Print Maximalism: ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తగా వచ్చిన ట్రెండ్‌లో ‘ప్రింట్ మ్యాక్సింగ్’ ఒకటి. ప్రస్తుతం ఒకే విధమైన డిజైన్ లేదా సింపుల్ ప్రింట్స్‌తో ఉండే దుస్తులు ఫేడ్ అవుట్ అవుతున్న నేపథ్యంలో గజిబిజిగా అనిపించేలా అనేక ప్రింట్ల కలబోతతో తయారయ్యే ఈ స్టైల్ యువతను బాగా ఆకట్టుకుంటోంది. స్ట్రైప్స్, ఫ్లోరల్స్, చెక్స్, పోల్కా డాట్స్ వంటి విభిన్న ప్రింట్లను ఒకే దుస్తుల్లో కలిపి రూపొందించడం దీని ప్రత్యేకత.
సాధారణంగా ఇవి కలిపితే అస్తవ్యస్తంగా కనిపిస్తాయని అనిపించినా, సరిగ్గా మిక్స్ చేస్తే ఇది చాలా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మారుతుంది. ఈ లౌడ్ ఫ్యాషన్ స్టైల్‌లో రంగులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ వంటి బ్రైట్ కలర్స్ కలగలిపి వేసుకునే ఈ డిజూన్స్‌కి ప్రతి ఒక్కరు ఆకర్షితులవ్వాల్సిందే. దీంతో ఈ ట్రెండ్‌ను ‘డోపమైన్ డ్రెస్సింగ్’ అని కూడా పిలుస్తున్నారు. అంటే.. మనసుకు ఆనందం కలిగించేలా మూడ్‌ను వెంటనే మార్చేలా ఉండే దుస్తులు అన్నమాట.
ఈ తరహా డ్రెస్సింగ్‌తో మనలో ఉత్సాహం పెరుగుతుందని రోజంతా ఫ్రెష్‌గా ఫీల్ అవుతామని యువత చెబుతోంది. సోషల్ మీడియా ప్రభావంతో ప్రింట్ మ్యాక్సింగ్ మరింత పాపులర్ అయింది. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఈ స్టైల్‌ను ప్రోత్సహించడం వల్ల ఇది వేగంగా ట్రెండ్ అవుతోంది. క్యాజువల్ అవుటింగ్స్ నుంచి పార్టీ వేర్ వరకు ఈ స్టైల్‌ను ఎంచుకుంటున్నారు. మొత్తానికి, సింపుల్ స్టైల్స్‌కు భిన్నంగా, ధైర్యంగా, రంగుల తళుకులతో మెరిసే లుక్ కావాలనుకునేవారికి ప్రింట్ మ్యాక్సింగ్ ఒక బెస్ట్ ఎంపికగా మారింది.

