Indian food packaging colour codes explained : మనం రోజూ కొనే బిస్కెట్ ప్యాకెట్ నుంచి చిప్స్ ప్యాకెట్ వరకు ప్రతి దానిపైనా ఓ చిన్న రంగు గుర్తు ఉండటం గమనించారా? చాలామందికి తెలిసింది కేవలం రెండే రెండు రంగులు.. ఆకుపచ్చ, ఎరుపు. ఆకుపచ్చ ఉంటే శాకాహారం, ఎరుపు ఉంటే మాంసాహారం అని సరిపెట్టుకుంటాం. కానీ, అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ రెండు రంగులే కాకుండా మరో మూడు రంగులు కూడా మన ఆహార ప్యాకెట్లపై దర్శనమిస్తాయి. ఒక్కో రంగు మన ఆరోగ్యానికి ఓ కీలకమైన సందేశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా, ఓ ప్యాకెట్ మీద నల్ల రంగు గుర్తు ఉందంటే, దానికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏమిటా రంగుల రహస్యం..? ఏ రంగు దేనికి సంకేతం..? ఆ నల్ల గుర్తు అంత ప్రమాదకరమా..?
రంగుల వెనకున్న అర్థాలు.. ఆరోగ్య సూచికలు : భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార ప్యాకేజీలపై ఈ రంగుల కోడింగ్‌ను నిర్దేశించింది. ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. అవేంటో వివరంగా చూద్దాం.
ఆకుపచ్చ గుర్తు (Green Dot): ఈ గుర్తు అందరికీ సుపరిచితమే. ప్యాకెట్‌పై ఈ గుర్తు ఉంటే, ఆ ఉత్పత్తి పూర్తిగా శాఖాహారమని (Vegetarian) అర్థం. ఇందులో ఎలాంటి మాంసం, చేపలు వంటివి లేవని ఇది స్పష్టం చేస్తుంది.
ఎరుపు గుర్తు (Red Dot): ఈ గుర్తు ఉన్న ఆహార పదార్థంలో మాంసం లేదా దాని ఉత్పత్తులు ఉన్నాయని సూచిస్తుంది. ఇది మాంసాహార (Non-Vegetarian) ఉత్పత్తి అని తెలియజేస్తుంది. శాకాహారులు దీనిని సులభంగా గుర్తించి దూరంగా ఉండవచ్చు.
పసుపు గుర్తు (Yellow Dot): చాలామంది శాకాహారులు గుడ్లను కూడా తినరు. అటువంటి వారి కోసం ఈ గుర్తును ప్రవేశపెట్టారు. ఒక ఉత్పత్తిలో గుడ్లను ఒక పదార్థంగా ఉపయోగించినట్లయితే, ఆ ప్యాకెట్ పై ఆకుపచ్చ లేదా ఎరుపు బదులుగా పసుపు రంగు గుర్తు ఉంటుంది. ఇది ఆ ఉత్పత్తిలో గుడ్డు ఉందని (Contains Egg) ప్రత్యేకంగా సూచిస్తుంది.
నీలం గుర్తు (Blue Dot): ఈ గుర్తు సాధారణంగా ఆహార పదార్థాలపై కనిపించదు. ఒకవేళ ఏదైనా ఆహార ఉత్పత్తి ప్యాకెట్‌పై నీలం రంగు గుర్తు ఉంటే, అది మధుమేహం (డయాబెటిస్) లేదా అధిక రక్తపోటు ఉన్న వారి వంటి ప్రత్యేక వైద్య అవసరాలు ఉన్న వారి కోసం తయారు చేయబడిన ఆహారమని అర్థం. దీనిని “ఫుడ్ ఫర్ స్పెషల్ డైటరీ యూజ్” (Food for Special Dietary Use) అంటారు. వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవడం ఉత్తమం.
అసలు డేంజర్.. ఈ నల్ల గుర్తు! (Black Mark) : పైన చెప్పినవన్నీ ఒక ఎత్తైతే, ఈ నల్ల గుర్తు మరో ఎత్తు. FSSAI ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం, ప్యాకేజీ ముందు భాగంలో ‘హెచ్చరిక లేబుల్’ (Warning Label) ఉంటుంది. ఈ ముద్ర ప్రజలకు ఆయా ఉత్పత్తులలో చక్కెర, ఉప్పు లేదా కొవ్వుల స్థాయిల గురించి స్పష్టమైన సూచనను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేసుకోవడానికి వీలవుతుందని FSSAI భావిస్తోంది. దీనినే ‘ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ లేబులింగ్’ (Front-of-Pack Labelling) విధానం అంటారు.
నల్ల గుర్తు ఎందుకు ప్రమాదకరం : ఈ గుర్తు ఉన్న ఆహార పదార్థాలను “ఫుడ్స్ హై ఇన్ ఫ్యాట్, షుగర్ & సాల్ట్” (HFSS) గా వర్గీకరిస్తారు.


