Problems with Mobile screening: ఈ రోజుల్లో చాలా మందికి పడుకునే ముందు రీల్స్ చూస్తూ గడపడం, ఫన్ వీడియోలు లేదా కామెడీ షోలు ఎంజాయ్ చేయడం అలవాటైపోయింది. కొందరికి అయితే ఓ సినిమా పూర్తవ్వకపోతే కంటి మీద నిద్ర రాదు. కానీ ఇలా రాత్రి స్క్రీన్ టైమ్ పెంచడం వల్ల శరీరం, మెదడుపై తీవ్రమైన ప్రభావాలు పడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ న్యూరోసైకాలజిస్టు డాక్టర్ డేనియల్ అమెన్ తెలిపిన మేరకు, “రాత్రి స్క్రీన్ ముందు గడపడం అంటే… మన శ్రేయస్సును తక్కువ మొత్తానికి అమ్ముకోవడమే” అని ఆయన స్పష్టం చేశారు. సరదా కోసం ఇలా నిద్రను త్యాగం చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలు, పొందే తాత్కాలిక ఆనందాన్ని మించిపోతాయన్నది ఆయన ఉద్దేశ్యం.
మన మెదడు రోజుకి 60 వేలు నుంచి 80 వేల ఆలోచనలు చేస్తుంది. వీటిలో కొన్ని వ్యక్తిగత విషయాలు, మరికొన్ని వృత్తిపరమైనవి, ఇంకా ఇతరుల గురించి అనేకముంటాయి. రోజంతా ఈ ఆలోచనలతో మెదడు బాగా పని చేసిన తర్వాత… మళ్లీ ఫ్రెష్ అయ్యేందుకు నిద్ర చాలా అవసరం. రాత్రి సరిపడా నిద్రపోతే మెదడులో రక్తప్రసరణ మెరుగవుతుంది, జ్ఞాపకశక్తి బలపడుతుంది, తద్వారా మరుసటి రోజు పనులు చురుకుగా చేయగలుగుతారు. నిద్రలేమి కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, ఆలోచనల్లో మత్తుగా అనిపించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక క్షణం ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల.. ఎంతో కీలకమైన నిర్ణయాలను వదులుకోవాల్సి రావొచ్చు.
టీవీ చూడటం, ఫోన్‌లో వీడియోలు చూసుకుంటూ పడుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వీటి నుంచి వెలువడే నీలి కాంతి (Blue Light) శరీరంలో నిద్రకు సంకేతమిచ్చే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ఫలితంగా నిద్ర రాక, ఒత్తిడి పెరగడం, క్రమంగా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఫోన్ వాడాల్సిన అవసరం వస్తే, స్క్రీన్‌పై బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ మోడ్ ఉపయోగించడం మంచి చర్య. అలాగే పడుకునే కనీసం ఒక గంట ముందు నుండి స్క్రీన్ డివైస్‌లకు దూరంగా ఉండటం ఉత్తమం. వీటి నుంచి బయటపడాలంటే నిద్రను ప్రేమించాలి… అంటే జీవితాన్ని ప్రేమించినట్టే. రోజంతా శక్తివంతంగా ఉండేందుకు, మెదడుకు రీసెట్ కావాలంటే సమయానికి పడుకోవడం తప్పనిసరి. సరిపడా నిద్ర వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఏ విషయమైనా స్పష్టంగా ఆలోచించగలుగుతారు. నిపుణులు చెబుతున్నట్లుగా, “మీరు రేపు మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, ఈరోజే అరగంట ముందుగానే పడుకోవాలి.”