Ube Drink Trend: ప్రస్తుత ఫుడ్ ట్రెండ్స్ చూస్తుంటే ఎప్పుడూ ఏదోక కొత్త రుచి ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు మచ్చా డ్రింక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసినట్టే ఇప్పుడు అదే స్థాయిలో దూసుకొస్తున్న కొత్త ట్రెండ్ ఊబ్ డ్రింక్. ఆకర్షణీయమైన లావెండర్ లేదా ఊదా రంగుతో కనిపించే ఈ పానీయం యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది.
ఊబ్ అంటే?
ఊబ్ (Ube) అనేది ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన ఊదా రంగు దుంప. ఇది బయటకు సాధారణ రూట్ వెజిటేబుల్‌లా కనిపించినా, లోపల గాఢమైన పర్పుల్ కలర్‌తో ఉంటుంది. సహజసిద్ధమైన రంగు, ప్రత్యేకమైన రుచి కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ఇండస్ట్రీలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.
ఊబ్ డ్రింక్ స్పెషాలిటీ ఇదే..
ఊబ్‌తో తయారయ్యే డ్రింక్స్‌లో స్వల్ప తీపి రుచి, వెనీలా టచ్, అలాగే నట్టీ ఫ్లేవర్ ఉంటుంది. అంటే ఒక్కసారిగా తాగితే చిలకడదుంప, వైట్ చాక్లెట్, వెనీలా ఫ్లేవర్స్ కలిసిన అనుభూతి కలుగుతుంది. అందుకే కొత్త రుచులు ట్రై చేయడం ఇష్టపడే జెన్ జీకి ఇది బాగా నచ్చుతోంది. ఊబ్ ఇప్పుడు కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు. దీనితో ఎన్నో వెరైటీ డ్రింగ్స్ మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో ఊబ్ లాటే, ఊబ్ ఐస్ కాఫీ, ఊబ్ మిల్క్‌షేక్, ఊబ్ స్మూతీ, ఊబ్ బబుల్ టీ, ఊబ్ సిరప్, ఊబ్ హల్వా, డెజర్ట్స్, ప్రత్యేకంగా ఊబ్ బబుల్ టీ యువతలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఊబ్ హవా
ఊబ్ డ్రింక్‌కి రుచి మాత్రమే కాదు, లుక్ కూడా పెద్ద ప్లస్ పాయింట్. లావెండర్ కలర్‌లో కనిపించే ఈ డ్రింక్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో భారీగా వైరల్ అవుతున్నాయి. అందమైన ప్రెజెంటేషన్‌తో ఇది “ఇన్‌స్టా ఫ్రెండ్లీ డ్రింక్”గా మారింది.
ఫిలిప్పీన్స్ నుంచి ప్రపంచానికి
ఫిలిప్పీన్స్‌లో ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి చెందిన ఊబ్, ఇప్పుడు అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ట్రెండింగ్ ఫుడ్‌గా మారింది. క్రాస్ కల్చరల్ ఫుడ్ బ్లెండ్స్ పెరుగుతున్న ఈ కాలంలో స్థానిక రుచులు గ్లోబల్ ఫేవరెట్స్‌గా మారుతున్నాయి. ఊబ్ కూడా అలాంటి ఫుడ్ స్టార్లలో ఒకటి. మొత్తానికి కొత్త రుచులు, కొత్త రంగులు, కొత్త అనుభూతులు కోరుకునే వారికి ఊబ్ డ్రింక్ ఒక మంచి ఆప్షన్. మచ్చా తర్వాత ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఈ పర్పుల్ డ్రింక్ త్వరలో మన మార్కెట్లో మరింత పెద్ద హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

