Telugu moral story apps for kids : ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో.. ఏ కాస్త సమయం దొరికినా నేటి చిన్నారుల కళ్లు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల కోసమే వెతుకుతున్నాయి. పసిపిల్లలకు అన్నం తినిపించాలన్నా, ఏడుపు మాన్పించాలన్నా తల్లిదండ్రులకు తక్షణమే ఆశ్రయమిచ్చేది ఆ డిజిటల్ తెరలే. కానీ, ఆ స్క్రీన్‌పై వారి లేత వేళ్లు ఏం వెతుకుతున్నాయి? కళ్లు చెదిరే సోషల్ మీడియా రీల్స్, అర్థంపర్థం లేని యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ బంగారు సమయాన్ని వృథా చేస్తున్నారా? ఇదంతా చూసి రేపు మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులుగా మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే, కంగారు పడకండి!
డిజిటల్ గ్యాడ్జెట్స్‌ను పిల్లల నుంచి పూర్తిగా దూరం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం. కాబట్టి, వాటి వినియోగాన్ని సానుకూల దిశగా మళ్లించడమే స్మార్ట్ పేరెంటింగ్. పిల్లలు చూసే చెత్త కంటెంట్‌ను తొలగించి, విజ్ఞానాన్ని, వినోదాన్ని, విలువలను పంచే యాప్స్‌ను వారి ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయడం ద్వారా అద్భుత ఫలితాలు రాబట్టవచ్చు. అలాంటి కొన్ని ప్రముఖ యాప్స్ ఇవే..
తెలుగు స్టోరీస్ – నీతి భక్తి : ఇది కేవలం కథల యాప్ కాదు.. ఆధ్యాత్మిక, నైతిక విలువల సముదాయం. పురాణాల పట్ల ఆసక్తిని పెంచేలా మహావిష్ణువు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవుళ్ల కథలు ఇందులో ఉన్నాయి. మరోవైపు లోకజ్ఞానాన్ని పెంచే నైతిక కథల విభాగంలో.. ఆలీబాబా నలభై దొంగలు, సింధూబాద్ వంటి సాహసగాథలు, ‘అతి ఆశ-అపాయం’, ‘మధ్యవర్తి-మోసం’, ‘మిత్రుల హితవు మంచి’ లాంటి బుద్ధి వికసించే కథల సమాహారం ఈ యాప్.
తెలుగు కథలు : ఒకప్పుడు నానమ్మ, అమ్మమ్మ చెప్పే ‘అమ్మ చెప్పే కమ్మని కథలు’ ఇప్పుడు ఈ యాప్ రూపంలో దొరుకుతున్నాయి. ఆలోచనలకు పదునుపెడుతూనే కడుపుబ్బా నవ్వించే పరమానందయ్య శిష్యుల కథలు, సమయస్ఫూర్తిని నేర్పే తెనాలి రామకృష్ణ కథలు, జీవిత సత్యాలను తేటతెలుగులో బోధించే పేదరాశి పెద్దమ్మ కథలను ఇందులో పొందుపరిచారు. ఏకంగా 21 విభాగాలతో రూపొందిన ఈ యాప్‌లో.. మంచి అలవాట్లు, సామెతలు, పద్యాలు, సరదాగా సాగే పొడుపు కథలు, చిలిపి ప్రశ్నలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
చందమామ కథలు : మూడు దశాబ్దాల క్రితం పిల్లల ప్రపంచాన్ని ఏలిన మాసపత్రిక ‘చందమామ’. నెల తిరగ్గానే పట్టువదలని విక్రమార్కుడు, భేతాళుడి కథల కోసం ఎదురుచూసిన ఆనాటి బాల్యం ఎంతో మధురమైనది. ఇప్పుడు ఆ ముద్రిత పుస్తకాలు కనుమరుగైనా, ‘చందమామ తెలుగు’ యాప్ ఆ లోటును భర్తీ చేస్తోంది. 1947 నుంచి 2009 వరకు వెలువడిన ఎన్నో అమూల్యమైన చందమామ సంచికలను ఇందులో డిజిటలైజ్ చేశారు. స్వచ్ఛమైన తెలుగు పదజాలం, అద్భుతమైన బొమ్మలతో సాగే ఈ కథలు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి.
తెలుగు శతకాలు : బాల్యం నుంచే క్రమశిక్షణ, సేవాభావం నూరిపోయడంలో శతకాల పాత్ర అమోఘం. ‘వేమన శతకం’, ‘సుమతీ శతకం’, ‘భాస్కర శతకం’, ‘కుమార శతకం’ వంటి ఆణిముత్యాలన్నింటినీ ఒకేచోట అందిస్తోంది ఈ యాప్. వీటితో పాటు భర్తృహరి సుభాషితాలు, శ్రీమద్భాగవతం పద్యాలు కూడా పిల్లల్లో మానసిక పరిపక్వతను తీసుకువస్తాయి.
మరికొన్ని ప్రత్యామ్నాయాలు: వీటితో పాటు మహాభారతం, రామాయణం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలు, జంతువుల పాత్రలతో నీతిని ప్రబోధించే ‘పంచతంత్ర స్టోరీస్’ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ అనేది కత్తి లాంటిది. దాన్ని కూరగాయలు కోయడానికి వాడాలా? చేతులు కోసుకోవడానికి వాడాలా? అనేది మన చేతుల్లోనే ఉంది. పనికిమాలిన రీల్స్ చూసి పిల్లలు సమయం వృథా చేసుకోకుండా, పైన పేర్కొన్న యాప్స్‌ను వారి ఫోన్లు, ట్యాబ్‌లలో డౌన్‌లోడ్ చేసి ఇవ్వండి. మీరూ వారితో కూర్చుని కథలు వినండి, చర్చించండి. అప్పుడే వారు నైతికంగా, మానసికంగా బలమైన ప్రయోజకులుగా ఎదుగుతారు.

