Global Winners ‘Plastic’ Becomes a Super Hit: పర్యావరణరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ద ఎర్త్ ప్రైజ్ 2026ను ఈ ఏడాది యువ భారతీయ త్రయం కైవసం చేసుకుంది. నీటిలోని మైక్రో ప్లాస్టిక్స్ ని తొలగించేలా చింతపండు పొడితో రూపొందించిన ప్లాస్-స్టిక్ ఆవిష్కరణకు గాను ఈ పురస్కారం ఆ ముగ్గురిని వరించింది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇటీవల పురస్కార ప్రదానం జరిగింది. ప్లాస్-స్టిక్ రూపకర్తలు అవ్యానా మెహతా, అరియానా అగర్వాల్, వివాన్ ఛావ్చారియా భారతదేశంలో ద ఎర్త్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి గ్లోబల్ విజేతలు. ఆ ముగ్గురు పదహారేళ్ల వయసు పిల్లలే కావడం ఆనందించతగ్గ అంశం.
13-19 మధ్య వయసు కలిగిన యువ విద్యార్థుల కోసం ప్రతీ ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఎర్త్ ప్రైజ్ పోటీని నిర్వహిస్తారు. అందులో పాల్గొనే అభ్యర్థులు తాము తయారుచేసిన పర్యావరణ పరికరాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఈ పోటీలో పాల్గొంటారు. ఆయా ఆవిష్కరణల్లో ఉత్తమ ప్రమాణాలను పరిశీలించి, మొదట ఏడుగురు ప్రాంతీయ విజేతలను ఎంపిక చేస్తారు. అనంతరం ఓటింగ్ ద్వారా వారిలోంచి తుది విజేతను ప్రకటిస్తారు. సదరు విజేతకు లక్ష డాలర్ల ప్రైజ్ మనీ అందజేస్తారు. ఇందులో కూడా పర్యావరణ చైతన్యం కలిగిన ప్రయోగాలకే అగ్ర ప్రాధాన్యం ఇస్తారు. ఈసారి ఏడు ఖండాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏడుగురు ప్రాంతీయ విజేతలనుండి ప్రపంచ విజేతను ఎన్నుకోవడానికి సుమారు 23,000 మంది ఓటింగ్ చేశారు. తొలుత ఆసియా ప్రాంతీయ విజేతగా ఎంపికైన అవ్యానా మెహతా, అరియానా అగర్వాల్, వివాన్ ఛావ్చారియా త్రయం తయారుచేసిన ప్లాస్-స్టిక్ అంతిమ ఫలితంలోనూ ప్రథమస్థానంలో నిలిచింది. మన దేశంలో సురక్షితమైన మంచినీరు అందించే మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామసీమల్లో చాలా మంది ప్లాస్టిక్ పాత్రల్లో నీళ్లే తాగుతున్నారు.
తద్వారా నీళ్లలో కలుస్తున్న మైక్రో ప్లాస్టిక్స్ వారి శరీరంలోకి చేరి అనేక అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుత విజేతలైన అవ్యానా మెహతా, అరియానా అగర్వాల్, వివాన్ ఛావ్చారియా బృందం ఒక గ్రామాన్ని సందర్శినప్పుడు.. చిన్నపిల్లలు ప్లాస్టిక్ పాత్రల్లో నీళ్లు తాగుతున్న దృశ్యాన్ని చూశారు. సరైన వడపోత యంత్రాలు సమకూర్చుకోలేని అలాంటి పేదల కోసం ఏదైనా ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలన్న ఉద్దేశంతో ప్రయోగాలు చేపట్టారు. చింతగింజల నుండి జీవవిచ్ఛిన్నమయ్యే పొడిని అభివృద్ధి చేశారు. ఆ పొడిని నీటిలో కలిపినప్పుడు అది మైక్రో ప్లాస్టిక్ కణాలను ఆకర్షించి, కంటికి కనిపించే ముద్దలుగా మారుస్తుంది. ఆ ముద్దలను చేతితో పట్టుకునే అయస్కాంతం ద్వారా తొలగించవచ్చు. ఇలా రూపొందించిన పరికరానికే వారు ప్లాస్- స్టిక్ అని పేరు పెట్టారు. దాని తయారీ సులభం. ఖర్చు స్వల్పం. వాడటానికి విద్యుత్ కూడా అవసరం లేదు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో వర్క్ షాపులు, ప్రదర్శనల ద్వారా ఎనిమిది వేల మందికి ప్లాస్- స్టిక్ వాడకం గురించి అవగాహన కల్పించారు. గ్లోబల్ విన్నర్ గా గుర్తింపు పొందిన అనంతరం అవ్యానా మెహతా, అరియానా అగర్వాల్, వివాన్ ఛావ్చారియా బృందం వికేంద్రీకృత ఉత్పత్తి కేంద్రాల ద్వారా ప్లాస్ -స్టిక్ పరికరాన్ని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. వారి ప్రయత్నం సఫలమైతే తేలిక పద్ధతిలో వడపోసిన తాగునీరు గ్రామీణ ప్రాంత ప్రజలకు లభిస్తుంది.

