Diwali Safety Tips to Protect Eyes and Skin:దీపావళి అంటే వెలుగుల పండుగ, కుటుంబం అంతా కలసి జరుపుకునే ఆనందమైన వేడుక. కానీ ఈ వేడుకలో పటాకుల శబ్దం, పొగ, రసాయనాలు కొన్ని సార్లు ప్రమాదాలకు దారి తీస్తాయి. చిన్న నిర్లక్ష్యం వల్ల కళ్ళు, చర్మం వంటి సున్నితమైన భాగాలకు గాయాలు కావడం సాధారణమే. అందుకే వైద్య నిపుణులు ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలు ఇస్తుంటారు. ఈసారి కూడా దీపావళి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు వివరించారు.
కళ్లలోకి చేరితే…
పటాకులు కాల్చేటప్పుడు లేదా వాటి వల్ల వచ్చే పొగ కళ్లలోకి చేరితే చాలా మంది చేసే మొదటి తప్పు కళ్లను బలంగా రుద్దడం. ఇది కంటి ఉపరితలమైన కార్నియాకు తీవ్రమైన నష్టం కలిగించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లలో దురద, మంటగా అనిపించినా చేతులతో రుద్దకూడదు. అలా చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్ రావచ్చు, చూపు తగ్గే ప్రమాదం ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/devotional-news/diwali-festival-significance-and-lakshmi-puja-importance/
చల్లటి నీటితో కళ్లను…
కళ్లలోకి పొగ, దుమ్ము లేదా రసాయనాలు చేరినట్లయితే వెంటనే శుభ్రమైన, చల్లటి నీటితో కళ్లను మృదువుగా కడగడం ఉత్తమం. ఇది కంటి లోపలికి వెళ్లిన హానికర పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగిస్తే, అవి రసాయనాలను సులభంగా గ్రహిస్తాయి కాబట్టి వెంటనే వాటిని తీసివేయడం తప్పనిసరి. కడిగిన తర్వాత కూడా ఇబ్బంది కొనసాగితే కంటి నిపుణుడిని సంప్రదించి, ఆయన సూచించిన ఔషధాలు మాత్రమే వాడాలి.
అధిక పొగ లేదా ధూళి..
దీపావళి రోజుల్లో అధిక పొగ లేదా ధూళి ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండకపోవడం మంచిది. పటాకులు కాల్చే ప్రదేశం నుండి దూరంగా నిలబడడం ద్వారా కళ్లకు హాని కలగకుండా చూసుకోవచ్చు. సేఫ్టీ గ్లాసెస్ ధరిస్తే ప్రమాదం మరింత తగ్గుతుంది.
చర్మానికి సంబంధించి ప్రమాదాలపై డాక్టర్ హెచ్చరికలు ఇచ్చారు. పటాకుల మంటలు లేదా నిప్పు రవ్వలు తగిలితే చర్మం వెంటనే కాలిపోతుంది. అలాంటి సందర్భంలో మొదట చేయాల్సింది కాలిన ప్రదేశంపై చల్లటి నీరు పోయడం. అది మంటను తగ్గించి చర్మం మరింత దెబ్బతినకుండా కాపాడుతుంది.
టూత్‌పేస్ట్, కాఫీ పౌడర్, పసుపు…
చాలామంది కాలిన గాయాలపై టూత్‌పేస్ట్, కాఫీ పౌడర్, పసుపు వంటి వాటిని పూయడం అలవాటు చేసుకుంటారు. కానీ ఇవి గాయం నయం చేయకపోగా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం పెంచుతాయని డాక్టర్ సచ్‌దేవా సూచించారు. అలాగే కాలిన గాయాలపై ఏర్పడిన బొబ్బలను పగలగొట్టకూడదు. ఆ బొబ్బలు చర్మాన్ని కాపాడే సహజ పొరలా పనిచేస్తాయి. వాటిని పగలగొడితే ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది.
ఆసుపత్రికి వెళ్లడం..
గాయం తీవ్రమైనదిగా అనిపిస్తే ఎటువంటి ఇంటి చిట్కాలు ప్రయత్నించకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లడం అత్యవసరం. ఆలస్యం చేస్తే చర్మం లోతుగా దెబ్బతిని తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.
పెద్దల పర్యవేక్షణ…
ఇక పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. పిల్లల చేతిలో ఉన్న పటాకులు, స్పార్కర్లు సరైన విధంగా వెలిగించకపోతే కళ్ళకు, చేతులకు గాయాలు కావచ్చు. అందుకే పెద్దలు దగ్గరగా ఉండి ప్రతి దశను గమనించాలి.
నీటి బకెట్, ఫస్ట్ ఎయిడ్ కిట్…
పటాకులు కాల్చే ప్రాంతంలో నీటి బకెట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి ప్రాథమిక సదుపాయాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించడానికి ఇవి ఉపయోగపడతాయి.
వైద్యులు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే.. దీపావళి ఆనందాన్ని పంచుకునేటప్పుడు భద్రతా జాగ్రత్తలు పాటిస్తే మాత్రమే నిజమైన పండుగ ఉత్సాహం ఉంటుంది. పటాకులు కాల్చడం ఆనందదాయకం కానీ మన ఆరోగ్యం, భద్రత కంటే ఎక్కువ కాదు.
Also Read: https://teluguprabha.net/viral/yemen-village-that-has-never-seen-rain/
అందుకే పటాకులు వెలిగించేప్పుడు శరీరానికి దగ్గరగా తగలకుండా చూసుకోవాలి. గాలి దిశను గమనించి కాల్చితే పొగ, రసాయనాలు కళ్లలోకి వెళ్లే ప్రమాదం తగ్గుతుంది. కాటన్ బట్టలు ధరించడం వల్ల మంట తగలినా త్వరగా ఆరిపోతుంది. సింథటిక్ లేదా నైలాన్ దుస్తులు మంటను త్వరగా పట్టేస్తాయి కాబట్టి వాటిని వేసుకోకుండా ఉంటే బెటర్.
దీపావళి రాత్రి తర్వాత కూడా పొగ, దుమ్ము గాలిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో కంటి సమస్యలున్నవారు, ఆస్థమా రోగులు బయట ఎక్కువసేపు ఉండకూడదు. తగిన మాస్క్ వాడడం ద్వారా శ్వాస సమస్యలను నివారించవచ్చు.


