Millionaire households in India: భారతదేశంలో సంపద పెరుగుదల గత కొన్ని సంవత్సరాల్లో వేగం అందుకుందని తాజా హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025లో వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 4.58 లక్షల మిలియనీర్ల కుటుంబాలు ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 8.71 లక్షలకు పెరిగింది. అంటే కేవలం నాలుగేళ్లలోనే 90 శాతం వృద్ధి నమోదైంది. మిలియనీర్ల కుటుంబాలు అంటే కనీసం రూ.8.5 కోట్ల నికర విలువ కలిగిన వారిని ఈ వర్గంలో లెక్కించారు.
అగ్రస్థానంలో..ముంబై…
నివేదికలో నగరాల వారీ వివరాలను కూడా అందించారు. అందులో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క ముంబై నగరంలోనే 1.42 లక్షల మిలియనీర్ల కుటుంబాలు ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో 68,200 కుటుంబాలు ఉండగా, ఐటి రంగం హబ్‌గా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో 31,600 కుటుంబాలు మిలియనీర్ కేటగిరీలోకి వచ్చాయి.
రాష్ట్రాల వారీగా గణాంకాలు పరిశీలిస్తే మహారాష్ట్ర అగ్రస్థానం దక్కించుకుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 1.78 లక్షల మిలియనీర్ల కుటుంబాలు ఉన్నట్టు హురున్ తెలిపింది. రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 55 శాతం వృద్ధి చోటు చేసుకోవడం ఈ పెరుగుదలకు పెద్ద కారణమని రిపోర్ట్ వివరించింది.
భారతదేశ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే పలు సూచీలను ఆధారంగా తీసుకుని ఈ అంచనాలు చేశారు. మెర్సిడెస్- బెంజ్ అమ్మకాల పెరుగుదల, కొత్త బిలియనీర్ల సంఖ్య, స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ ప్రదర్శన, జీడీపీ వృద్ధి – ఇవన్నీ కలిపి రూపొందించిన ఎంబీహెచ్‌ఎక్స్ ఇండెక్స్ దాదాపు 200 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత సంపద పెరుగుతున్న సంకేతంగా పరిగణిస్తున్నారు.
మిలియనీర్ల జీవనశైలి..
అంతేకాక, మిలియనీర్ల జీవనశైలి, ఖర్చు విధానం కూడా మారుతోందని రిపోర్ట్‌లో ప్రస్తావించారు. దేశంలోని సంపన్న వర్గంలో సుమారు 35 శాతం మంది డిజిటల్ లావాదేవీల కోసం యూపీఐ యాప్‌లను ఎక్కువగా వాడుతున్నారని హురున్ తెలిపింది. పెట్టుబడుల విషయంలో వారిలో ఎక్కువ మంది స్టాక్స్, రియల్ ఎస్టేట్, బంగారం రంగాలపై దృష్టి పెట్టారని నివేదిక పేర్కొంది.
లగ్జరీ బ్రాండ్ల ప్రభావం కూడా ఈ నివేదికలో ఆసక్తికరంగా బయటపడింది. రోలెక్స్, తనిష్క్, ఎమిరేట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి బ్రాండ్లు మిలియనీర్ల ప్రాధాన్యత పొందినవిగా గుర్తించబడ్డాయి. భారత సంపన్న వర్గంలో లగ్జరీ వస్తువుల వినియోగం పెరుగుతోందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు ప్రధాన పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ వ్యాఖ్యానించారు.
ఆర్థిక గణాంకాలు మాత్రమే..
మెర్సిడెస్- బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ అభిప్రాయం ప్రకారం, ఈ నివేదిక కేవలం ఆర్థిక గణాంకాలు మాత్రమే కాకుండా దేశంలోని సంపన్న వర్గాల ఆర్థిక శక్తిని, వారి జీవనశైలిలో వస్తున్న మార్పులను కూడా ప్రతిబింబిస్తోంది. లగ్జరీ వస్తువుల వినియోగం, పెట్టుబడుల మార్గాలు, డిజిటల్ చెల్లింపుల పెరుగుదల – ఇవన్నీ మిలియనీర్ల ఆర్థిక వ్యవహారాల్లో కొత్త ధోరణులుగా నిలుస్తున్నాయి.
ఈ నివేదికలో మరో ముఖ్యాంశం ఏమిటంటే, సంపద పెరుగుదల కేవలం కొన్ని వర్గాలకే పరిమితం కాలేదని సూచన. వివిధ రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆర్థికంగా ముందంజలో ఉన్న ప్రాంతాల్లో, మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి కారణంగా ఆ రాష్ట్రాల్లో పరిశ్రమలు, ఐటి రంగం, సేవా రంగాలు, రియల్ ఎస్టేట్ వృద్ధి ముఖ్య పాత్ర పోషించాయి.
మహారాష్ట్రలో మిలియనీర్ల సంఖ్య అత్యధికంగా ఉండటానికి ముంబై వంటి ఆర్థిక రాజధాని నగరం ఉనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముంబైలో ఫైనాన్స్, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, కార్పొరేట్ కార్యాలయాలు అధికంగా ఉండటంతో అక్కడ సంపద సృష్టి ఎక్కువగా జరుగుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీలో రాజకీయ, వ్యాపార రంగాల కలయిక సంపద పెరుగుదలకు తోడ్పడగా, బెంగళూరులో ఐటి పరిశ్రమ వృద్ధి మిలియనీర్ల సంఖ్యను పెంచింది.


