Farming With Electric Scooter: పొలం దున్నాలంటే నాగలి, ఎద్దుల జత.. ఇది నిన్నటి మాట. కూలీలు, ఎద్దులు దొరక్క తలపట్టుకోవడం గతకాలపు వ్యధ. కర్ణాటకకు చెందిన ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించి, ఈ సమస్యలకు తన ఎలక్ట్రిక్ స్కూటర్‌తోనే చరమగీతం పాడాడు. రోజూ వాడే స్కూటర్‌కు చిన్న పరికరాన్ని జోడించి, పొలంలో కలుపు తీతను పండగలా మార్చేశాడు. అసలు, ఈ అద్భుతమైన ఆలోచన అతనికి ఎలా వచ్చింది..? ఈ విధానంతో సాగు ఖర్చులు ఎంతమేర తగ్గాయి..? ఈ ఆధునిక రైతు విజయగాథేంటి..?
సాంకేతికతను అందిపుచ్చుకుంటే వ్యవసాయం ఓ విజ్ఞాన ప్రదర్శనే అని నిరూపిస్తున్నాడు కర్ణాటకలోని బెళగావి జిల్లా, చిక్కోడి తాలూకా కబ్బూర్ పట్టణానికి చెందిన యువరైతు అజిత్ భీమప్ప నిడ్‌గుండి. పొలం పనులకు ఎద్దులు, కూలీల కొరత వేధిస్తున్న తరుణంలో, తన ఎలక్ట్రిక్ స్కూటర్‌నే ఓ వ్యవసాయ పనిముట్టుగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ALSO READ: https://teluguprabha.net/lifestyle/if-you-use-this-fenugreek-hair-pack-long-hair-is-yours/
అవసరమే సృష్టించిన అద్భుతం:
కబ్బూర్ పట్టణానికి సమీపంలో అజిత్‌కు సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 5 ఎకరాల్లో సోయాబీన్ పంటను సాగు చేస్తున్నాడు. పంట మడుల మధ్య కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో, వాటిని తొలగించడం పెద్ద సమస్యగా మారింది. కలుపు తీసేందుకు ఎద్దులను అద్దెకు అడిగినా సకాలంలో దొరకలేదు, వ్యవసాయ కూలీలదీ అదే పరిస్థితి.
ఈ సమస్యతో సతమతమవుతున్న అజిత్, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాడు. వారు అతని సమస్యను అర్థం చేసుకుని, ట్రాక్టర్‌కు అమర్చే హ్యారో (Harrow) కు బదులుగా ఓ చిన్న సైజు హ్యారోను అందించారు. సాధారణంగా, హ్యారోను ట్రాక్టర్‌కు బిగించి పొలాన్ని చదును చేస్తారు, కలుపు తీస్తారు. కానీ ట్రాక్టర్ అద్దె భారం. దీంతో అజిత్ ఆలోచనకు పదును పెట్టాడు.
స్కూటర్‌తో కలుపు తీత.. ఇలా సాధ్యమైంది:
అజిత్ వ్యవసాయ అధికారులు ఇచ్చిన చిన్న హ్యారోను తన ఎలక్ట్రిక్ స్కూటర్ వెనుక భాగంలో నేర్పుగా అమర్చి, ఆ వినూత్న పద్ధతిలో కలుపు తీశాడు. ఒక వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పొలంలోని మడుల మధ్య నిదానంగా నడుపుతుంటాడు. మరో వ్యక్తి, స్కూటర్ వెనుక ఉన్న హ్యారోను గట్టిగా పట్టుకుని, అది భూమిలోకి చొచ్చుకుపోయేలా బలాన్ని ప్రయోగిస్తూ ముందుకు నడుస్తాడు.
ALSO READ: https://teluguprabha.net/lifestyle/are-your-children-using-their-phones-too-much-at-night/
స్కూటర్ ముందుకు కదులుతున్న కొద్దీ, హ్యారో తన పదునైన పళ్లతో కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించివేస్తుంది. ఈ పద్ధతి ద్వారా అజిత్ ప్రతిరోజూ సుమారు 2 ఎకరాల్లో కలుపు తీత పనులను చకచకా పూర్తి చేస్తున్నాడు. ఎద్దులు, కూలీలతో ఇదే పని చేయిస్తే అయ్యే ఖర్చుతో పోలిస్తే, ఈ విధానంలో నామమాత్రపు కరెంట్ ఛార్జింగ్‌తోనే పని పూర్తవుతోంది. దీంతో సాగు ఖర్చులు భారీగా దిగొచ్చాయి. అజిత్ సృజనాత్మకతను చూసిన తోటి రైతులు ఆశ్చర్యపోతూ, అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
యువరైతు మాటల్లో:
“ఎద్దులు, కూలీలు సకాలంలో దొరక్కపోవడంతోనే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ పద్ధతిలో ఖర్చు చాలా తక్కువ. సాగు వ్యయం తగ్గితే, రైతుకు రాబడి దానంతట అదే పెరుగుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచిస్తేనే వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది,” అని యువ రైతు అజిత్ భీమప్ప నిడ్‌గుండి ‘ పేర్కొన్నారు.


