రిబ్ రీమోడలింగ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్లను విపరీతంగా ఆకర్షిస్తున్న కాస్మెటిక్ ట్రెండ్ గా మారింది. నడుము భాగం సన్నగా, ఆకర్షణీయమైన ‘అవర్ గ్లాస్’ ఆకృతిలోకి రావడానికి చేసే కొత్త కాస్మెటిక్ సర్జరీనే ఈ రిబ్ రీమోడలింగ్ అంటే. ఈ సర్జరీలో భాగంగా పక్కటెముకలను పూర్తిగా తొలగించకుండా కేవలం వాటి ఆకారాన్ని మాత్రమే మారుస్తారు. జనరల్ అనస్థీషియా ఇచ్చి ఈ ఆపరేషన్ చేస్తారు. ఇందుకోసం వెనుక భాగంలో చాలా చిన్న కోతలు లేదా సూది పరిమాణంలో రంధ్రాలు చేసి సర్జరీ పూర్తిచేస్తారు. కంట్రోల్డ్ ఫ్రాక్చర్ పద్ధతిలో పాక్షికంగా 10, 11, 12వ పక్కటెముకలను విరగ్గొడతారు. ఈ ఎముకలపై ఒత్తిడి తెచ్చి, ప్రత్యేక పరికరం సాయంతో సర్జరీని పూర్తిచేస్తారు. ఇలా విరిగిన ఎముకలను లోపలి వైపుకు వంచి, నడుము సన్నగా కనిపించేలా రీపొజిషన్ చేస్తారు. ఇక సర్జరీ తరువాత మళ్లీ మామూలుగా అయ్యేందుకు మూడు నెలల సమయం పడుతుంది. శస్త్రచికిత్స తరువాత ఎముకలు కొత్త ఆకారంలో సరిగ్గా అతుక్కోవడానికి 3 నెలలపాటు రోజంతా ‘కార్సెట్’ అంటే టైట్ గా ఉండే బెల్ట్ వేసుకోవాలి.
గతంలో రిబ్ రిమూవల్..
గతంలో పక్కటెముకలను పూర్తిగా కోసి తొలగిస్తే నడుము సన్నబడ్డట్టు కనిపించేది. కానీ ఇప్పుడు రిబ్ రీమోడలింగ్ వచ్చాక ఎముకలను తీసేయరు. దీంతో కాలేయం, ప్లీహం వంటి అవయవాలకు పక్కటెముకలు ఇచ్చే రక్షణ అలాగే ఉంటుంది. ఇక నొప్పి విషయానికి వస్తే ఎముకలు విరగ్గొట్టడం వల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది. సర్జరీ ఫెయిల్ అయితే మాత్రం ఊపిరితిత్తుల్లో గాలి చేరటం, రక్తం చేరటం వంటివి జరిగి ప్రాణాంతక సమస్యలు రావచ్చు. ఇక ఇన్ఫెక్షన్లు, ఎముకలు సరిగ్గా అతుక్కోకపోవటంతో శరీరం వంకర టింకరగా మారే ప్రమాదం ఉంటుంది. కేవలం శారీరకంగా అందంగా కనిపించేందుకు ఇలాంటి సర్జరీలు చేయించుకోవటం సురక్షితం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


