Phone Effects On Children Health: ఈ డిజిటల్ యుగంలో, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు పిల్లల జీవితంలో ఒక భాగంగా మారాయి అని చెప్పవచ్చు. గేమ్స్, కార్టూన్‌లు, లేదా సోషల్ మీడియా ద్వారా పిల్లలు గంటల తరబడి ఫోన్‌లలో గడుపుతున్నారు. అయితే, ఈ అలవాటు వారి ఆరోగ్యం, మెంటల్ హెల్త్, అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పిల్లలు ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రభావాలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకటి నుండి మూడు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలను వినడం ద్వారా భాషను నేర్చుకుంటారు. ఈ సమయంలో పిల్లలలో భాష బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే, ఎక్కువ ఫోన్ ఉపయోగం వల్ల భాషా నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యాల అభివృద్ధి ఆలస్యం కావచ్చు. అంతేకాదు, ఈ తరం పిల్లలు తమ వయస్సు పిల్లలతో గడిపే సమయం కూడా తగ్గుతుంది. పిల్లలు తరచుగా ఫోన్లు, టీవీలు చూస్తే దేనైనా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు. ఏ సందర్భంలోనైనా పిల్లలు వినే పదాలను ఎలా మాట్లాడాలో అర్థం చేసుకోలేరు. ఎక్కువ సమయం ఫోన్ వాడటం వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. ముందుకు వారి విద్యా పనితీరును ప్రభావితం చేస్తుంది.
ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల చుట్టుపక్కల వారితో మాట్లాడుతూ మాటలు నేర్చుకోవడానికి దూరమవుతారు. కావున 2-5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు 1 గంట ఫోన్ స్క్రీన్ టైమ్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. మూడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా ఎదిగేటువంటి ప్రత్యేకమైన స్థితిలో ఉండాలి. పిల్లలను బయట ఆటలు, చదువు, లేదా సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. సమాజంలో అందరినీ పరిశీలిస్తూ ఉంటె ఇతరుల మాటలు, భాషను వినడం వల్ల సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఫోన్లు, టాబ్లెట్లు, టీవీకి బానిసలైతే అలాంటి అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించడానికి ప్రయత్నించాలి. పిల్లలను శారీరక, మానసిక అభివృద్ధిని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన కార్యకలాపాలలో పాల్గొనటానికి ప్రోత్సహించాలి. ఇలా చేయడం ద్వారా పిల్లల ఆరోగ్యం దృఢంగా ఉంటుంది.


