Office Politics: మనిషి జీవితంలో ఎదుగుదల చోటు చేసుకున్న ప్రతిసారి చుట్టుపక్కల వారు దానిని గమనిస్తారు. ఒకరు కాస్త ముందుకు సాగితే, అతని చుట్టూ ఉన్నవారి దృష్టి వెంటనే అతనిపైనే కేంద్రీకృతమవుతుంది. ఆ దృష్టి ఎప్పుడూ సానుకూలంగా ఉండదు. చాలాసార్లు అది అసూయగా మారుతుంది. అలాంటి భావాలు బయటపడినప్పుడు వాతావరణం నెగటివ్‌గా మారుతుంది. కొంతమంది సహచరులు మన విజయాన్ని భరించలేక మనపై రకరకాలుగా స్పందించటం మొదలుపెడతారు. వారి ప్రవర్తనలో మార్పులు కనబడతాయి. కొన్ని సందర్భాల్లో మనకోసం చెడు జరగాలని కోరుకునే స్థితికి కూడా చేరతారు. ఇలాంటి పరిస్థితులు వర్క్ ప్లేస్‌లో తరచూ కనిపిస్తాయి.
అసూయ అనేది …
పని ప్రదేశంలో అసూయ అనేది కొత్త విషయం కాదు. ఎవరో ఒకరు పనిని వేగంగా పూర్తి చేస్తే లేదా నాణ్యతతో చేస్తే, ఇతరులు బయటకు మెచ్చుకున్నా లోపల మాత్రం ఆ వ్యక్తిపట్ల అసహనం పెరుగుతుంది. ఈ అసూయను సమర్థవంతంగా ఎదుర్కోవడం అంత తేలికైనది కాదు. అయితే కొంత చాకచక్యంగా వ్యవహరిస్తే, సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.
Also Read: https://teluguprabha.net/devotional-news/hidden-meaning-of-spider-under-durga-forehead-dot/
భావోద్వేగాలను ఎక్కువగా..
ఆఫీస్‌లో సాధారణంగా చేసే ఒక పొరపాటు ఏమిటంటే భావోద్వేగాలను ఎక్కువగా మిళితం చేయడం. చాలా మంది తమ సహచరులతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరుచుకుంటారు. అలా చేయడం వలన, పని కంటే బయట విషయాలపై ఎక్కువ దృష్టి పడుతుంది. ఫలితంగా మనసు అల్లకల్లోలమవుతుంది. వాస్తవానికి ఆఫీస్‌లో అవసరమయ్యేది ప్రొఫెషనల్ వైఖరి. పనిపైనే ఫోకస్ చేయడం మంచిది. ఎక్కువ ఎమోషనల్‌గా ఉండటం వలన అసూయతో వచ్చే మాటలు, చేష్టలు మనసుకు బలంగా తగులుతాయి. అలా మన ప్రశాంతత దెబ్బతింటుంది. అందువల్ల ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా అవసరం.
కొంత సమయం తీసుకోవడం…
అసూయతో మనపై వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే స్పందించడం కంటే కొంత సమయం తీసుకోవడం మంచిది. కోపంతో లేదా బాధతో వెంటనే రియాక్ట్ అయితే సమస్య మరింత పెద్దదవుతుంది. అదేవిధంగా, మన ప్రతిష్టకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో శాంతంగా వ్యవహరించడం సముచితం.
గాసిప్స్..
గాసిప్స్ అనేవి వర్క్ ప్లేస్‌లో తప్పనిసరి లాంటివి. మన ముందు వేరేలా, వెనుక వేరేలా మాట్లాడటం సాధారణమే. కానీ ఇలాంటి గాసిప్స్‌ను ఎలా హ్యాండిల్ చేస్తామనేది ముఖ్యమైన విషయం. వాటికి స్పందిస్తూ ఉంటే అవి మరింత పెరుగుతాయి. గాసిప్స్‌ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం ద్వారా మనం మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు. ఎవరైనా నెగటివ్‌గా మాట్లాడినప్పుడు వెంటనే కోపంతో రియాక్ట్ అవ్వడం బదులు, మన దృష్టిని పనిపైనే పెట్టుకోవడం ఉత్తమం. మనకి కోపం వచ్చినప్పుడు కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టడం మంచిది. దానివల్ల మనసు మారిపోతుంది, నెగటివిటీ తగ్గిపోతుంది.
పనిపైనే దృష్టి ..
ఎప్పటికప్పుడు మన వెనుక జరుగుతున్న మాటలను గమనించకుండా మన పనిపైనే దృష్టి పెట్టడం అవసరం. కొంతమంది సహచరులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మనమీద నిందలు వేస్తారు. ఇలాంటి వారిని పట్టించుకోకుండా మన పని చేయడమే సరైన దారి. సానుకూల దృక్పథం కలిగి ఉంటే, ఎలాంటి నెగటివ్ వాతావరణం ఉన్నా మనకు పెద్దగా ప్రభావం ఉండదు. సైకాలజీ చెబుతున్నట్టుగా నెగటివిటీకి ఉత్తమ సమాధానం విజయమే.
Also Read: https://teluguprabha.net/devotional-news/navratri-day-three-annapurna-devi-significance-explained/
అందరితో చనువుగా…
అందరితో చనువుగా ఉండడం అనేది కొన్ని సందర్భాల్లో మైనస్ అవుతుంది. సహచరులతో అవసరమైన పరిమితులు పెట్టుకోవాలి. ఎవరి దగ్గర ఏ విషయాలు షేర్ చేయాలి, ఏ విషయాలు చెప్పకూడదు అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. అలా లేని పక్షంలో అదే స్నేహం తర్వాత పెద్ద సమస్యగా మారుతుంది. పుకార్లు మనపై వ్యాప్తి చెందుతాయి. వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం వలన మన ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకే ఎంత క్లోజ్‌గా ఉన్నా, కొన్ని బౌండరీస్ పెట్టుకోవడం తప్పనిసరి. ఆత్మగౌరవం అన్నది పనిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ కాపాడుకోవలసిన ప్రధాన అంశం.
సీనియర్స్ సలహాలు..
కొన్నిసార్లు మనపై దాడి చేయాలని ప్రయత్నించే వారు ఉంటారు. వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి మన చేతిలో లేకపోతే సీనియర్స్ సలహాలు తీసుకోవాలి. సమస్యను ఎలా ఎదుర్కోవాలో వారితో చర్చించడం మంచిది. అయినా ఫలితం రాకపోతే చివరి స్థాయిలో హెచ్ ఆర్ సహాయం తీసుకోవాలి. సహాయం కోరడం బలహీనత కాదని గుర్తుంచుకోవాలి. అది పరిస్థితిని సక్రమంగా ఎదుర్కోవడానికి తీసుకునే తెలివైన నిర్ణయం.


