బీర్ (Beer) యువతకు చాలా ఇష్టమైన ఆల్కహాల్ డ్రింక్. ముఖ్యంగా వేసవి వస్తే బీర్ సేల్స్ అమాంతం పెరిగిపోతుంటాయి. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. ఇండియాలో ఎన్నో రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో 4% నుంచి 7% వరకు ఆల్కహాల్ ఉంటుంది. అయితే బీర్ అనేది లిమిట్‌గా తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటుంటారు. కానీ అతిగా తాగితే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే దీని వల్ల కలిగే లాభాలతో పాటు నష్టాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.
వారంలో ఎన్ని బీర్లు తాగితే సేఫ్: చాలా మంది బీర్లను ఉద్యమంలా తాగేస్తుంటారు. ఒకసారి సిట్టింగ్ వేశారంటే కేసు బీర్లు ఫసక్. అయితే ఇది తప్పు అంటున్నారు నిపుణులు. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) రిపోర్ట్ ప్రకారం.. ఒక వారంలో ఆడ మగ ఎవరైనా 14 యూనిట్లకు మించి బీర్లు తాగకూడదు. ఇక్కడ యూనిట్ అంటే 10 మిల్లీలీటర్లు లేదా 8 గ్రాముల ప్యూర్ ఆల్కహాల్. ఉదాహరణకు 568 మిల్లీలీటర్ల సాధారణ బీర్ క్యాన్‌లో 5% ఆల్కహాల్ ఉంటుంది. అందులో సుమారు 3 యూనిట్ల ఆల్కహాల్ ఉంటుంది.
అంటే ఒక వారంలో 6 రెగ్యులర్ బీర్ క్యాన్లు తాగితే 14 యూనిట్ల లిమిట్‌లో ఉంటారు. అంతకు మించి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే రెగ్యులర్‌గా తాగేవారు ప్రతి వారంలో కనీసం రెండు రోజులు బ్రేక్ ఇవ్వడం మంచిది. ఇలా చేస్తే ఆల్కహాల్ ఎఫెక్ట్ నుంచి రికవర్ అయ్యేందుకు శరీరానికి తగినంత సమయం లభిస్తుంది. బీర్‌లో ఉండే HDL లేదా మంచి కొలెస్ట్రాల్ గుండెకు మంచిది. ఇది ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. ఈ ఆల్కహాల్ డ్రింక్‌లో కొద్ది మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చుతాయి. ఫలితంగా, ఆస్టియోపోరోసిస్ వ్యాధి ముప్పు తగ్గుతుంది.
న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురించిన ఓ పరిశోధనలో బీర్‌లో పాలిఫినాల్స్ అనే పదార్థాలు ఉంటాయని తేలింది. పాలిఫినాల్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. మహిళలు రోజూ ఒక బీర్, పురుషులు రోజులో రెండు బీర్లు వరకు తాగితే గుండె జబ్బులు రావని ఆ పరిశోధన తెలిపింది. ఈ డ్రింక్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అతి అనర్థాలకు మూలం అంటారు. ఇది బీర్ విషయంలోనూ వర్తిస్తుంది. నిపుణులు చెప్పే లిమిట్ కంటే ఎక్కువ బీర్ తాగేస్తే కాలేయం, గుండెకు సంబంధించిన సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ బీర్ తాగితే శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, నోరు ఎండిపోవడం, నీరసం వంటి సమస్యలు వస్తాయి.
బీర్ తాగినప్పుడు మత్తు కారణంగా నిద్ర పడుతుంది. కానీ మత్తు దిగిన తర్వాత నిద్ర రాదు, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఫలితంగా శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు. బీర్ కూడా ఒక ఆల్కహాలే అని, లైట్ లేదా మోడరేట్‌గా మద్యం తాగినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అందుకే మద్యపానాన్ని పూర్తిగా మానేయడం మంచిది. ఆల్కహాల్ అలవాటైన వారు సేఫ్ లిమిట్స్‌కి మించి ఎప్పుడూ తాగకూడదు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)