Forensic Osteology Explained: పాడుబడిన భవనంలో బయటపడిన ఓ అస్థిపంజరం… భారీ అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన దేహాల మధ్య మిగిలిన కొన్ని ఎముకలు… ఇలాంటి దృశ్యాలు వార్తల్లో చూసినప్పుడు మనందరి మదిలో మెదిలే తొలి ప్రశ్న ఒక్కటే. అసలు ఆ ఎముకల గూడు ఎవరిది..? చనిపోయింది ఆడవారా..? మగవారా..? వారి వయసెంత..? కేవలం ఎముకలను చూసి ఇన్ని వివరాలు ఎలా చెప్పగలరు..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘ఫోరెన్సిక్ ఆస్టియాలజీ’ అనే అద్భుతమైన శాస్త్రం. నేర పరిశోధనలో అత్యంత కీలకమైన ఈ రంగంలోకి ఓసారి తొంగిచూసి, ఆ రహస్యాలను ఛేదించే విజ్ఞానాన్ని తెలుసుకుందాం…
ఎముకల వెనుక దాగున్న ఆనవాళ్లు:
హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేయడం, లేదా ఏళ్ల తరబడి మృతదేహం దొరక్కపోవడంతో అది అస్థిపంజరంగా మారడం వంటి క్లిష్టమైన కేసుల్లో, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగుతారు. చూడటానికి అన్నీ ఒకేలా కనిపించే ఎముకలను శాస్త్రీయ కోణంలో విశ్లేషించి, వారు అద్భుతమైన వివరాలను వెలికితీస్తారు.
లింగ నిర్ధారణ, మగ ఎముక, ఆడ ఎముక వేరు:
గుర్తుతెలియని అస్థిపంజరం దొరికినప్పుడు, అది స్త్రీదా, పురుషుడిదా అని తేల్చడానికి కొన్ని ఎముకల నిర్మాణం కీలకంగా వ్యవహరిస్తుంది.
ALSO READ: https://teluguprabha.net/lifestyle/if-you-use-this-fenugreek-hair-pack-long-hair-is-yours/
కటి ఎముక (Pelvic Bone):
లింగ నిర్ధారణలో ఇది అత్యంత నమ్మకమైన ఆధారం. వెన్నెముకను, తొడ ఎముకలను కలిపే ఈ భాగం, స్త్రీలలో ప్రసవానికి అనువుగా వెడల్పుగా, గుండ్రంగా ఉంటుంది. అదే పురుషులలో ఇరుకుగా, ‘V’ ఆకారంలో ఉంటుంది. ఈ తేడాను బట్టే నిపుణులు లింగాన్ని కచ్చితంగా గుర్తిస్తారు.
పుర్రె (Skull):
పురుషుల పుర్రె సాధారణంగా పెద్దదిగా, బరువుగా, దృఢంగా ఉంటుంది. వారి కనుబొమ్మల పైభాగం (brow ridge) ఎత్తుగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, స్త్రీల పుర్రె చిన్నదిగా, సున్నితంగా, నునుపైన ఉపరితలంతో ఉంటుంది.
తొడ ఎముక (Femur):
పురుషుల కండరాలు దృఢంగా ఉండటం వల్ల, వారి తొడ ఎముకలు కండరాలు అతుక్కునే చోట రఫ్‌గా, గరుకుగా మారతాయి. స్త్రీల ఎముకలు వాటితో పోలిస్తే నునుపుగా ఉంటాయి.
ALSO READ: https://teluguprabha.net/lifestyle/o-blood-group-love-failure-myth-or-reality/
వయసును కనిపెట్టేదెలా.. పుర్రె చెప్పే పక్కా లెక్క:
అస్థిపంజరం ఎవరిదో తెలిశాక, వారి వయసును అంచనా వేయడం మరో ముఖ్యమైన ఘట్టం. దీనికోసం కూడా కొన్ని శాస్త్రీయ పద్ధతులున్నాయి.
పుర్రె అతుకులు (Cranial Sutures):
శిశువు పుట్టినప్పుడు పుర్రె పలు భాగాలుగా ఉండి, వయసు పెరిగేకొద్దీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఈ అతుకులనే ‘సూచర్స్’ అంటారు. పసిపిల్లల నడినెత్తి మెత్తగా ఉండటానికి కారణం ఇదే. ఈ అతుకులు ఏ స్థాయిలో కలిసిపోయి ఉన్నాయో పరిశీలించడం ద్వారా ఫోరెన్సిక్ నిపుణులు వయసును అంచనా వేస్తారు. యుక్తవయసు దాటాక ఈ అతుకులు నెమ్మదిగా కనుమరుగవుతాయి.
దంతాలు (Forensic Odontology):
పళ్లు వయసు నిర్ధారణలో కీలకపాత్ర పోషిస్తాయి. జ్ఞానదంతం (wisdom tooth) వచ్చిందా, లేదా అనేదాన్ని బట్టి 18 ఏళ్ల లోపు వారా, పైబడిన వారా అని అంచనా వేస్తారు. పళ్ల అరుగుదల, వాటి నిర్మాణం కూడా వయసును సూచిస్తాయి.
అన్నీ దొరకనప్పుడు… డీఎన్ఏనే దిక్కు:
కొన్నిసార్లు పూర్తి అస్థిపంజరం లభించదు. కేవలం కొన్ని ఎముకల ముక్కలు మాత్రమే దొరుకుతాయి. అటువంటి అత్యంత క్లిష్టమైన సందర్భాల్లో, అంతిమ ఆయుధం డీఎన్ఏ పరీక్ష. లభించిన ఎముకల నుంచి డీఎన్ఏను సేకరించి, ప్రయోగశాలలో విశ్లేషిస్తారు. ఈ పరీక్ష ద్వారా లింగం, కొన్ని జన్యుపరమైన వివరాలు కచ్చితంగా తెలుస్తాయి. అనుమానిత మృతుడి బంధువుల నుంచి రక్త నమూనాలను సేకరించి, వాటి డీఎన్ఏతో పోల్చడం ద్వారా అస్థిపంజరం ఎవరిదో అధికారికంగా నిర్ధారిస్తారు. ఈ విధానం నేరస్తులను గుర్తించడంలో మరియు కేసులను ఛేదించడంలో పోలీసులకు తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తుంది.


