Homeలైఫ్ స్టైల్Eye makeup safety: జర భద్రం.. నిద్రపోయే ముందు ఈ ఒక్క పని చేయకపోతే మీ...

Eye makeup safety: జర భద్రం.. నిద్రపోయే ముందు ఈ ఒక్క పని చేయకపోతే మీ కళ్లు వాచిపోతాయి

Eye makeup safety: ముఖం ఎంత అందంగా మేకప్ చేసినా కళ్ల మేకప్ సరిగ్గా లేకపోతే ఆ లుక్ పూర్తిగా కనిపించదు. కళ్లే మన ముఖానికి ఎక్కువ ఆకర్షణ తీసుకొస్తాయి. అందుకే చాలా మంది కాజల్, లైనర్, మస్కారా వంటి మేకప్ ఉపయోగించి కళ్లను మరింత అందంగా చూపించాలని ప్రయత్నిస్తారు. కొంతమంది స్మోకీ స్టైల్ మేకప్ ఇష్టపడితే, ఇంకొందరు సింపుల్ స్టైల్‌తోనే కళ్లను హైలైట్ చేస్తారు. కానీ ఈ అందం కోసం చేసే మేకప్ కళ్ల ఆరోగ్యానికి హాని చేయకుండా ఉండాలి. ఎందుకంటే కళ్ల చుట్టూ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే కళ్ల మేకప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

- Advertisement -

కళ్లలో వచ్చే చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

కళ్లలో దురద, మంట, నీళ్లు కారడం వంటి సమస్యలు చాలా మందికి కనిపిస్తుంటాయి. చాలా మంది ఇవి చిన్న సమస్యలని భావించి పట్టించుకోరు. కానీ నిపుణుల ప్రకారం ఇవి డ్రై ఐ సమస్యకు లేదా బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా ప్రతిరోజూ మేకప్ వేసుకునే వాళ్లలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అలాంటి లక్షణాలు తరచుగా వస్తే వెంటనే జాగ్రత్త పడాలి. సమస్య కొనసాగితే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

మేకప్ ప్రొడక్ట్స్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్త

కళ్ల మేకప్ కోసం ఉపయోగించే ప్రొడక్ట్స్ ఎంపిక చాలా ముఖ్యమైన విషయం. సరైన లేబుల్ ఉన్న, నాణ్యత ప్రమాణాలు పాటించిన ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ తప్పకుండా చూసుకోవాలి. దుర్వాసన వచ్చే, గడ్డలుగా మారిన లేదా పొడిగా కనిపించే మస్కారా, లైనర్ వంటి ప్రొడక్ట్స్ వాడకూడదు. అలాంటి వాటిని వాడితే కళ్లలో ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

Read Also: Bottle gourd benefits: జిమ్‌కి వెళ్లలేకపోతున్నారా.. అయితే సొరకాయతో మీ బరువును తగ్గించుకోండి

ముఖం శుభ్రంగా కడుక్కోవాలి

కళ్ల మేకప్ వేసే ముందు చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం. అలాగే మేకప్ బ్రష్‌లు, అప్లికేటర్లు కూడా తరచుగా శుభ్రం చేయాలి. చాలా మంది ఒకరి మేకప్ వస్తువులు ఇంకొకరు వాడుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఇలా చేస్తే బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. షాపుల్లో ఉండే టెస్టర్ మేకప్ కూడా ఉపయోగించకపోవడం మంచిది.

వాటర్ లైన్ మేకప్ ప్రమాదం

చాలా మంది కళ్ల వాటర్ లైన్ లో కాజల్ లేదా లైనర్ వేస్తారు. కానీ నిపుణుల ప్రకారం అది మంచిది కాదు. ఎందుకంటే అక్కడ మేకప్ వేయడం వల్ల కళ్లలో ఉండే మేబోమియన్ గ్రంధులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కళ్లలో తేమను నిలబెట్టే నూనె పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. అవి బ్లాక్ అయితే కళ్లలో పొడిబారడం సమస్య వస్తుంది. కాంటాక్ట్ లెన్స్ వాడే వాళ్లు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి.

పడుకునే ముందు మేకప్ తప్పనిసరిగా తొలగించాలి

రోజంతా మేకప్ వేసుకుని తిరిగిన తర్వాత రాత్రి పడుకునే ముందు కళ్ల మేకప్ పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యం. చాలా మంది అలసటతో అలాగే పడుకుంటారు. కానీ అలా చేస్తే కళ్ల పలుకులు వాపు వచ్చే బ్లెఫరైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మృదువైన మేకప్ రిమూవర్‌తో కళ్లను శుభ్రం చేసుకోవాలి. అలాగే కొన్నిసార్లు వారంలో ఒకరోజు మేకప్ లేకుండా ఉండడం కూడా కళ్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News