Homeలైఫ్ స్టైల్Single Women: సింగిల్‌ ఉమెన్‌.. నిశ్శబ్ధ సమరం నిలువెత్తు విజయం

Single Women: సింగిల్‌ ఉమెన్‌.. నిశ్శబ్ధ సమరం నిలువెత్తు విజయం

Single Women silent battle a resounding victory: ఆమె అడుగుజాడల్లో ఆత్మగౌరవ సంతకం ఉంటుంది. కానీ, ఆమె నడిచే దారి పొడవునా సమాజపు సందేహాల ముళ్లు పరుచుకునే ఉంటాయి! పరిమితుల గీతలను దాటి, స్వశక్తితో కుటుంబ శకటాన్ని ఒంటరిగా ఈడుస్తున్న ‘సింగిల్ వర్కింగ్ వుమెన్’ కథ నిశ్శబ్ద పోరాటాల సమాహారం. ఈనాటి డిజిటల్ యుగంలో సాధికారత వికాసం బాట నడుస్తున్నప్పటికీ, ఒంటరిగా నిలబడ్డ మహిళను గౌరవించే నైతిక పరిణతి మన సామాజిక దృక్కోణంలో నేటికీ లోపిస్తోంది. “జీవితపు తుఫాన్లను తట్టుకుని, స్వయంశక్తితో స్వీయ ఉనికిని నిర్మించుకున్న ప్రతి ఒంటరి మహిళా శ్రమకు ఒక నిలువెత్తు నిదర్శనం! ప్రతి ఏటా ‘ఆగస్టు 4’న జరుపుకునే ‘సింగిల్ వర్కింగ్ ఉమెన్స్ డే’ కేవలం ఒక తేది మాత్రమే కాదు, పరిమితుల ప్రహరీలను దాటి, ఆత్మగౌరవంతో జీవిస్తున్న కోట్లాది ఒంటరి ఉద్యోగినుల నిశ్శబ్ద పోరాటాలను, వారి అజేయమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెప్పే రోజు. కాలానుగుణంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నా, నగరాల నుంచి పల్లెల వరకు తమ రెక్కల కష్టంతో కుటుంబాలను ఈదుతున్న ‘సింగిల్ వర్కింగ్ వుమెన్స్’ పట్ల సమాజంలో మారాల్సిన సంకుచిత దృక్పథాన్ని ఈ రోజు మనకు పునరావృతం చేస్తోంది!” ప్రపంచం ఎంత అభివృద్ధి పథంలో సాగుతున్నా సరే మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. మహిళల్లో కూడా విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నప్పటికీ, పురుషాధిక్య సమాజంలో మహిళలు చాలా సందర్భాల్లో ద్వితీయ శ్రేణి పౌరురాలిగానే మిగిలిపోతోంది. నగరాల నుంచి పల్లెల వరకు వివిధ ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు భద్రత ప్రశ్నార్థకమే. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, లింగ వివక్ష కనిపించని ప్రతిబంధకాలే. కాలక్రమేణా విద్యావంతులైన మహిళల సంఖ్య పెరగడం, స్త్రీపురుషులిద్దరూ పని చేస్తే తప్ప గడవని స్థితిగతులు ఇలా కారణాలేవైనా సరే కొంతవరకు సమాజ దృక్కోణంలో మహిళల అస్తిత్వం విషయంలో సానుకూల మార్పు కనిపిస్తున్న మాట వాస్తవమే. వర్కింగ్ ఉమెన్ లేదా ఉద్యోగం చేసే మహిళల విషయంలో అంగీకార ధోరణి వచ్చినా సరే, వారి వెనుక ఉన్న సమస్యల తీవ్రత మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా తమ ఉద్యోగ, ఉపాధుల్లో ఉన్న “సింగిల్ వర్కింగ్ వుమెన్స్” పనులు చేసుకుంటున్న ఒంటరి మహిళలు అనుభవిస్తున్న వేదనలు వర్ణనాతీతం. పురుషులు లేదా వివాహిత మహిళలతో ధీటుగా, కొన్నిసార్లు వారికంటే మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికీ ఒంటరి మహిళల సమస్యలు రోజురోజుకూ మరింత జటిలంగా తయారవుతున్నాయి.

- Advertisement -

‘సింగిల్ వర్కింగ్ వుమెన్’ అంటే?

వివాహం కానివారు, వ్యక్తిగత నిర్ణయంతో వివాహం చేసుకోకూడదని అనుకున్నవారు, దురదృష్టవశాత్తూ భర్తను కోల్పోయి వితంతువులుగా మారినవారు, లేదా విడాకులు పొంది ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉద్యోగం/ఉపాధి పొందుతున్న మహిళలను మనం “సింగిల్ వర్కింగ్ వుమెన్” (పనులు చేసుకుంటున్న ఒంటరి మహిళలు) అని పిలుస్తున్నాం. ఈ మహిళలు కేవలం తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా, తమ కుటుంబ భారాలను మోస్తూ, పిల్లల చదువులు, పోషోణ, వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తూ వృత్తిపరంగా రాణిస్తున్నారు. ఇలాంటి ఒంటరి మహిళల పట్ల సమాజంలో రకరకాల అపోహలు ఉన్నాయి. వారి వ్యక్తిత్వాన్ని, శ్రమను కించపరచడం నిత్యకృత్యమైంది. ఒంటరి వర్కింగ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజంలో అవగాహన పెంచడానికి, వారి శ్రమను, సాధిస్తున్న విజయాలను గుర్తించి అభినందించడానికి అమెరికాకు చెందిన “బార్బారా పైనే” అనే మహిళ చొరవతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆమె కృషి ఫలితంగానే ప్రతి సంవత్సరం ఆగస్టు 04న “సింగిల్ వర్కింగ్ వుమెన్స్ దినం” పాటించడం జరుగుతోంది. ఒంటరి మహిళలు ప్రదర్శిస్తున్న నిబద్ధత, సృజనాత్మకత, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కుటుంబ భారాన్ని మోయడంలో వారు చూపుతున్న వర్క్ లైఫ్ బాలెన్స్ నిజంగా ప్రశంసనీయం. కానీ, వీటిని గుర్తించకుండా నేటికీ వారిపై లింగ వివక్ష రుద్దడం, కించపరచడం అత్యంత శోచనీయం.

ప్రధాన సమస్యలేమిటి?

భారతీయ సామాజిక నిర్మాణంలో కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువ. ఈ క్రమంలో ఒక మహిళ ఒంటరిగా జీవించడం లేదా ఉద్యోగం చేయడం పట్ల సమాజంలో అనేక రుగ్మతలు కనిపిస్తున్నాయి. వివిధ అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం భారతీయ ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన జటిల సమస్యల గురించి విస్తృత చర్చ జరగాల్సి ఉంది.

సామాజిక దురభిప్రాయాలు..

వివాహం కాలేదనో, విడాకులు అయ్యాయనో లేదా వితంతువు అనో ఒంటరి మహిళలను చులకనగా చూడడం, వారి క్యారెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం నిత్యకృత్యమైంది.

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, లింగ వివక్ష..

ఒంటరిగా ఉండే మహిళలను తేలికగా లొంగదీసుకోవచ్చనే ఆలోచన ఉన్న సహోద్యోగులు, పై అధికారులు పని ప్రదేశాల్లో తీవ్ర వేధింపులకు గురిచేస్తుంటారు.

తక్కువ వేతనాలు, ప్రమోషన్లలో అన్యాయం..

వివాహిత మహిళలతో లేదా పురుషులతో పోలిస్తే, ఒంటరి మహిళలు ఎంత కష్టపడి మెరుగైన ఫలితాలు అందించినా వారికి రావాల్సిన వేతనాల్లో పెరుగుదల, ప్రమోషన్లు కల్పించకుండా చిన్నచూపు చూస్తున్నారు.

అద్దె ఇళ్లు లభించకపోవడం, నివాస అభద్రత..

సొంత ఊరు వదిలి ఉద్యోగ రీత్యా పట్టణాలు, నగరాలకు వచ్చే ఒంటరి మహిళలకు సురక్షితమైన ఇల్లు లభించడం కష్టమే. అద్దె ఇల్లు ఇవ్వడానికి యజమానులు సందేహించడం, అనేక ఆంక్షలు విధించడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నవారెందరో.

ఆర్థిక అభద్రత, రుణ సదుపాయాల లోపం..

ఒంటరి మహిళలకు అత్యవసర ఆర్థిక సాయం లేదా బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో చాలా అడ్డంకులు ఉంటాయి. షూరిటీలు, పూచీకత్తుల పేరుతో బ్యాంకులు కూడా వారి విషయంలో వివక్షే చూపుతుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళన..

ఒకవైపు ఆఫీసు పనులు, మరోవైపు ఇంటి బాధ్యతలు, ఇంకోవైపు సమాజం చల్లే బురద – వీటన్నింటినీ ఒంటరిగా భరించాల్సి రావడం వల్ల సింగిల్ వర్కింగ్ వుమెన్స్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవక తప్పని పరిస్థితి. ఇది క్రమంగా డిప్రెషన్, నిద్రలేమి, యాంగ్జైటీ వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ఒంటరి మహిళల మానసిక, సామాజిక స్థితి

సామాజిక అధ్యయనాలు చెబుతున్న దాన్ని బట్టి ఒంటరిగా పనిచేసే మహిళలు ప్రతి విషయంలోనూ తమను తాము నిరూపించుకోవాల్సిన నిరంతర ఒత్తిడిలో ఉంటారు. “ఒక ఒంటరి మహిళ సాధించిన విజయాన్ని గౌరవించడం కంటే, ఆమె ఒంటరిగా ఎందుకు ఉందనే ఉత్సుకతే మన సమాజంలో ఎక్కువగా ఉంటుంది.” ఈ విధమైన సంకుచిత భావజాలం వల్ల వారు సొంత కుటుంబాల్లోనూ, బంధువుల్లోనూ, సమాజంలోనూ నిరాదరణకు గురవుతున్నారు. వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ సమస్యలు, వృత్తిపరమైన వేధింపులు ఒకదానితో ఒకటి తోడై వారిని మరింత కుంగ దీస్తున్నాయని అనడం లో అనుమానం లేదు.

పరిష్కార మార్గాలు..

సింగిల్ వర్కింగ్ వుమెన్స్ ఎదుర్కొంటున్న ఈ జటిల సమస్యలను నివారించి, వారికి అండగా నిలవడానికి అటు సమాజ ధోరణి మారాలి. ఇటు ప్రభుత్వాలు కూడా తమ వంతుగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

మానవ దృక్కోణంలో మార్పు

పౌర సమాజం ఒంటరి మహిళలను సానుభూతితో కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర భావాలను గౌరవిస్తూ సమానత్వంతో ఆదరించాలి.

సమాన పనికి సమాన వేతనం

ఉద్యోగ ప్రదేశాల్లో వివాహ స్థితితో సంబంధం లేకుండా అర్హత, ప్రతిభ ఆధారంగా మాత్రమే వేతనాలు, ప్రమోషన్లు కల్పించేలా చట్టాలను కఠినంగా అమలు చేయాలి.

POSH చట్టం కఠిన అమలు..

ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలో “పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను (POSH)” క్రియాశీలంగా నిర్వహించాలి.

సురక్షిత నివాస వసతులు..

నగరాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఒంటరి వర్కింగ్ మహిళల కోసం సబ్సిడీ ధరలలో ప్రభుత్వ సురక్షిత వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను విరివిగా అందుబాటులో ఉంచాలి.

పిల్లల విద్యావకాశాలు, స్కాలర్‌షిప్‌లు..

సింగిల్ మదర్స్ పిల్లలకు చదువుకోవడానికి, భవిష్యత్తులో స్థిరపడటానికి ప్రత్యేక విద్యార్థివేతనాలు, రిజర్వేషన్ సదుపాయాలు కల్పించాలి. సింగిల్ వర్కింగ్ వుమెన్స్ లేదా ఒంటరిగా ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా నేటి సమాజ పురోగతిలో, కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కృషి, నిబద్ధత, సృజన, ధైర్యం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం. వారిపై ఉన్న దురభిప్రాయాలను పక్కనబెట్టి, వారి సేవలను గుర్తించడం, వారికి అవసరమైన చేయూతనివ్వడం నాగరిక సమాజం యొక్క ప్రాథమిక బాధ్యత. ఒంటరి మహిళల పట్ల సామాజిక దృక్కోణం మారినప్పుడే, వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన పరిస్థితులు అందుబాటులో ఉన్నపుడే “సింగిల్ వర్కింగ్ వుమెన్స్ దినోత్సవం” జరుపుకోవడానికి నిజమైన సార్థకత లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News