తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ ఎండలకు ఇళ్లలో ఏసీలు, కూలర్లు లేకుండా ఉండటం కష్టంగా మారింది. చాలా మంది కొత్త ఏసీలు కొంటుంటే, మరికొంతమంది పాత ఏసీలను తిరిగి ఆన్ చేస్తున్నారు.
అయితే నెలల తరబడి పనిచేయని ఏసీలను మళ్ళీ ఆన్ చేసే ముందు జాగ్రత్త అవసరం. ఎందుకంటే పాత ఏసీల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ సంఘటనే దీనికి ఉదాహరణ. ఢిల్లీలోని కృష్ణ నగర్‌లో ఒక ఏసీ రిపేరింగ్ షాపులో పాత ఏసీని ఆన్ చేయగానే అది పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఏసీలు పేలడానికి సరైన నిర్వహణ లేకపోవడం, విద్యుత్ లోపాలు కూడా కారణం కావచ్చు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ముందుగా ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసుకోవాలి. తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏసీ పేలుళ్లకు కారణాలు:
కంప్రెసర్ వేడెక్కడం: ఏసీలో కంప్రెసర్ ప్రధానమైన భాగం. సరిగ్గా సర్వీసింగ్ చేయకపోతే అది వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.
షార్ట్ సర్క్యూట్: విద్యుత్ లోపాలు, వైరింగ్ సరిగా లేకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏసీ పేలే అవకాశం ఉంది.
వోల్టేజ్ హెచ్చుతగ్గులు: హఠాత్తుగా వోల్టేజ్ పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా ఏసీలోని భాగాలు దెబ్బతిని పేలుడు సంభవించవచ్చు.
గ్యాస్ లీకేజ్: కంప్రెసర్‌లోని గ్యాస్ లీక్ అయితే కూడా ప్రమాదం పొంచి ఉంటుంది.
ఎయిర్ ఫిల్టర్లు మూసుకుపోవడం: ఏసీలోని ఫిల్టర్లు దుమ్ముతో నిండిపోతే కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి పేలుడు సంభవించవచ్చు.
ఏసీ వాడే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి:
పాత ఏసీ అయితే తప్పనిసరిగా మెకానిక్‌తో చెక్ చేయించుకుని, సర్వీసింగ్ చేయించుకోండి.
ఏసీ చుట్టూ గాలి సరిగ్గా తగిలేలా చూసుకోండి.
గ్యాస్ లీకేజ్ ఉందేమో చెక్ చేయించుకోండి.
ఏసీలో ఏవైనా ఇతర సమస్యలు ఉంటే సరిచేయించుకోండి.
వోల్టేజ్ స్టెబిలైజర్‌ని ఉపయోగించండి.
ఎయిర్ ఫిల్టర్లను తరచూ శుభ్రం చేయండి.