Hair Care Tips: ఈరోజుల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్న,పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి నేటి జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, జన్యుపర కారణాలు ఉండవచ్చు. చాలామంది జుట్టు రాలడాన్ని నివారించేందుకు మార్కెట్లో లభించే అనేక ఖరీదైన ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ అవి ఆశించినంత ప్రయోజనాలు అందించవు.
అయితే, తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంతగానో ఇష్టపడే ఆహారాలు జుట్టు రాలే సమస్యను పెంచుతాయి. ఇవి జుట్టు మూలాలను బలహీనపరుస్తాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటె జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఈ క్రమంలో జుట్టు రాలడాన్నిపెంచే ఆహారల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
చక్కెర కలిగిన ఆహారాలు: చక్కెర కలిగిన ఆహారాలు ఊబకాయానికి దారితీస్తాయి. అవి జుట్టును కూడా బలహీనపరుస్తాయి. ఎక్కువ షుగర్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది. ఇది ఆండ్రోజెన్ అనే హార్మోన్ స్థాయిని పెంచుతుంది. ఈ హార్మోన్ జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తీవ్రతరం చేస్తుంది.
ప్యాక్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్: చిప్స్, స్నాక్స్, పిజ్జా, బర్గర్లు వంటి జంక్ ఫుడ్స్‌లో తరచుగా అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వు ఉంటాయి. ఈ కొవ్వులు వాపుకు కారణమవుతాయి. జుట్టు మూలాలకు చేరకుండా నిరోధిస్తాయి. అవి వెంట్రుకలు బలహీనపడటానికి, విరిగిపోవడానికి కారణమవుతాయి.
అధిక ఉప్పు కలిగిన ఆహారాలు: జుట్టు రాలడాన్ని నివారించాలంటే కారంగా, ఉప్పగా ఉండే ఆహారాన్ని తినడం మానుకోవాలి. అధిక ఉప్పు శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. ఇది జుట్టును పొడిగా, పెళుసుగా చేస్తుంది. దీనివల్ల జుట్టు విరిగిపోతుంది.
ఆల్కహాల్: చాలామంది ఆల్కహాల్ తీసుకోకుండా ఉండలేరు. అయితే, ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు, ఇది జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల జుట్టు సులభంగా రాలిపోతుంది.
పాల ఉత్పత్తులు: కొన్ని పాల ఉత్పత్తులు, ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండేవి శరీరంలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. సెబమ్ అనేది జిడ్డుగల పదార్థం. ఇది అధికంగా ఉండటం వల్ల జుట్టు రంధ్రాలను మూసుకుపోతుంది. జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. జుట్టు రాలడానికి కారణమవుతుంది. జుట్టు రాలే సమస్యలు ఉంటే, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


