సిటీకి చెందిన రవి బాప్నా భాగస్వాములయ్యారు.

