కలర్స్ లోనూ ట్రెండీ కలర్స్ ఉంటాయి. అలా ప్రతి సీజన్ లోనూ ఈ కలర్స్ స్టైల్స్ కూడా మారుతుంటాయి. తాజాగా సోర్బెట్ షేడ్స్ ట్రెండ్ నడుస్తోంది. సోర్బెట్ షేడ్స్ అంటే అవేవో కొత్తగా ఊడిపడ్డ రంగులు ఏమాత్రం కాకపోగా జస్ట్ ఐస్ క్రీమ్ లేదా ఫ్రూట్ సోర్బెట్ లా కనిపించే రంగులు మాత్రమే. ఈ రంగుల ప్రత్యేకతల్లా ఒకటే, సోర్బెట్ రంగులు చాలా ఆహ్లాదంగా కనిపిస్తూ మృదువుగా ఉండే లేత రంగులు. బటర్ ఎల్లో, పిస్తా గ్రీన్, పీచ్-స్ట్రాబెర్రీ పింక్, పౌడర్ బ్లూ రంగులు ఈ సోర్బెట్ షేడ్స్ లో భాగమే.
ముదురు రంగులకంటే ఇలాంటి లేలేత రంగులు కళ్లకు బాగా కనిపించటంతో పాటు పెళ్లిళ్ల వంటి సెలబ్రేషన్స్ లో ఎథ్నిక్ వేర్ కు కొత్త లుక్ జోడిస్తాయి. ప్రముఖ ఫ్యాషన్ లేబుల్స్ అన్నీ ఇప్పుడు ఇలాంటి రంగుల కలెక్షన్సే తెస్తుండటంతో సోర్బెట్ రంగులకు గిరాకీ పెరిగింది. ఫ్యాషన్స్ స్వీటెస్ట్ కలర్ ట్రెండ్ గా ఈ ఏడాది నిలిచిన సోర్బెట్ షేడ్స్ రన్వేపైన కూడా బాగా సందడి చేస్తున్నాయి. బట్టలే కాదు యాక్సెసరీస్ కూడా ఈ రంగుల్లో ఉండటం ట్రెండ్ లో భాగం.



