అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ తలనొప్పిగా మారాయి. వివిధ దేశాలపై టారిఫ్‌లు (సుంకాలు) పెంచుతుండటంతో అంతర్జాతీయంగా టారిఫ్ యుద్ధం ఊపందుకుంది. ఈ పరిణామాల ప్రభావం అన్ని దేశాలకూ భయానకంగా కనిపిస్తున్నప్పటికీ, భారత్‌కు మాత్రం ఒక రకంగా ఉపయోగపడుతోంది. టారిఫ్ యుద్ధాల నేపథ్యంలో భారత్ దిగుమతి చేసే వంటనూనె ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా పామ్ ఆయిల్ ధరలు 7 నుంచి 8 శాతం వరకు తగ్గాయి. అంతే కాకుండా, క్రూడ్ సోయాబీన్ ఆయిల్ ధర కూడా టన్నుకు దాదాపు 48 డాలర్లు తగ్గింది. ఏప్రిల్ 11 నుంచి 21 మధ్య ఈ ధరల పతనం జరిగింది. దీంతో రానున్న రోజుల్లో రిటైల్ మార్కెట్లలో కూడా వంటనూనె ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ ప్రజలకు ఊరట కలిగించనుంది.
ఇంకొకవైపు, గత రెండు దశాబ్దాల్లో భారతదేశంలో తలసరి వంటనూనె వినియోగం బాగా పెరిగింది. 2001లో ఒక్క వ్యక్తికి సంవత్సరానికి 8.2 కిలోల వంటనూనె వినియోగం ఉండగా, ఇప్పుడు అది 23.5 కిలోలకు చేరింది. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సూచించిన 12 కిలోల మోతాదుకి రెట్టింపు. ఈ అధిక వినియోగం దేశాన్ని దిగుమతులపై ఎక్కువగా ఆధారపడేలా చేసింది. అందువల్ల, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 25–26 మిలియన్ టన్నుల తినదగిన నూనె అవసరం ఉంది. అయితే, స్థానికంగా కేవలం 11 మిలియన్ టన్నులే ఉత్పత్తి అవుతోంది. మిగిలిన అవసరాన్ని దిగుమతు చేస్తోంది. భారత్ పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, సోయాబీన్ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్‌ల నుంచి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలోని వంటనూనె వినియోగంలో పామాయిల్‌కు 37 శాతం వాటా ఉంది. సోయాబీన్ 20 శాతం, ఆవాల నూనె 14 శాతం, సన్‌ఫ్లవర్ ఆయిల్ 13 శాతం వరకు వినియోగంలో ఉన్నాయి. హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసుల వంటలు ఎక్కువగా ఈ నూనెల మీద ఆధారపడుతున్నాయి. ఇంటి బయట తినే అలవాటు పెరగడంతో పాటు రెడీమేడ్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు ఎక్కువ కావడమే దీనికి ప్రధాన కారణం.