Mansoon Vs Health: వర్షాకాలం మనకు ఆనందం ఇచ్చే సీజన్ అయినా, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే కాలం కూడా ఇదే. వర్షాలు మొదలైన వెంటనే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, విరేచనాలు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు చాలా మందిని పట్టుకుని వదలవు. ముఖ్యంగా ఈ సీజన్‌లో వాతావరణ మార్పుల వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సహజ పానీయాలు, ముఖ్యంగా హెర్బల్ టీలు, శరీరానికి మంచి రక్షణ ఇస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అల్లం టీ..
అల్లం టీ గొంతు ఆరోగ్యానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటిబాక్టీరియల్, యాంటివైరల్ గుణాలు గొంతునొప్పిని తగ్గిస్తాయి. వాతావరణం మారినప్పుడు వచ్చే గొంతు ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా ఇది తగ్గిస్తుంది. పిప్పర్మెంట్ టీ ముక్కు దిబ్బడ, జలుబు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగితే శ్వాసకోశానికి ఉపశమనం లభిస్తుంది.
చమోమైల్ టీ
చమోమైల్ టీ దగ్గు తగ్గించడంలో ప్రభావవంతం. ఇది గొంతులో కలిగే గిరగిరలు, చికాకును తగ్గించి, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. రాత్రి తాగే చమోమైల్ టీ మంచి నిద్రకూ సహాయపడుతుంది. జ్వరం ఎక్కువగా వచ్చే మాన్‌సూన్‌లో ఎచినాషియా మొక్కతో చేసే టీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉన్న సహజ యాంటివైరల్, యాంటిబాక్టీరియల్ గుణాలు శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
కండరాల ఇన్‌ఫ్లమేషన్..
ఒళ్లు నొప్పులు, కండరాల ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలకు టర్మరిక్ టీ మంచి పరిష్కారం. పసుపులో ఉండే యాంటిఆక్సిడెంట్లు, యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు శరీర నొప్పులను తగ్గిస్తాయి. తలనొప్పి బాధ ఎక్కువగా ఉంటే గ్రీన్ టీ తాగడం మంచిది. ఇది పొలిఫెనాల్స్‌తో శరీరానికి హైడ్రేషన్ అందించి, బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
అలసట, జీర్ణ సమస్యలు..
అలసట, జీర్ణ సమస్యలు ఉన్నవారు తులసి టీ తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, శక్తి స్థాయులను పెంచుతుంది. ఛాతిలో బిగుసుకుపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి లికోరైస్ మూలికతో చేసిన టీ ప్రయోజనం కలిగిస్తుంది. ఇది శరీరంలోని మ్యూకస్‌ను తగ్గిస్తుంది.
ఇన్ఫెక్షన్లు…
వర్షాకాలంలో డైట్‌లో చేసే పొరపాట్లు కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ సీజన్‌లో చాలామంది స్ట్రీట్ ఫుడ్‌పై ఎక్కువగా ఆధారపడుతారు. సమోసా, పకోడీ, కచోరీల వంటి నూనెలో వేయించిన పదార్థాలు అపరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారయ్యే అవకాశం ఉంది. వీటిని తినడం వలన కడుపు సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
తగినంత నీటిని
వర్షాకాలంలో దాహం తక్కువగా అనిపించినా, తగినంత నీటిని తాగడం చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. అలాగే మజ్జిగ, పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలు ప్రతిరోజూ తీసుకోవాలి. ఇవి గట్ హెల్త్‌ను మెరుగుపరచి, డయేరియా, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి.
గట్ హెల్త్..
చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, డెజర్ట్స్ తరచూ తినడం గట్ హెల్త్‌ను దెబ్బతీస్తుంది. అందువల్ల మిఠాయిలను అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఆహారాన్ని నిర్దిష్ట సమయాల్లో తినడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
మాన్‌సూన్‌లో పండ్లు, కూరగాయలను బాగా కడిగి వాడాలి. కలుషిత ఆహారం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, గోరువెచ్చని ద్రవపదార్థాలు తీసుకోవడం శరీర రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
వాటర్‌ప్రూఫ్ షూస్ ..
ఈ సీజన్‌లో పాదాలను రక్షించుకోవడానికి వాటర్‌ప్రూఫ్ షూస్ ఉపయోగించడం మంచిది. శరీరానికి తగినంత కదలికలు ఇవ్వడానికి ఇండోర్ వ్యాయామాలు, యోగా, డాన్స్ వంటి కార్యకలాపాలను చేర్చుకోవాలి. ఆహారంలో పసుపు, మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క వంటి మసాలాలను మితంగా చేర్చడం ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/winter-health-risks-of-eating-amla-and-who-should-avoid-it/
సరైన టీలు, సమతుల్యమైన డైట్, పరిశుభ్రత, నియమితమైన జీవనశైలి ద్వారా వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన రోగనిరోధక శక్తి బలపడుతుంది.


