Currency Saving: “పిల్లలకు ఆటలు, చదువు ఉంటే చాలు.. డబ్బు విషయాలు వారికెందుకు?” అని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఆదాయం, ఖర్చులు, అప్పుల గురించి పిల్లల ముందు చర్చించడం వల్ల వారు ఒత్తిడికి గురవుతారని భయపడతారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలపై ప్రతికూల ప్రభావం పడకుండా, వారికి ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడం వల్ల వారు భవిష్యత్తులో క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారు.
నాలుగేళ్ల నుంచే పునాది: పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులనే అనుకరిస్తారు. మనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే.. వారు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే నాలుగేళ్ల వయసు నుంచే డబ్బు ప్రాధాన్యతను వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఏడెనిమిదేళ్ల వయసు వచ్చేసరికి వారు అనవసరమైన వస్తువుల కోసం మారాం చేయడం మానేస్తారు.
Also read-Billionaires: పేరుకే బిలియనీర్లు..కానీ, ఏం తింటున్నారో తెలుసా..?
అవసరం ఏదో గుర్తించేలా: అడిగిన ప్రతి వస్తువును కొనివ్వడం కంటే.. ఏది అవసరమో, ఏది కాదో పిల్లలకు వివరించాలి. “ఇప్పుడు ఈ అనవసరమైన వస్తువును కొనకుండా ఆ డబ్బు దాచుకుంటే.. భవిష్యత్తులో నీకు నచ్చిన మంచి సైకిల్ లేదా డ్రెస్ కొనుక్కోవచ్చు” అని మోటివేట్ చేయాలి. దీనివల్ల వారికి ఖర్చుల ప్రాధాన్యత (Priority) తెలుస్తుంది.
పిగ్గీ బ్యాంక్ .. ఒక అద్భుతమైన సాధనం: పిల్లలకు రంగురంగుల బొమ్మల ఆకారంలో ఉండే కిడ్డీ బ్యాంకులు (Piggy Banks) కొనివ్వడం వల్ల వారికి పొదుపుపై ఆసక్తి పెరుగుతుంది. చిరుతిళ్లు, చాక్లెట్లపై పెట్టే ఖర్చును తగ్గించి ఆ చిల్లరను అందులో వేయడం అలవాటు చేయాలి. నెలలు గడిచే కొద్దీ అందులో జమ అయ్యే డబ్బును చూసి వారు ఎంతో ఉత్సాహం పొందుతారు.
Also read-Lifestyle: కర్పూరం vs నాఫ్తలీన్ బాల్స్.. రెండిటిలో ఏది మంచిది!
తల్లిదండ్రులకు ఊరట: నిపుణుల అంచనా ప్రకారం పన్నెండేళ్ల లోపు పిల్లలు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఏడాదికి రూ. 10 వేల నుండి రూ. 40 వేల వరకు ఆదా చేసే అవకాశం ఉంటుంది. ఈ సొమ్ము స్కూల్ రీ-ఓపెనింగ్ సమయంలో ఫీజులకో, పుస్తకాలకో ఉపయోగపడుతుంది. ఇది తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, కుటుంబంలో ఒక భరోసాను నింపుతుంది. డబ్బును ఆదా చేయడం అంటే కేవలం దాచుకోవడం మాత్రమే కాదు.. ఒక క్రమశిక్షణను అలవర్చుకోవడం. చిన్నతనంలోనే ఆర్థిక పాఠాలు నేర్చుకున్న పిల్లలు.. పెద్దయ్యాక బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

