Wednesday, February 11, 2026
Homeలైఫ్ స్టైల్Banks: కొత్త సంవత్సరంలో బ్యాంకులు వారానికి 5 రోజులే!

Banks: కొత్త సంవత్సరంలో బ్యాంకులు వారానికి 5 రోజులే!

Five day banking week:భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద మార్పు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకు యూనియన్లు ఎన్నాళ్లుగా కోరుతున్న ఐదు రోజుల పని వారం ప్రతిపాదన ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 2026 నాటికి ఈ మార్పు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రంగం లోపలి వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఇచ్చిన సమాచారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

- Advertisement -

రెండో, నాల్గో శనివారాలు…

జులై 28, 2025న లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన సమర్పించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రతిపాదనలో అన్ని శనివారాలను అధికారిక సెలవులుగా ప్రకటించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న విధానంలో నెలలో రెండో, నాల్గో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవులు. మిగతా శనివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయి. అయితే, కొత్త ప్రతిపాదన అమలైతే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకులు తెరుచుకుంటాయి. ప్రతి శనివారం మరియు ఆదివారం పూర్తిగా హాలిడే అవుతుంది.

Also Read: https://teluguprabha.net/lifestyle/why-experts-warn-against-drinking-water-left-out-overnight/

ఈ ప్రతిపాదనకు ప్రధాన కారణం ఉద్యోగుల పని వాతావరణాన్ని మెరుగుపరచడం, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత సాధించడమనేది యూనియన్ల అభిప్రాయం. చాలా ఏళ్లుగా ఈ డిమాండ్‌ను ఉద్యోగుల సంఘాలు ప్రస్తావిస్తూ వస్తున్నారు. వారానికి ఐదు రోజులే పని చేయడం అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో సాధారణం కాగా, భారతదేశంలో ఇంకా ఆ అమలు పూర్తిగా జరగలేదు.

డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం..

అయితే పని దినాలు తగ్గితే కస్టమర్లు ఇబ్బందులు పడుతారా అన్న సందేహం కూడా కొందరిలో ఉంది. దానికి సమాధానంగా యూనియన్లు చెప్పింది ఏమిటంటే, సోమవారం నుండి శుక్రవారం వరకు ఉద్యోగులు దాదాపు నలభై నిమిషాలు అదనంగా పని చేసేలా షెడ్యూల్ మార్చవచ్చని. దీంతో పనితీరు ప్రభావితం కాకుండా, సేవలకు అంతరాయం లేకుండా వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పెరిగినందున, కౌంటర్ సేవలపై ఒత్తిడి కొంత తగ్గినదీ కారణంగా ఇది సాధ్యమని వారు భావిస్తున్నారు.

ఐదు రోజుల పని వారం..

ఇప్పటి పరిస్థితిలో బ్యాంకులు 2015లో ప్రవేశపెట్టిన పని నియమాల ప్రకారం పనిచేస్తున్నాయి. ఆ నిబంధనల ప్రకారం నెలలో కొన్ని శనివారాలు సెలవు, మిగిలిన శనివారాలు పని. అనేక బ్యాంకు ఉద్యోగులు ఈ వ్యవస్థ వల్ల అలసట పెరుగుతోందని, పని ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఐదు రోజుల పని వారం అవసరమని చెబుతున్నారు. దీంతో యూనియన్లు, అసోసియేషన్‌లు ఈ అంశాన్ని పునరావృతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నాయి.

సిబ్బంది కొరత వల్ల ఈ ప్రతిపాదన ఆగిపోయిందా అన్న ప్రశ్నకు కూడా మంత్రిత్వ శాఖ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 96 శాతం ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ అయ్యాయని, ఖాళీలు ఉన్నా అవి సాధారణంగా పదవీ విరమణ లేదా ఇతర అంతర్గత కారణాల వల్ల ఏర్పడినవేనని తెలిపింది. అందువల్ల సిబ్బంది కొరత ఈ మార్పుకు అడ్డంకి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారత రిజర్వు బ్యాంకు ఆమోదం..

ప్రతిపాదనను అమల్లోకి తీసుకురావడం కోసం ఇంకా పలు దశల్లో పరిశీలన అవసరం ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, భారత రిజర్వు బ్యాంకు ఆమోదం తప్పనిసరి. ఆమోద ప్రక్రియ పూర్తయితే, 2026లో ఏదో సమయంలో ఐదు రోజుల పని వారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు అమలయ్యే అవకాశం ఉందని రంగ నిపుణులు అంటున్నారు. అయితే ఈ సమయరేఖ గురించి ప్రభుత్వం ఇంకా స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని మాత్రమే తెలిపింది.

Also Read: https://teluguprabha.net/lifestyle/special-herbal-teas-with-mint-cloves-and-cumin-and-their-health-benefits/

బ్యాంకింగ్ కస్టమర్లకు..

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అన్ని వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఉద్యోగుల కోణంలో చూస్తే ఇది చాలా ఉపశమనం కలిగించే మార్పు. వారాంతంలో అదనంగా ఒక రోజు సెలవు ఉండడం వలన వారి కుటుంబ సమయం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో బ్యాంకింగ్ కస్టమర్లకు డిజిటల్ మార్గాలు ముఖ్య పరిష్కారంగా మారతాయి. మొబైల్ అప్లికేషన్లు, నెట్ బ్యాంకింగ్, UPI సేవలు ఇప్పటికే పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్నాయి. వీటి వాడకం మరింతగా పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News