Mansoon VS Fridge: వర్షాకాలం రాగానే వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఎండకాలం తర్వాత వచ్చే ఈ చల్లని వాతావరణం మనసుకు హాయినిచ్చినా, కొన్నిసార్లు అనుకోని సమస్యలను తెస్తుంది. ఈ సమయంలో తేమ శాతం గణనీయంగా పెరగడం వల్ల మన ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాల నుండి ఆహార పదార్థాల వరకు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తేమ కారణంగా త్వరగా పాడైపోవడం జరుగుతు ఉంటుంది.
తేమ ఎక్కువగా..
వానాకాలంలో ఫ్రిజ్ లోపల తేమ ఎక్కువగా చేరుతుంది. ఫలితంగా, కూరగాయలు, పండ్లు, వండిన వంటలు కూడా చాలా త్వరగా పాడైపోతాయి. కుళ్లిన ఆహారం నుంచి వచ్చే వాసన ఫ్రిజ్ తెరిచినప్పుడు అసహనంగా అనిపిస్తుంది. చాలామంది దీన్ని నివారించడానికి మార్కెట్‌లో దొరికే ప్రత్యేక ఉత్పత్తులు వాడతారు. కానీ ఇంట్లోనే ఉండే ఒక సులభమైన పదార్థంతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఆ పదార్థం — ఉప్పు.
తేమను పీల్చుకునే గుణం..
ఉప్పుకు సహజంగా తేమను పీల్చుకునే గుణం ఉంది. ఫ్రిజ్‌ను తరచుగా తెరిచినప్పుడు బయట గాలిలోని తేమ లోపలికి చేరుతుంది. ఈ తేమ వలన బ్యాక్టీరియా వేగంగా పెరిగి ఆహారం పాడవడానికి కారణమవుతుంది. ఒక చిన్న గిన్నెలో ఉప్పు వేసి ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా లోపలి అదనపు తేమను ఇది గ్రహిస్తుంది. తేమ తగ్గిపోవడంతో ఫ్రిజ్ పొడిగా ఉండి బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది.
దుర్వాసనను కూడా..
తేమతో పాటు, ఉప్పు దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలు లేదా వండిన వంటకాల నుంచి వచ్చే వాసనలను ఇది ఆకర్షించి లోపలి వాతావరణాన్ని తాజాగా ఉంచుతుంది. ఇలా చేస్తే వానాకాలంలో కూడా ఫ్రిజ్ ఎప్పుడూ శుభ్రంగా, సువాసనగా ఉంటుంది.
ఉప్పు వాడే విధానం..
ఉప్పు వాడే విధానం కూడా చాలా సులభం. ఒక గిన్నెలో సరిపడా ఉప్పు వేసి ఫ్రిజ్ లోపల ఉంచాలి. ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఆ ఉప్పును తీసేసి కొత్త ఉప్పు పెట్టాలి. ఎందుకంటే తేమ, వాసనలను పీల్చుకున్న తర్వాత పాత ఉప్పు తన ప్రభావాన్ని కోల్పోతుంది.
ఈ చిన్న మార్పుతో వర్షాకాలంలో వచ్చే ఫ్రిజ్ సమస్యలను నివారించవచ్చు. ఖరీదైన ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే ఉన్న ఉప్పుతో ఫ్రిజ్‌ను తాజాగా ఉంచుకోవచ్చు. ఇది సులభం, చవక, సమర్థవంతమైన మార్గం.


