వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు భగభగ మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలను ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఏసీ ఎక్కువసేపు ఆన్‌లో ఉంచితే కరెంట్ బిల్లు భారీగా పెరిగిపోతుంది. ఈ సమస్యతో చాలా మంది సతమతమవుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఏసీ ఎంతసేపు వాడినా కరెంట్ బిల్లు సగం వరకు తగ్గించుకోవచ్చు.
ఏసీని ఎంత సమర్థంగా వాడితే అంత తక్కువ కరెంట్ ఖర్చవుతుంది. ముందుగా, ఏసీ ఉష్ణోగ్రతను 24-26 డిగ్రీల మధ్య సెట్ చేసుకోవడం మంచిది. ఎక్కువ తక్కువ చేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అలాగే గదిలో వేడి గాలి ప్రవేశించకుండా తలుపులు, కిటికీలు బిగించి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గది వేగంగా చల్లబడుతుంది. ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్‌లో ఉంచడం వల్ల గది మొత్తం చల్లదనం సమానంగా వ్యాపిస్తుంది. దీని వలన ఏసీ ఎక్కువ శ్రమించకుండానే గది చల్లబడి, కరెంట్ వినియోగం తగ్గుతుంది. అలాగే, గదిలో లైట్లు, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వేడి విడుదల చేస్తాయి. వీటిని గదిలో తగ్గించడం ద్వారా ఏసీపై ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం కూడా ఎంతో అవసరం. దుమ్ము, ధూళి పేరుకుంటే ఏసీ మరింత శ్రమించాల్సి వస్తుంది. కనీసం నెలకొకసారి ఫిల్టర్‌ను శుభ్రం చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గించుకోవచ్చు. అలాగే, ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీలు సాధారణ ఏసీల కంటే తక్కువ కరెంట్ తీసుకుంటాయి. అందుకే కొత్త ఏసీ కొనుగోలు చేసే సమయంలో ఇన్వర్టర్ మోడల్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
ఇక ఏసీని ఎక్కువకాలం ఉపయోగించాలంటే కనీసం 6 నెలలకు ఒకసారి మైన్టెనెన్స్ చేయించుకోవాలి. సర్వీసింగ్ ద్వారా ఏసీ పనితీరు మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్నచిన్న మార్పులు చేసుకుంటే వేసవిలో ఏసీ వాడినా కరెంట్ బిల్లు భారీగా పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)