The Untold Story of an Icon Marilyn Monroe: హాలీవుడ్ సువర్ణ అధ్యాయంలో తన మోహన రూపంతో, అసాధారణ అభినయంతో తరాల సరిహద్దులను చెరిపేసి ప్రపంచాన్ని సమ్మోహితం చేసిన అందాల తార మర్లిన్ మన్రో. ఒక సామాన్య ఫ్యాక్టరీ కార్మికురాలిగా ప్రస్థానం ప్రారంభించి, హాలీవుడ్ సామ్రాజ్యానికి మహారాణిగా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతటి విస్మయకరమో.. శిఖరాగ్రాన ఉన్నప్పుడే దిగ్భ్రాంతిరకరంగా ముగిసిన ఆమె ముగింపు అంతటి కరచాలనం చేయలేని శూన్యం. కంటికి కనిపించే గ్లామర్ వెనుక ఉన్న నిరుపేద తపన, నిలువెత్తు ప్రజాదరణ తెచ్చిన ఒంటరితనం, ఆమె మరణంతో కోట్లాది అభిమానలు హృదయాలు మూగబోయాయి. సినిమా చరిత్రలోనే ఎప్పటికీ చెరగని ఒక సంచలనాత్మక కావ్యమై నిలిచింది..! ఆగస్టు 5న ఆమె వర్థంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళి. హాలీవుడ్ ‘గోల్డెన్ యుగం’ పేరు వినగానే అందరికంటే ముందుగా గుర్తుకొచ్చే రూపం మర్లిన్ మన్రో. తన అద్భుతమైన సౌందర్యం, ప్రత్యేకమైన శైలి, నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హృదయాలను దోచుకున్న ఈ అందాల దేవత. ఆమె జీవితం ఎంత వెలుగులతో నిండిందో, ఆమె ముగింపు అంతటి చీకటిగా, విషాదకరంగా ముగిసింది.
విమానాల ఫ్యాక్టరీ నుంచి గ్లామర్ ప్రపంచానికి..
మర్లిన్ మన్రో అసలు పేరు నార్మా జీన్ బేకర్. 1942లో తన 16వ ఏటనే జేమ్స్ డోహెర్టీని వివాహం చేసుకున్న నార్మా జీన్ జీవితం ఆరంభంలో చాలా సాధారణమే. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 18 ఏళ్ల వయస్సులో భర్త సైన్యంలో పనిచేస్తుంటే, ఆమె బతుకుదెరువు కోసం ‘రేడియో ప్లేన్’ అనే విమానాల తయారీ ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలిగా చేరింది. సైనిక విమానాలకు రంగులు వేయడం, భాగాలను అసెంబుల్ చేయడమే ఆమె పని. సైనిక ప్రచార పత్రికల కోసం ఫ్యాక్టరీలో పనిచేసే మహిళల ఫోటోలు తీసేందుకు వచ్చిన ఆర్మీ ఫోటోగ్రాఫర్ డేవిడ్ కొనోవర్, నార్మా జీన్‌లోని అసాధారణ సౌందర్యాన్ని, కెమెరా ముందు ఆమెకున్న ప్రత్యేక ఆకర్షణను గ్రహించాడు. “నీ స్థానం ఈ ఫ్యాక్టరీలో కాదు, పత్రికల కవర్ పేజీల మీద ఉండాలి” అన్న ఆయన మాటలు ఆమె జీవితాన్నే మలుపు తిప్పాయి. ఫ్యాక్టరీ ఉద్యోగాన్ని వదిలేసి మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన నార్మా జీన్, అతితక్కువ కాలంలోనే ప్రముఖ పత్రికల కవర్ పేజీలపై మెరిసింది.
హాలీవుడ్ కష్టాలు..
మోడలింగ్‌లో వచ్చిన గుర్తింపుతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, తన పేరును ‘మర్లిన్ మన్రో’గా మార్చుకుంది. అయితే, స్టార్‌డమ్ ఆమెకూ అంత సులువుగా ఏమీ దక్కలేదు. 1946లో ’20ఎత్ సెంచరీ ఫాక్స్ స్టూడియో ఆమెతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పటికీ, అవకాశాలు ఇవ్వకపోగా “కాస్త బొద్దుగా ఉంది” అనే నెపంతో కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించలేదు. ఆ తర్వాత కొలంబియా పిక్చర్స్ నుంచి కూడా తొలగించారు. ఫలితంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. కనీసం కార్ ఇన్‌స్టాల్‌మెంట్, రూమ్ రెంట్ కట్టుకోవడానికి, తినడానికి తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో 1949లో టాం కెల్లీ అనే ఫోటోగ్రాఫర్ వద్ద కేవలం $50 డాలర్ల కోసం ‘గోల్డెన్ డ్రీమ్స్’ పేరుతో న్యూడ్ ఫోటో షూట్ కు ఒప్పుకోవాల్సి వచ్చింది.
నిలబడటమే ఆమె నైజం!
1952 నాటికి మర్లిన్ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో ఈ పాత ఫోటోలతో ఒక క్యాలెండర్ విడుదలై హాలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. పిఆర్ టీమ్ అబద్ధం చెప్పమని సలహా ఇచ్చినప్పటికీ, మన్రో ధైర్యంగా ఇంటర్వ్యూలో సత్యాన్ని ఒప్పుకుంది: “నన్ను క్షమించండి, నా దగ్గర కనీసం తినడానికి తిండికి, రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు. బతకడానికి ఆ పని చేయాల్సి వచ్చింది. అందులో దాచడానికీ, సిగ్గుపడడానికీ ఏమీ లేదు” అని చెప్పింది. ఆమె నిజాయితీకి ప్రపంచం ఫిదా అయింది. ఆ తర్వాత 1953లో ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ మొదటి సంచిక కవర్ పేజీపై ఈ ఫోటోలే ప్రచురితమై హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
మరణం వెనుక ‘మిస్టరీ’!
ప్రపంచాన్ని తన అందంతో ఏలిన మర్లిన్ మన్రో 1962 ఆగస్టు 5న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్లే మరణించిందని, అది ఆత్మహత్య కావచ్చునని అధికారిక నివేదికలు తెలిపినప్పటికీ ఇప్పటికీ ఆమె మరణం వెనుక అనేక వివాదాలు, రాజకీయ కనెక్షన్లు, కుట్ర కోణాలు ఉంటే ఉండవచ్చనే అనుమానాల మధ్య మిస్టరీగానే మిగిలిపోయింది.
పారాసోషల్ రిలేషన్‌షిప్‌కు పరాకాష్ట
మర్లిన్ మన్రో మరణవార్త వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ అభిమాన నటి ఇక లేదనే నిజాన్ని తట్టుకోలేక, ఆమెను విపరీతంగా ఆరాధించే దాదాపు 25 మంది అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక సెలబ్రిటీతో అభిమానులు తమకు తెలియకుండానే ఎంతటి గాఢమైన బంధాన్ని పెంచుకుంటారో, ఆ వ్యక్తి దూరమైనప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడానికి ఈ సంఘటన సంచలనాత్మక ‘పారాసోషల్ రిలేషన్‌షిప్’ కు ఒక చారిత్రక ఉదాహరణగా నిలిచింది. వెండితెరపై ఎప్పటికీ వాడని గులాబీలా మారిన మర్లిన్ మన్రో జీవితం ఎంతటి వెలుగులను చూసిందో, అంతటి చీకటి విషాదాన్ని కూడా చవిచూసింది. దశాబ్దాలు గడుస్తున్నా ఆమె నేటికీ కోట్లాది మంది హృదయాల్లో ఒక చెరగని సంతకమే!
..తరిగొప్పుల వీఎల్ ఎన్ మూర్తి

