Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్‌ పెంచుతున్నారా..ఇలా చేశారంటే సంపదలన్ని మీవే!

Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్‌ పెంచుతున్నారా..ఇలా చేశారంటే సంపదలన్ని మీవే!

Money Plant Vs Vastu:ఇంటి చుట్టూ పచ్చని మొక్కలు ఉంటే ఆ ఇల్లు చూడటానికి అందంగా కనిపించడమే కాదు, మనసుకి ఒక శాంతి, సంతోషం కలిగిస్తాయి. పూలు, ఆకులతో నిండిన ఆ పచ్చదనం గాలిని శుభ్రంగా ఉంచుతుంది, ఇంట్లో ఉత్సాహాన్ని పెంచుతుంది. చాలా మంది తమ ఇళ్లలో, బాల్కనీలలో లేదా హాల్లో అలంకారంగా రకరకాల మొక్కలను పెంచుతారు. వాటికి నీరు పోయడం, ఎరువులు వేయడం, కత్తిరించడం వంటి పనులు చేస్తూ వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి శ్రద్ధ చూపుతారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన అంశాన్ని చాలా మంది పట్టించుకోరు. అది మొక్కను ఏ దిశలో ఉంచుతున్నామన్నది.

- Advertisement -

వాస్తు ప్రకారం ఇల్లు ఏ దిశలో ఉండాలి అన్నది ఎంత ముఖ్యమో, ఇంట్లో ఉంచే వస్తువులు, మొక్కలు కూడా సరైన దిశలో ఉండటం అంతే ముఖ్యం. మొక్క ఒకటి సరైన దిశలో లేకపోతే ఇంట్లో ప్రతికూల శక్తి చేరి, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పచ్చని మొక్కల అందం మాత్రమే కాకుండా, వాటి స్థానానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

శుక్ర గ్రహానికి ప్రతీకగా..

మనీ ప్లాంట్ అనేది నేటి ఇళ్లలో చాలా సాధారణంగా కనిపించే మొక్క. చాలా మంది దీనిని కేవలం అలంకారానికి మాత్రమే పెడతారు. కానీ, వాస్తు శాస్త్రం, జ్యోతిష్యంలో ఈ మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది శుక్ర గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. శుక్రుడు సౌందర్యం, ప్రేమ, ఐశ్వర్యానికి అధిపతి అని నమ్మకం. అందుకే మనీ ప్లాంట్‌ను సరైన పద్ధతిలో ఇంట్లో పెంచితే సంపద పెరుగుతుందని, డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని అంటారు. అదేవిధంగా, ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను తగ్గించి, సానుకూల వాతావరణాన్ని పెంచుతుందని విశ్వాసం ఉంది.

ఆర్థిక పరిస్థితి..

ఈ మొక్కను సరిగ్గా పెంచితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, అనవసర ఖర్చులు తగ్గి, పొదుపు పెరుగుతుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో అభివృద్ధి సాధించడానికి సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం, సామరస్యం పెరగడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. అలాగే వాస్తు లోపాలు తొలగి, ఇంట్లో శుభశక్తి పెరుగుతుందని చెబుతారు.

ఆగ్నేయం..

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌కు అత్యంత శ్రేష్ఠమైన దిశ ఆగ్నేయం. దీన్ని అగ్ని మూలం అని పిలుస్తారు. ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఆగ్నేయ దిశ శుక్రుడికి సంబంధించినది. ఇది లక్ష్మీదేవికి కూడా ప్రీతిపాత్రమైన దిశగా భావిస్తారు. కాబట్టి ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టడం వల్ల ఐశ్వర్యం, శాంతి, విజయాలు కలిసివస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఈశాన్య దిశలో..

అయితే ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ పెట్టకూడదు. ఈశాన్యం బృహస్పతికి సంబంధించినది. జ్యోతిష్యంలో శుక్రుడు, బృహస్పతి మధ్య శత్రుత్వం ఉందని చెబుతారు. ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే ఆర్థిక సమస్యలు, అప్పులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే యజమాని సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కష్టాలు ఎదుర్కోవచ్చు.

నైరుతి, పశ్చిమ దిశల్లో..

ఇక నైరుతి, పశ్చిమ దిశల్లో కూడా మనీ ప్లాంట్ పెట్టడం మంచిది కాదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దిశలు కెరీర్‌లో స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఆగిపోవడం, ప్రమోషన్ అవకాశాలు కోల్పోవడం, కొత్త అవకాశాలు రాకపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

Also  Read: https://teluguprabha.net/lifestyle/best-days-and-times-to-wash-clothes-as-per-vastu-rules/

మనీ ప్లాంట్‌ను వీలైనంత వరకు ఇంటి లోపలే పెంచడం మంచిది. ఇది ఇంట్లోని సానుకూల శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మొక్క తీగలు నేలపై పాకకుండా లేదా కిందకు వేలాడకుండా, ఎప్పుడూ పైకి ఎగబాకేలా ఏర్పాటు చేయాలి. పైకి పెరుగుతున్న తీగలు అభివృద్ధి, పురోగతికి సంకేతం. ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటనే తీసేయాలి. వాడిన ఆకులు ప్రతికూలతకు సూచన కావచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad