Coconut water: ఎండలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే మాడు పగిలే ఎండలు కనిపిస్తున్నాయి. బయటకు వెళ్లినప్పుడు కొద్దిసేపటికే దాహం వేయడం మొదలవుతోంది. ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలవైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొబ్బరి నీరు అంటే వేసవిలో ఎక్కువగా తాగే పానీయం. దాహం తీరడమే కాకుండా శరీరానికి తగినంత హైడ్రేషన్ ఇవ్వడంలో కూడా ఇది ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తారు. అందులో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేస్తాయని నమ్మకం. అయితే ఆరోగ్యానికి మంచిదని భావించే ఈ పానీయం కొన్ని పరిస్థితుల్లో మాత్రం జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్త
కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ఇది శరీరానికి ఉపయోగపడుతుంది. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లలో ఈ పొటాషియం శరీరం నుంచి సరిగా బయటకు వెళ్లకపోవచ్చు. దీంతో రక్తంలో పొటాషియం స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి గుండె స్పందనపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లు కొబ్బరి నీరు తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
మధుమేహం ఉన్నవాళ్లు పరిమితంగా తాగాలి
కొబ్బరి నీటిలో సహజంగా తీపి ఉంటుంది. ఇందులో ఉండే నేచురల్ షుగర్ వల్ల ఇది రుచిగా అనిపిస్తుంది. అయితే మధుమేహం ఉన్నవాళ్లు దీనిని ఎక్కువగా తాగితే రక్తంలో షుగర్ స్థాయి ఒక్కసారిగా పెరగే అవకాశం ఉంటుంది. చిన్న పరిమాణంలో తాగితే పెద్ద సమస్య ఉండకపోయినా, తరచుగా ఎక్కువగా తాగడం మంచిది కాదు. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు కొబ్బరి నీరు తాగే విషయంలో పరిమితి పాటించాలి.
Read Also: Flagship phones: ఖరీదైన ఫోన్ కొనే ప్లాన్ ఉందా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా గమనించండి
బరువు తగ్గాలనుకునేవాళ్లు జాగ్రత్త
కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన పానీయం అయినా అది పూర్తిగా కాలరీలు లేని పానీయం కాదు. సాధారణంగా ఒక గ్లాస్‌లో 45–60 కాలరీలు ఉండొచ్చు. రోజూ ఎక్కువసార్లు తాగితే ఈ కాలరీలు కలిపి శరీరానికి అదనపు శక్తి అందిస్తాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవాళ్లకు ఇది కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి సందర్భాల్లో సాధారణ నీరు ఎక్కువగా తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొన్ని మందులు తీసుకునేవాళ్లు జాగ్రత్త
బీపీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించిన కొన్ని మందులు తీసుకునే వాళ్లు కూడా కొబ్బరి నీరు తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ACE inhibitors, డయురేటిక్స్ లాంటి మందులు తీసుకునే వాళ్లలో పొటాషియం స్థాయి ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఎలెక్ట్రోలైట్ సమతుల్యత మారే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజూ తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
వ్యాయామం తర్వాత కొబ్బరినీరు తాగితే
చాలామంది వ్యాయామం చేసిన వెంటనే కొబ్బరి నీరు తాగితే శరీరానికి బలం వస్తుందని భావిస్తారు. కానీ తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు చెమటల ద్వారా శరీరం సోడియం ఎక్కువగా కోల్పోతుంది. కొబ్బరి నీటిలో మాత్రం సోడియం తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువసేపు వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి అవసరమైన సోడియం తిరిగి అందేలా ఇతర పానీయాలను కూడా తీసుకోవడం అవసరం.
అలర్జీ ఉన్నవాళ్లు జాగ్రత్త
కొబ్బరి ఒక ఫలం అయినప్పటికీ కొందరికి అలర్జీ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా నట్ అలర్జీ ఉన్నవాళ్లలో కొబ్బరి నీరు తాగిన తర్వాత కొన్ని రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నీరు తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి మంచిదనే కారణంతో ఎక్కువగా తాగడం కంటే మన శరీర పరిస్థితిని బట్టి తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

