Nita Ambani Lifestyle: భారత దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తారు. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలు, వ్యాపార రంగంలో తీసుకునే నిర్ణయాలతో పాటు, వ్యక్తిగతంగా పాటించే ఫిట్‌నెస్ జీవనశైలి కూడా విశేషంగా గుర్తింపు పొందింది. 61 ఏళ్ల వయసులోనూ ఆమె ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించడం అనేక మహిళలకు స్ఫూర్తిగా మారింది.
నృత్యం అంటే..
నీతా అంబానీకి చిన్నప్పటి నుంచే నృత్యం అంటే ప్రత్యేకమైన అభిరుచి. భరతనాట్యం ఆమె జీవితంలో అంతర్భాగమైంది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నృత్యానికి సమయం కేటాయించడం ద్వారా ఆమె శారీరకంగా, మానసికంగా చురుకుదనం కొనసాగిస్తోంది. నృత్యం మాత్రమే కాకుండా యోగా, కార్డియో, ఈత వంటి విభిన్న వ్యాయామాలను కూడా తన దినచర్యలో కలుపుకుంటుంది. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త శారీరక వ్యాయామాన్ని ప్రయత్నించడం ద్వారా శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తుందనేది ఆమె విశ్వాసం.
తెల్లవారుజామున నిద్రలేచి…
ఉదయాన్ని శారీరక శ్రమతో ప్రారంభించడం నీతా అలవాటుగా మార్చుకున్నారు. తెల్లవారుజామున నిద్రలేచి సుమారు నలభై నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తారు. వ్యాయామం తర్వాత ఆమె తీసుకునే అల్పాహారం కూడా ఆరోగ్యకరమైనదే. డ్రై ఫ్రూట్స్, గుడ్డు, తాజా రసాలు లేదా గ్రీన్ టీని ప్రధానంగా తీసుకోవడం ఆమెకు సాధారణం. ఇవన్నీ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయని ఆమె నమ్మకం.
ఆహార విషయంలో..
ఆహార విషయంలో కూడా నీతా అంబానీ క్రమశిక్షణ పాటిస్తారు. ఆమె పూర్తిగా శాఖాహార విధానాన్ని అనుసరిస్తారు. కాలానుగుణ కూరగాయలు, ఆకుకూరలు, సూప్‌లు, పండ్లు ఆమె ఆహారంలో ముఖ్య స్థానాన్ని పొందాయి. మధ్యాహ్నం తేలికపాటి ఆహారం, సాయంత్రం పండ్లు, రాత్రి గుజరాతీ శైలిలో సరళమైన భోజనం తీసుకోవడం ఆమెకు అలవాటు. ముఖేష్ అంబానీతో కలిసి రాత్రి విందులో పప్పు, రోటీ ప్రధానంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి నీరు తాగడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. రోజంతా, ఆమె ఎక్కడికి వెళ్లిన సరే తనతో పాటు నీళ్ల బాటిల్ ఉండటం ఆమె సహజమైన అలవాటు.
ఫిట్‌నెస్ విషయంలో…
ఫిట్‌నెస్ విషయంలో నీతా అంబానీ తన కుటుంబానికి కూడా ప్రేరణగా నిలిచారు. తన కుమారుడు అనంత్ అంబానీ బరువు తగ్గే ప్రక్రియలో ఆమె ఇచ్చిన ప్రోత్సాహం గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావన వచ్చింది. ఈ ప్రయాణంలో ఆమె స్వయంగా కూడా సుమారు 18 కిలోలు బరువు తగ్గడం గమనార్హం.
మహిళలకు ప్రేరణ…
ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో నీతా అంబానీ మహిళలకు ప్రేరణ కలిగించే సందేశాన్ని అందించారు. 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రతి దశాబ్దంలో మహిళలు మూడు నుంచి ఎనిమిది శాతం కండరాల ద్రవ్యరాశిని కోల్పోతారని, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇది మరింత వేగంగా జరుగుతుందని ఆమె గుర్తు చేశారు. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఫిట్‌గా ఉండాలని సూచించారు.
నీతా అంబానీ అభిప్రాయం ప్రకారం వయస్సుతో పోరాడటం కాదు, దానిని సానుకూలంగా స్వీకరించడం ముఖ్యమని చెబుతున్నారు. తాను 61 ఏళ్ల వయస్సులోనూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలిగితే మరెవరైనా చేయగలరని ఆమె చెప్పారు. ఇది కేవలం శారీరక అందం గురించే కాదు, మనసు ప్రశాంతంగా, శక్తివంతంగా ఉండడానికీ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read: https://teluguprabha.net/lifestyle/parenting-guide-to-understand-children-better/
వ్యాయామం శరీరానికి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నీతా ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యాయామం చేసినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్‌లు ఒత్తిడిని తగ్గించి మనసుకు సాంత్వన ఇస్తాయని ఆమె వివరిస్తున్నారు. దీనివల్ల రోజంతా సానుకూల శక్తి లభిస్తుందని చెబుతున్నారు. ఇది కేవలం జిమ్‌లో బరువులు ఎత్తడం గురించే కాదని, పిల్లలు, మనవరాళ్లతో సంతోషంగా గడిపేందుకు కావలసిన శక్తిని సొంతం చేసుకోవడం కోసమని నీతా అంబానీ భావిస్తున్నారు.


