Premanand on Marriages: ఇప్పటి కాలంలో వైవాహిక బంధాలు చిన్నపాటి కారణాలకే పెటాకులు అవుతున్నాయి. సాధారణ తగాదాలు, పరస్పర అపనమ్మకాలు, స్వేచ్ఛ పేరుతో జరిగే తప్పులు.. ఇవన్నీ పెళ్లి అనే పవిత్ర బంధాన్ని నమ్మదగిన బంధం కాకుండా చేస్తున్నాయి చేస్తున్నాయి. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా శాశ్వతంగా కలిసుండాలన్న అభిలాష నేటి సమాజంలో క్రమంగా క్షీణిస్తోంది. ఈ సామాజిక మార్పులపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నిర్వహించిన సత్సంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వైవాహిక జీవితంలో నిలకడ లేకపోవడానికి ప్రధాన కారణం, దాని వెనుక ఉన్న అసలైన నిజాలు తదితర విషయాల గురించి మాట్లాడారు. అందులో వివాహ బంధం విచ్చిన్నం అవడానికి ముఖ్య కారణం వ్యక్తిత్వ నిబద్ధత లోపించడమేనని అభిప్రాయపడ్డారు.
నేటి తరానికి ఎన్నో ఆకర్షణలు, విభిన్న అనుభవాలు లభించగల వాతావరణం అందుబాటులో ఉంది. వివాహానికి ముందే ఎన్నో సంబంధాల్లో ఉండే యువతీ యువకులు, ఒక్క జీవిత భాగస్వామితో మాత్రమే సంతృప్తిగా జీవించలేకపోతున్నారని మహారాజ్ వివరించారు. మానసిక స్థిరత్వం లేకుండా అనేక వ్యక్తుల్లో ఆనందాన్ని వెతకడం వల్ల, బంధాలకు విలువ తగ్గిపోతోందన్నారు. ఒకప్పుడు భారతీయ సాంస్కృతిక వ్యవస్థలో భార్యాభర్తల మధ్య పవిత్రతకు అత్యున్నత స్థానం ఉండేది. “భర్తే పరమేశ్వరుడు” అనే భావనతో జీవితాన్ని గడిపే సంస్కారం నేడు కనిపించడంలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తు వైవాహిక జీవితం ధృఢంగా ఉండాలంటే, వివాహానికి ముందు జీవితంలోని పరిశుద్ధతను కాపాడటమే అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం విస్తరిస్తున్న “డేటింగ్” సంస్కృతిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ తాత్కాలిక బంధాలు మనసు కంటే శరీరానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇది కుటుంబ వ్యవస్థనే బలహీనపరుస్తోందని హెచ్చరించారు. ‘‘ఉపయోగించి వదిలేసే’’ సంబంధాలు వ్యక్తుల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.
పరిష్కారం ఇదే..
ఇతరుల మీద నిందలు వేయడంకంటే, వ్యక్తిగత ఆత్మ పరిశీలన అవసరమని ప్రేమానంద్ మహారాజ్ సూచించారు. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ, పెళ్లి తరువాత సంబంధాన్ని నిలబెట్టే బాధ్యత ఇద్దరిమీదా ఉందన్నారు. నమ్మకంతో, నిబద్ధతతో జీవిస్తే బంధాలు పటిష్ఠంగా ఉంటాయని ఆయన నొక్కి చెప్పారు. వైవాహిక జీవితం కేవలం ఆకర్షణ లేదా ప్రేమతో సాగేది కాదని, బలమైన వ్యక్తిత్వం, నమ్మకం, ఆధ్యాత్మికత వంటి మూలస్ధంభాల మీద ఆధారపడి ఉంటుందని వివరించారు.