GoPadFree for Women: మహిళలు నెలసరి సమయంలో శారీరక నొప్పితో పాటు మానసిక ఆందోళనతో సతమతమవుతుంటారు. ఇంటి పనులు, ఆఫీస్ వర్క్‌తో ఇబ్బందులు పడటమే కాకుండా హార్మోన్ల మార్పులతో వచ్చే చిరాకుతో ఆ మూడు రోజులు ప్రశాంతత అనేది ఉండదనేది వాస్తవం. ఇలాంటి బాధలను తన సోదరి అనుభవిస్తుండగా గమనించిన సోదరుడు ఆమె పరిస్థితి చూసి చలించిపోయాడు. ఆ బాధను దూరం చేసేందుకు వినూత్న ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫలించి.. ఇప్పుడు లక్షలాది మంది మహిళలకు ఉపశమనం కలిగించింది.
పీరియడ్స్ సమయంలో తన సోదరి పడే ఇబ్బందులను చూసి బెంగళూరుకు చెందిన కిరిటీ చలించిపోయారు. ఆ బాధను దూరం చేసేందుకు తన ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. స్నేహితులతో కలిసి వినూత్న ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ కావడంతో ఇప్పుడు లక్షలాది మంది మహిళలు ఊరట పొందుతున్నారు. ఆ ప్రయత్నమే ‘GoPadFree’ అనే పీరియడ్ ప్యాంటీలు.
కిరీటి ఆచార్జీ సోదరి పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. స్కూల్‌లో సరైన వాష్‌రూమ్‌లు లేకపోవడం, పీరియడ్స్ సమయంలో ఎక్కువసేపు ప్యాడ్‌ను అలాగే ఉంచుకోవడం వల్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్లతో బాధపడటాన్ని కిరీటి గమనించాడు. ఈ బాధను దూరం చేసేందుకు స్నేహితులతో కలిసి 2020లో ‘గోప్యాడ్‌ఫ్రీ’(GoPadFree)ని ప్రారంభించాడు. దీనిని ప్రారంభించడానికి ముందు 60 కి పైగా నమూనాలను పరిశోధించి అభివృద్ధి చేశారు.
Also Read: https://teluguprabha.net/health-fitness/foods-that-naturally-increase-hemoglobin-levels/
తన సోదరి కోసం తయారుచేసిన ఈ మెత్తని, సురక్షితమైన ప్యాంటీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. భారత్, UAEల్లోని 4 లక్షల మందికి పైగా మహిళలు వీటిని ఉపయోగిస్తున్నారు. సాధారణ శానిటరీ ప్యాడ్ కంటే ‘గోప్యాడ్‌ఫ్రీ’ని 5 నుంచి 6 రెట్లు ఎక్కువ గ్రహించేలా రూపొందించారు. వీటిని వినియోగించాలంటే ప్యాడ్లు, టాంపూన్లు, మెన్‌స్ట్రువల్ కప్‌లు అవసరం లేదు. 2 సంవత్సరాల వరకు వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఈ ఫాబ్రిక్ BIS-సర్టిఫైడ్, PFAS-రహితమైనదని కిరీటి చెబుతున్నారు. హానికరమైన రసాయనాలు వాడకుండా చర్మానికి ఎలాంటి ఇన్‌ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.

