Kartika Masam- Marriage Muhurtham:
ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పండితులు చెబుతుంటారు. ఈ కాలంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, దీపోత్సవాలు, వ్రతాలు జరుగుతాయి. కార్తీక మాసం ముగిసే సమయానికే పెళ్లి సీజన్‌కి కూడా శ్రీకారం చుడుతుంది. గత కొన్ని నెలలుగా వివాహాలకు అనుకూలమైన మూహుర్తాలు లేవు కాబట్టి చాలామంది పెళ్లి తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ వేచి చూసే సమయం పూర్తయింది.
దేవ్ ఉత్థనీ ఏకాదశి..
దేవ్ ఉత్థనీ ఏకాదశి తర్వాతి రోజు ద్వాదశినాటికి తులసీ వివాహం జరగడం హిందూ ఆచారంలో ముఖ్యమైన సందర్భంగా పరిగణించబడుతుంది. ఈ రోజుతో దేవతలు “నిద్ర నుండి మేల్కొంటారని” నమ్మకం ఉంది. అందుకే తులసీ వివాహం తర్వాత నుంచే పెళ్లిళ్లు, శుభకార్యాలు ప్రారంభం అవుతాయి. పండితులు కూడా ఈ సమయంలో నుంచే శుభమూహూర్తాలు లభిస్తాయని చెబుతున్నారు.
నవంబర్, డిసెంబర్ నెలలు..
ఈ ఏడాది చివరి రెండు నెలలు. నవంబర్, డిసెంబర్ నెలలు పెళ్లిళ్లతో నిండిపోనున్నాయి. నవంబర్ నెలలో అనేక శుభతేదీలు ఉండటం వల్ల దేశవ్యాప్తంగా పెళ్లి వేడుకల సందడి కనిపిస్తోంది. పండితుల ప్రకారం నవంబర్ నెలలో 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 26, 27, 30 తేదీల్లో పెళ్లికి అనుకూలమైన మూహుర్తాలు ఉన్నాయి. ఈ తేదీల్లో ఎక్కువ మంది తమ పెళ్లి వేడుకలను ప్లాన్ చేసుకున్నారు.
డిసెంబర్ నెలలో..
డిసెంబర్ నెలలో కూడా అనేక శుభతేదీలు ఉన్నాయి. 1, 3, 4, 5, 6, 10, 11, 13 తేదీల్లో శుభమూహూర్తాలు ఉండటంతో మరింత మంది వివాహాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు నెలల్లోనే పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయని పండితులు చెబుతున్నారు.
ఇప్పటికే వివాహ సీజన్ ప్రారంభమవడంతో పెళ్లి ఏర్పాట్లలో అందరూ బిజీగా ఉన్నారు. క్యాటరింగ్ సర్వీసులు, బ్యాండ్ పార్టీలు, డెకరేషన్ టీమ్స్, ఫోటోగ్రాఫర్లు, పురోహితులు – అందరికీ పనులు గుంపుగా వచ్చాయి. వివాహాల సీజన్ కారణంగా కళ్యాణ మండపాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అనేక మండపాలు నవంబర్ చివరి వారం నుంచే పూర్తిగా బుక్ అయిపోయాయి.
ఇక రాబోయే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా పండితులు వివరించారు. డిసెంబర్ 12 తర్వాత నుంచి ఫిబ్రవరి 1 వరకు ముఖ్యమైన శుభమూహూర్తాలు లేవని వారు చెబుతున్నారు. అంటే డిసెంబర్ మధ్యలో మళ్లీ పెళ్లి బ్రేక్ పడనుంది. ఈ సమయంలో ధనుర్మాసం కూడా వస్తుంది. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ కాలంలో హిందూ సంప్రదాయం ప్రకారం శుభకార్యాలు చేయడం శ్రేయస్కరంగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజుల్లో వివాహాలు జరగవు.
ఫిబ్రవరి నెలలో తిరిగి..
ధనుర్మాసం ముగిసిన తర్వాత, ఫిబ్రవరి నెలలో తిరిగి శుభమూహూర్తాలు మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరోసారి పెళ్లి వేడుకలు జోరుగా కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.
పెళ్లి తేదీలలో కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం కూడా ఉంది. ఇది ప్రాంతానికీ, పంచాంగానికి అనుసరించి మారవచ్చు. వేర్వేరు పంచాంగాల్లో శుభతేదీలలో తేడాలు ఉండే కారణంగా ప్రజలు తమ కుటుంబ పురోహితులను సంప్రదించి సరైన తేదీని ఖరారు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చివరి నెలల్లో పెళ్లి సీజన్..
ఈ ఏడాది చివరి నెలల్లో పెళ్లి సీజన్ రావడంతో మార్కెట్ కూడా కదలికలోకి వచ్చింది. జ్యువెలరీ షాపులు, బట్టల షాపులు, మేకప్ సెంటర్లు, ఫోటో స్టూడియోలు, ట్రావెల్ ఏజెన్సీలు అన్నీ బిజీగా మారాయి. కొవిడ్ తర్వాత మళ్లీ పెళ్లి వేడుకలకు హాజరయ్యే అతిథుల సంఖ్య పెరిగింది. దీనివల్ల వివాహాలకు సంబంధించిన వ్యాపార రంగాలకు పెద్ద ఊతం లభించింది.
తులసీ వివాహం తర్వాత ప్రారంభమయ్యే ఈ సీజన్‌ను చాలా మంది శుభకార్యాలకు ఉపయోగించుకుంటారు. ఈ సమయాన్ని పండితులు సానుకూలంగా పరిగణిస్తారు. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వివాహాలు జరుపుకోవడానికి అత్యంత అనుకూలమైన కాలమని చెబుతున్నారు.


